బయట కొనాలంటే మోయలేనంత ధరలు అప్పులు చేసి కొనుగోలు..
కిట్ల కోసం కిడ్నీ రోగుల పోరాటం
ప్రాణాలతో ఈఎస్‌ఐ కార్పొరేషన్ చెలగాటం
అత్యవసర వైద్య పరికరాల పట్ల నిర్లక్ష్యం
ఇప్పటికే ముగ్గురు మృతి మరి కొందరికి సీరియస్..
న్యాయస్థానం మందలించినా ఖాతరు చేయని వైనం
‘నవతెలంగాణ’ పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు
ఎస్.వెంకన్న
కార్మికులకు ఈఎస్‌ఐ ఆస్ప్రతులే దిక్కు. వేలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బయట వైద్యం చేయించుకోలేరు. ఈఎస్‌ఐ ఆస్ప్రతి వైద్యం మీద ఆధారపడుతున్నారు. ఈఎస్‌ఐ వైద్యం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నామని చెబుతున్నాయి. కానీ అవసరమైన సందర్భా ల్లో కావల్సిన వైద్య పరికరాలు అక్కడ ఉండవు. ఇంటి వద్దే డయాలసిస్ చేసుకు నేందుకు అవసరమైన సీఏపీడీ కిట్లు సకాలం లో అందకపోవడంతో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్రాణాలను నిలబెట్టే ఈ కిట్ల సరఫరాలో నెలకున్న అంతరాయం రోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం, ఈ.ఎస్.ఐ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోరు. వారి నిర్లక్ష్యం కిడ్నీ రోగుల పట్ల శాపంగా మారుతున్నాయి. వైద్యుల ఈఎస్‌ఐల్లో సీఏపీడీ కిట్ల కొరత సూచనల ప్రకారం సీఏపీడి రోగులకు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఒక్క రోజు కిట్ అందకపోయినా ఇన్‌ఫెక్షన్లు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నెఫ్రాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈఎస్‌ఐ కిడ్నీ రోగులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై నవతెలంగాణ పరిశీలించినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమ్మకు సీఏపీడీ కిట్లు లేవు.. ఇప్పుడు ఎలా?
హైదరాబాద్‌లోని ప్రముఖ ఈఎస్ఐ ఆస్పత్రి మెడికల్ షాపు ముందు ఓ యువకుడు చేతులు జోడించి కూర్చున్నాడు. అతని తల్లి సీకేడీ(క్రానిక్ కిడ్ని డిసీజ్) వ్యాధితో బాధపడుతోంది. డయాలసిస్ చికిత్స కోసం సీఏపీడి కిట్లు, క్యాసెట్లు, డ్రెయిన్ బ్యాగులు, ఇతర మందులు కోసం ఎదురు చూస్తున్నాడు. బయట కొనాలంటే వాటి ధరలు మోయలేనంతగా ఉన్నాయి. అతనితో నవ తెలంగాణ మాట్లాడినప్పుడు “డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాశారు, కానీ ఫార్మసీలో అవి లేవంటున్నారు. కొన్ని నెల్లుగా ఇదే తంతు. ఈఎస్‌ఐ ఉందన్న భరోసా..కానీ..అమ్మకు అవసరమైన ఆ కిట్లు ఇక్కడ లేవు. ఇప్పుడు మా అమ్మ పరిస్థితి ఏంటి? ఆమెను బతికించుకోవటం ఎలా? నేనేం చేయాలి’’? అంటూకన్నీటి పర్యంతమయ్యారు వినోద్ రెడ్డి అనే యువకుడు.
అతని పక్కనే కట్టా శ్రీనివాసరావు అనే మరో యువకుడు కూర్చుని ఉన్నాడు.అతని భార్యకు కిడ్నీ సమస్య. ఆమెను బతికించుకోవటం కోసం అప్పులు చేశాడు. ఆస్తులమ్మాడు. డయాలసిస్ కిట్ల కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టాడు. కండ్లలో నీళ్లు ఒత్తుకుంటూ, పంటి బిగువుతో “మా ఆవిడకి వేయటానికి ట్యూబ్ లేదని ఇక్కడి వాళ్లు చెబుతున్నారు. అంటే ఆమె బతుక్కి భరోసా లేనట్టేగా…’ అంటూ బోరున ఏడ్చాడు.
మహమ్మద్ రహమత్ అలీ కూతురు మిష్కాత్ ఫాతిమా(6), అతి చిన్న వయసులోనే దీర్ఘకాలిక సీకేడీ వ్యాధికి గురైంది. ఆమె బాధ వర్ణనాతీతం. పాపకు అవసరమైన కిట్ల కోసమే అలీ కూడా ఎదురు చూస్తున్నాడు. ఆమెను బతికించుకోవటం కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. కిట్లు ఎప్పుడొస్తయోనని ఎదురు చూస్తున్నాడు. ఇది ఒకరిద్దరి ముగ్గురి సమస్య కాదు..రోజుకి వందల మంది ఎదుర్కొంటున్న సీఏపీడి రోగుల సమస్య.
