Sunday, May 3, 2026
E-PAPER
Homeఖమ్మంప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించాలి

ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించాలి

- Advertisement -

– పామాయిల్ బోర్డు ఏర్పాటు చేయాలి
– రైతులకు భరోసా కల్పించే ప్రతి పథకం అమలు చేయాలి
– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటనలకే పరిమితమయ్యాయని, రైతులకు భరోసా కల్పించే ప్రతి పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణలో భాగంగా ఆదివారం అశ్వారావుపేటకు వచ్చిన ఆయన స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.అకాల వర్షాలు, యూరియా కొరత,కోతుల బెడద వంటి ఇబ్బందులను అధిగమించి రైతు పంటను మార్కెట్‌కు తీసుకువస్తే కొనుగోలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు భరోసా, రైతు భీమా, పంట రుణాల మాఫీ వంటి హామీలను ప్రభుత్వం సకాలంలో అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొబ్బరి బోర్డు, పసుపు బోర్డు తరహాలో పామాయిల్ బోర్డు ఏర్పాటు చేసి, అందులో రైతులకు భాగస్వామ్యం కల్పించాలని అన్నారు. పామాయిల్ సాగులో ఎదురవుతున్న వంధ్యత్వం మొక్కల సమస్య పరిష్కారం, సకాలంలో రాయితీలు, మార్కెట్ వ్యవహారాల్లో పారదర్శకత కల్పించాలని కోరారు. గెలలకు మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా టన్నుకు స్థిరమైన ధర రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులను సమీకరించి, వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరం సత్యనారాయణ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -