నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో విషాదం నెలకొంది. 13 కృష్ణ జింకలు (blackbucks) బావిలో పడి మరణించాయి. జిల్లాలోని ఖర్దౌన్‌కలాన్ సమీపంలో బుధవారం వ్యవసాయ క్షేత్రం బావి నుండి దుర్వాసన రావడాన్ని గమనించిన రైతు.. అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి ఘటనా స్థలానికి చేరుకుని, బావిలో ఉన్న 13 కృష్ణ జింకల (నాలుగు మగ మరియు తొమ్మిది ఆడ జింకలు) లతో పాటు ఒక వీధి కుక్క కళేబరాన్ని కూడా బయటకు తీశారు.
షాజాపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) హేమలత షా మాట్లాడుతూ.. “ఈ ఘటనలో ఓ వీధి కుక్క కృష్ణజింకల మందను వెంబడించింది. తప్పించుకునే ప్రయత్నంలో ఆ జింకలు బావిలో పడిపోగా, ఆ కుక్క కూడా అందులోనే పడిపోయింది. మేము వాటన్నింటినీ బయటకు తీసి, పోస్ట్‌మార్టం నిర్వహించి, నమూనాలను సేకరించాము, ప్రస్తుతం వాటిని విశ్లేషిస్తున్నాము.” అని తెలియజేశారు.



