నవతెలంగాణ-హైదరాబాద్: సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు విషయాలపై చర్చించింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రు లు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.
రాష్ట్రంలోని భూముల ధరలను సవరించాలనీ, వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చు తగ్గులున్న భూములను క్రమబద్ధీకరించాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ అవసరాల కోసం తీసుకునే భూములకు చెల్లించే పరిహారం విషయంలో ప్రభుత్వం ఇచ్చే రేటుకు, మార్కెట్ రేటుకు భారీ వ్యత్యాసం ఉండటంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. మార్కెట్ విలువలు రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతులు ఇచ్చామన్నారు. ఈ నెల 26 కల్లా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరలను సవరిస్తామని తెలిపారు. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామనీ, భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవాలనీ, దానికి ఇన్‌చార్జీ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని(మదర్ డెయిరీ) నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు అప్పగించే ఎంవోయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందనీ, పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్‌డీడీబీ చూసుకుంటుందని చెప్పారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోని 19 సబ్‌స్టేషన్ల పక్కనున్న ప్రభుత్వ భూముల్లో 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.



