Tuesday, May 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ ప్రతీకార రాజకీయాలు

కాంగ్రెస్‌ ప్రతీకార రాజకీయాలు

- Advertisement -

అక్రమాలు, అవినీతిని ప్రశ్నించినందుకే అరెస్టులు
ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ పోరాడుతాం : బీఆర్‌ఎస్‌
వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
జైల్లో మన్నె క్రిశాంక్‌కు పరామర్శ
శనగ కొనుగోలు కేంద్రం సందర్శన

నవతెలంగాణ- మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/కంది/సదాశివపేట
కాంగ్రెస్‌ ప్రభుత్వానివి ప్రతీకార రాజకీయాలని, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే క్రిశాంక్‌పై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు క్రిశాంక్‌ను సోమవారం కేటీఆర్‌ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. రెండున్నరేండ్లుగా ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని మన్నె క్రిశాంక్‌ అడుగడుగునా ప్రశ్నిస్తున్నారని, అరాచకాలను ప్రజల దృష్టికి తెచ్చారని అన్నారు. రేవంత్‌రెడ్డి అల్లుడు, ఆయన బినామీకి చెందిన కంపెనీల బాగోతాలను బయటపెట్టినందుకు మరో కేసు పెట్టారని వివరించారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా నాయకత్వం, బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై మీరు పెట్టే శ్రద్ధలో ఒక్క వంతు రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

కరీంనగర్‌లో పట్టపగలే ఓ జ్యువెలరీ షాపులో దుండగులు చొరబడి నలుగురిని తుపాకీతో కాల్చడంతో వారు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి భయానక పరిస్థితులను పట్టించుకోకుండా ”ఎవరి మీద ఎవరు ట్వీట్‌ పెట్టారు.. ఏం పోస్టు పెట్టారు..?” అనే దానిపై దృష్టి కేంద్రీకరించారని విమర్శించారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు అమలు చేసేదాకా ప్రశ్నిస్తూనే ఉంటాం.. పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌, హ్యాకింగ్‌, జర్నలిస్టులపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
ధాన్యం కొనుగోళ్లలో విఫలం..

సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట రైతు సేవా కేంద్రంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు శనగపంటను తెచ్చి నెలరోజులు దాటినా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనలో రైతులకు 11 సార్లు రైతుబంధు అందించామని గుర్తుచేస్తూ.. ప్రస్తుతం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి కొనసాగుతోందని అన్నారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని తెలిపారు. సివిల్‌ సప్లై కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అందుకే పంటల కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు.

మంత్రులకు భూముల కొనుగోళ్లు, రియల్‌ ఎస్టేట్‌పై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదని విమర్శించారు. మంత్రి దామోదర రాజనర్సింహ రాసిన లేఖతో ప్రభుత్వానికి రైతులపై ఉన్న శ్రద్ధ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. రాబోయే వారం రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తామని తెలిపారు. అవసరమైతే తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో చింతా ప్రభాకర్‌, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకా సంద్‌, డాక్టర్‌ సంజరు కుమార్‌, ఎమ్మెల్సీ శంభిపూర్‌ రాజు, పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, మఠం బిక్షపతి, శివకుమార్‌, సదాశివపేట పట్టణ అధ్యక్షులు చిల్ల మల్లన్న, శివరాజ్‌ పాటిల్‌, చింత గోపాల్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -