గన్ని బ్యాగులు రైతులే కొనుగోలు చేస్తున్నారు
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ నాయక్
నవతెలంగాణ-అచ్చంపేట
అచ్చంపేటలోని మార్కెట్ యార్డ్ లో సీసీ బెడ్ లేక ధాన్యం ఆరేయడానికి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, అదేవిధంగా గన్ని బ్యాగులు ఇవ్వక రైతులు అవస్థలు పడుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దేశ్యానాయక్ అన్నారు. ఆదివారం మార్కెట్ యార్డ్ ను సీపీఐ(ఎం) నాయకులు సందర్శించారు. మొక్కజొన్న కొలకే కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ధాన్యం తెచ్చి మూడు రోజులైనా ఎవరు పట్టించుకోవడంలేదని, సరిపడా బ్యాగులు లేకపోవడంతో రైతులే గన్ని బ్యాగులు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మార్కెట్ యార్డులో రైతులకు వసతులు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కనీసం తాగడానికి మంచి నీళ్లు దొరకడం లేదని, మహిళా రైతులకు టాయిలెట్స్ లేవన్నారు. ప్రభుత్వం పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, సౌకర్యాలు కల్పించడం మర్చిపోయారని అన్నారు. రైతులను పట్టించుకోకపోతే ఆందోళన చేయడానికి సీపీఐ(ఎం) ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు ఎస్. వెంకటయ్య, రైతు సంఘం నాయకులు పర్వతాలు, వాల్య నాయక్ ఉన్నారు.



