కొనుగోలు కేంద్రాలను సందర్శించిన సీపీఐ(ఎం), రైతు సంఘం నేతలు
పాతర్లపాడులో అగ్నికి
ఆహుతైన మొక్కజొన్న
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
పంటల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని, వర్షానికి పంట తడిసిపోతోందని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. సోమవారం పలు జిల్లాల్లో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను నాయకు లు సందర్శించి రైతులతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులనూ పరామర్శించారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం పోరెడ్డిగూడెంలో ధాన్యం కొనుగోలు చేంద్రాన్ని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి సందర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నకిరేకల్ మండలంలోని తాటికల్ గ్రామంలో రైతు సంఘం మహిళా రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌ను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరు మల్లేశం సందర్శించారు. గుండాల మండలంలోని నూనెగూడెం, మరిపడిగ గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీపీఐ(ఎం) నాయకులు సందర్శించి రైతులతో మాట్లాడారు.
వరి, మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలి
హనుమకొండ జిల్లా పరకాల, నడికూడ మండలాలతోపాటు శాయంపేట, మండలం ప్రగతి సింగారం లోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు సారంపల్లి వాసుదేవరెడ్డి, కార్యవర్గ సభ్యులు రాగుల రమేష్, బొట్ల చక్రపాణి సందర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని నాయకులు తెలిపారు. ఒక పక్కన అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు.
షరతులు లేకుండా పంటను కొనాలి :నున్నా
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన మొక్కజొన్న పంటను సీపీఐ(ఎం) నాయకులు పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైందని, ఎటువంటి షరతులూ లేకుండా పూర్తిస్థాయిలో పంటను కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించడంతోపాటు మృత్యువాత పడిన గొర్రెలకు కూడా పరిహారం అందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. పాతర్లపాడు గ్రామంలో సుమారు ఐదు ఎకరాల మొక్కజొన్న కంకులు కుప్పలుగా దగ్ధమవ్వగా, మరో ఎకరన్నర పంట పొలంలోనే కాలిపోయిందని తెలిపారు. అదేవిధంగా నాగలవంచ సొసైటీ పరిధిలో పాతర్లపాడు సహా పలు గ్రామాలకు చెందిన సుమారు 42 మంది రైతుల 120 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైందని, దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతుల వద్ద ఉన్న మొక్కజొన్న పంటను మద్దతు ధరకు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, లేకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ముందు పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.



