ఎనిమిది ఏండ్లుగా జైలు జీవితం
ముంబయి : ఎల్గర్ పరిషద్ కేసులో విచారణ లేకుండా ఎనిమిది సంవత్సరాలుగా జైలులో నిర్బంధంలో ఉన్న న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌కు బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. 2018లో నమోదైన ఎల్గర్ పరిషద్-భీమా కోరెగావ్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. బెయిల్ మంజూరు అయినప్పటికీ ప్రస్తుతం నవీ ముంబయిలోని తలోజా సెంట్రల్ జైలులో ఉన్న సురేంద్ర వెంటనే విడుదలయ్యే అవకాశం లేదు. మావోయిస్టు దాడికి సంబంధించిన మరో కేసులో ఆయన కస్టడీలో కొనసాగుతుండడమే దీనికి కారణం. కేసులో ఇప్పటికీ విచారణ ప్రారంభం కాలేదని, సురేంద్ర ఎనిమిది సంవత్సరాలుగా అండర్‌ట్రయల్‌గా జైలులో ఉంటున్నారని జస్టిస్ అజరు గడ్కరీ, జస్టిస్ కమల్ ఖాటాలతో కూడిన డివిజన్ బెంచ్ గుర్తు చేసింది. ఈ కేసులోని పదిహేను మంది నిందితులలో పలువురు దాఖలు చేసుకున్న డిశ్ఛార్జ్ దరఖాస్తులను కోర్టు ప్రస్తుతం విచారిస్తోంది.నిందితులపై ఇప్పటికీ అభియోగాలు నమోదు కాలేదు. అండర్‌ట్రయల్ ఖైదీగా దీర్ఘకాలం నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఊరట పొందడానికి అర్హుడని కోర్టు అభిప్రాయపడింది. సురేంద్రను 2018లో పూనేకు చెందిన ఉగ్రవాద నిరోధక దళం అరెస్ట్ చేసింది. ఎన్‌ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీటులో 16 మంది నిందితుల పేర్లు ఉండగా వారిలో సరేంద్ర ఒకరు. నిషిద్ధ మావోయిస్టు గ్రూపులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఐపీసీ నిబంధనల కింద సురేంద్రపై కేసు పెట్టారు.
ఎల్గర్ పరిషద్ కేసులోసురేంద్ర గాడ్లింగ్‌కు బెయిల్
- Advertisement -
- Advertisement -