ఈఎస్‌ఐ నిర్లక్ష్యం…
ఇందుకు సంబంధించి మూలాల్లోకి వెళితే… ఈఎస్‌ఐ నిర్లక్ష్యంతోనే సీఏపీడి కిట్ల కొరత ఏర్పడిందని తెలిసింది. అక్కడ మందుల కొనుగోలు, సరఫరా విధానంలో తీవ్రమైన లోపాలున్నాయి. కార్మిక రాజ్య బీమా ఆస్పత్రుల్లో క్యాన్సర్, మూత్రపిండాలు, కాలేయం, ఆస్తమా రోగులు మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. సీఏపీడీ రోగులకు అవసరమయ్యే జీవనాధార మందులు కూడా అందుబాటులో లేవు. జీవనాధార మందుల గురించి కేంద్ర ప్రభుత్వం ఎక్కడలేని ప్రచారం కల్పిస్తోంది. కానీ రోగులకు ఆ మందులు అందవు. గతేడాది అక్టోబర్‌లో సీఏపీడీ కిట్ల టెండర్ గడువు ముగిసింది. కానీ..నేటికీ కొత్త టెండర్‌ను పిలవలేదు. మందులను కొనుగోలూ చేయలేదు. వాటి సరఫరాకు ఏర్పడ్డ అంతరాయాన్ని పరిష్కరించటం లేదు. ఆ రోగులకు మందులు ఎలా అందుతాయి? అధికారుల నిర్లక్ష్యం వల్ల డయాలసిస్ రోగులకు ప్లూయీడ్స్, వినియోగ వస్తువులు అందడం లేదు. కొంత కాలం ‘‘ఆన్ ఎకౌంట్’’ బడ్జెట్ ద్వారా కిట్లను సరఫరా చేశారు. ఆ తర్వాత ఈఎస్‌ఐసీ కార్పొరేషన్, రాష్ట్ర ఈఎస్‌ఐ మధ్య సమన్వయ లోపంతో కొనుగోలు చేసేందుకు వెనకాడుతున్నట్టు సమాచారం. ఇదంతా ఈఎస్‌ఐ కార్పొరేషన్‌లోని అధికార వర్గాల ద్వారా వెల్లడైంది. మరో పక్క సరఫరాదారులకు బకాయిలు పేరుకుపోయాయి. అవి నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. వాటిని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని దుస్థితి. బాధితులకు మందులందించే బాధ్యతనుండి కార్పొరేషన్ తప్పుకుంది. మరో పక్క దీనిపై రాష్ట్ర ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టరేట్ తగిన విధంగా శ్రద్ధ పెట్టడం లేదని తెలిసింది. దీంతో కిట్ల ప్రక్రియ ఆగిపోయింది. గతంలో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుత సమస్యకు కారణమని తెలుస్తోంది. అయినా ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, అధికారులు చొరవచూపడం లేదు. టెండర్‌ల్లో గోల్‌మాల్ జరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని అధికారులు భయపడుతున్నారని తెలిసింది.
రోగులపై ప్రభావం..
ఈఎస్‌ఐ అధికారుల నిర్లక్ష్యం వల్ల రోగులకు ఉచితంగా లభించాల్సిన మందులను వారు ప్రయివేటుగా మెడికల్ షాపుల్లో సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొన్ని మందులు రూ. వేలల్లోనూ, మరి కొన్ని రూ.లక్షల ఖరీదు చేస్తుండటంతో చిరుద్యోగులు అప్పులపాలవుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు అమ్ముకుంటున్నారు.తద్వారా బయట నుంచి డయాలసిస్ ఫ్లూయిడ్స్, కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు… మందుల కొరతతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు చికిత్సలో చికిత్సల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకోవటంతో వాని ఆందోళన మరింత పెరుగుతోంది. కిట్లు సకాలంలో అందకపోవటంతో జూలై 15న భరత్‌చంద్ర,16న శ్రీకాంత్, అంతకు ముందు మరొకరు చనిపోయారు. మరి కొందరికి సీరియస్‌గా ఉండటంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచక విలవిల్లాడుతున్నారు.
ఇంటి వద్దే డయాలసిస్..
కిడ్నీలు సరిగా పనిచేయని రోగులకు సీఏపీడీ విధానం ఎంతో కీలకం. ఆస్పత్రికి పదేపదే వెళ్లకుండా వైద్యుల సూచనల మేరకు ఇంటి వద్దే పెరిటోనియల్ డయాలసిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక డయాలసిస్ ద్రావణాలు, కిట్లు, ఇతర అవసరమైన సామాగ్రి నిరంతరం అందుబాటులో ఉండాలి. ఒక్క రోజు చికిత్సలో అంతరాయం కలిగినా రోగి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని నెఫ్రాజలిస్టులు చెబుతున్నారు.
హైకోర్టు జోక్యం చేసుకున్నా..
కిట్లు, ఇతర మందుల సరఫరాలో జాప్యంపై ఇటీవల బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఈఎస్‌ఐసీ అధికారులను మందలించింది. ఆ తర్వాతే ఇటీవల సరఫరాను కొంతవరకు పునరుద్ధరించారు. కోర్టు మెట్లెక్కిన వారికి మాత్రమే వాటిని అందించటం విశేషం.
కిట్లు
‘కిడ్ని బాధిత రోగులకు అవసరమైన బ్యాక్స్టార్ కంపెనీ సీఏపీడి కిట్లు, డయాల్సిస్ ప్లూయిడ్స్ సంబధిత వినియోగ సామాగ్రిని తక్షణమే కొనుగోలు చేసి బాధితులకు నిరంతరం సరఫరా చేయాలి.
‘ఐపీ ఓవర్ వీఐపీ’ అనేది ఈఎస్‌ఐ ప్రకటించుకున్న నినాదమే తప్ప, ఆచరణలో కనిపంచడం లేదు. కార్మికులు, యాజమాన్యాలు చెల్లించే ఈఎస్‌ఐ చందాలతో నడిచే ఈ వైద్య వ్యవస్థలో అదే కార్మికులు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి రావడం బాధాకరం. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి. రోగులకు తగిన విధంగా వైద్య సదుపాయాలు కల్పించాలి…’
బి అర్జున్, ఈఎస్‌ఐసీ మాజీ బోర్డు సభ్యులు
ఈఎస్‌ఐల్లో సీఏపీడీ కిట్ల కొరత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



