Monday, September 7, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీని ఓడించటమే లక్ష్యం

బీజేపీని ఓడించటమే లక్ష్యం

- Advertisement -

ఆపార్టీకి మరో అవకాశం ఇవ్వం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) కార్యాచరణ
భయాన్ని ఛేదించిన జంతర్‌మంతర్ విద్యార్థి ఉద్యమం
ప్రభుత్వానికి తలవంచక తప్పలేదు
వ్యక్తిగత ప్రయోజనం కంటే పార్టీ ప్రయోజనమే ముఖ్యం
తప్పులు, లోపాలను గుర్తించి సరిదిద్దుకుంటాంబలమైన కార్మికవర్గ విప్లవ పార్టీగా సీపీఐ(ఎం)ను తీర్చిదిద్దడమే లక్ష్యం
పొలిట్‌‌బ్యూరో సమావేశ వివరాలు వెల్లడించిన
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎమ్‌ఏ బేబీ

నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ సహా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సంఘ్‌పరివార్‌ను ఓడించడమే లక్ష్యంగా సీపీఐ(ఎం) పనిచేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్‌ఏ బేబీ స్పష్టం చేశారు. జంతర్‌మం తర్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమంతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాల ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పారు. రెండ్రోజులపాటు ఆపార్టీ కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్‌)లో జరిగిన పొలిట్‌‌బ్యూరో సమావేశ వివరాలను ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. బీజేపీ, సంఘ్‌పరివార్‌ శక్తులను ఓడించేందుకు ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యతను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పంజాబ్‌ సహా బీజేపీని ఓడించే అవకాశాలు అత్యధికంగా ఉన్న అభ్యర్థికి సీపీఐ(ఎం) మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ అంశంపై పంజాబ్‌ రాష్ట్ర కమిటీ ఇప్పటికే సమగ్రంగా చర్చించిందనీ, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీని ఓడిం చేందుకు సీపీఐ(ఎం) పనిచేస్తుందన్నారు.
​విద్యార్థులు భ‌య‌ప‌డ‌కుండా 
మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మోడీ ప్రభుత్వం, సంఘ్‌పరివార్‌ కొంతకాలంగా దేశంలో సృష్టిస్తున్న భయానక వాతావరణాన్ని జంతర్‌మంతర్‌ విద్యార్థి ఉద్యమం బద్దలు కొట్టిందని ఎమ్‌ఏ బేబీ చెప్పారు. ఎలాంటి భయానికీ లొంగకుండా విద్యార్థులు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని గుర్తుచేశారు. విద్యార్థి ఉద్యమం ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదన్నారు. సీజేపీ, ఎస్‌ఎఫ్‌ఐతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు జంతర్‌మంతర్‌ ఉద్యమానికి నాయకత్వం వహించాయని చెప్పారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించిందన్నారు. బీహార్‌లోని బంకిపూర్‌ ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురైన ఓటమి కూడా జంతర్‌మంతర్‌ ఉద్యమ ప్రభావానికి నిదర్శనమని అన్నారు.

​రైతు, కార్మిక ఉద్యమాలతో…
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రైతులు, కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహించాయని గుర్తుచేశారు. ఉద్యమాలు బలంగా సాగిన ప్రాంతాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని, స్వల్ప మెజారిటీతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీకి మరో అవకాశం ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వాటి ప్రభావాన్ని ఎన్నికల రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీ ప్రయోజనాలే ముఖ్యం
పార్టీ రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలను ఉన్నతంగా ఉంచడమే సీపీఐ(ఎం) సభ్యులు పాటించాల్సిన నిబంధన అని ఎమ్‌ఏ బేబీ తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో అభిప్రాయ భేదాలు, ఫిర్యాదులు ఉండవచ్చనీ, వాటిని సంబంధిత పార్టీ కమిటీలు, వేదికల్లోనే ప్రస్తావించి అంతర్గత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఫిర్యాదులు, మనోవేదనల పేరుతో పార్టీకి వ్యతిరేకంగా ఓటేసే స్థాయికి వెళ్లడం సరికాదన్నారు. ఎలాంటి పరిస్థితు ల్లోనైనా పార్టీకి అండగా నిలవాల్సిన బాధ్యత నుంచి వైదొలగడం తప్పేనని అన్నారు. కేరళతోపాటు పలు ప్రాంతాల్లో పార్టీ నేతలు ఇదే విషయాన్ని స్పష్టం చేశార న్నారు. పార్టీకి ఓటు వేయకుండా ప్రత్యర్థులకు ఓటేసిన వారు తమ తప్పును గ్ర‌హించాల‌ని సూచించారు.

​తప్పులు దిద్దుకుంటాం
కేర‌ళ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పార్టీ అవసరమైన సమీక్ష నిర్వహిస్తుందని బేబీ తెలిపారు. ఈ పరిశీలన జిల్లా స్థాయి నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. కన్నూరు జిల్లా క‌మిటీ ఇప్పటికే అవసరమైన సమీక్ష నిర్వహించిందనీ, అభ్యర్థుల ఎంపికలో తప్పులు జరిగాయని గుర్తించిందన్నారు. తప్పులు, పొరపాట్లు జరిగితే వాటిని అంగీకరించి, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని సరిదిద్దుకునే పార్టీ సీపీఐ(ఎం) అని స్పష్టం చేశారు.

​పునరుద్ధరణకు అంతర్గత చర్చలు
​కేరళలో జరగనున్న రాష్ట్ర విస్తృత స్థాయి స‌మావేశంలో పార్టీ తప్పులు, లోపాలను సరిదిద్దుకుని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు విస్తృతంగా చర్చిస్తామని ఎమ్‌ఏ బేబీ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోనూ ఇదే తరహాలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని చెప్పారు. స‌మావేశంలో ప్రవేశపెట్టే నివేదిక ఆధారంగా చర్చ, విమర్శ, ఆత్మ విమర్శ జరుగుతాయన్నారు. పార్టీ పునరుద్ధరణకు అవసరమైన అంతర్గత ప్రక్రియ ప్రస్తుతం జరుగు తోందనీ, దిద్దుబాటు అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు శాఖ స్థాయి నుంచి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతుం దన్నారు. సీపీఐ(ఎం)ను బలమైన కార్మికవర్గ విప్లవ పార్టీగా తీర్చిదిద్దడమే లక్ష్యమనీ, ప్రతి పార్టీ సభ్యుడు అందుకు అవసరమైన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

​పార్లమెంటరీ భ్ర‌మ‌పై లోతైన సమీక్ష
​సవరణ పత్రంలో భాగంగా పార్లమెంటరీ భ్ర‌మ‌, ప్రజలతో సంబంధాల కొర‌త‌, సమిష్టి కార్యాచరణ అనే మూడు అంశాలపై పొలిట్‌బ్యూరోలో విస్తృత చర్చ జరిగిందని బేబీ తెలిపారు. ప్రతి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఈ మూడు అంశాలపై స్వీయ అంచ‌నా నివేదిక సమర్పించారని చెప్పారు. పార్టీ పార్లమెంటరీ భ్ర‌మ‌కు లోనైందా? ప్రజలతో ఎంతమేరకు మమేకమవుతోంది? సమిష్టి కార్యాచరణ ఎంతవరకు సాధ్యమవుతోంది? అనే అంశాలపై లోతుగా సమీక్షించారని తెలిపారు. సవరణలో భాగంగా ఇలాంటి చర్చలు ఇతర పార్టీ కమిటీల్లోనూ జరుగుతాయని చెప్పారు. అవసరమైన సవరణలు చేపడుతూ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -