Monday, September 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపాలన చేతగాక బూతులతో దాడి

పాలన చేతగాక బూతులతో దాడి

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ఆగ్రహం
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎ‌స్‌ఎల్పీ భేటీ
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం
త్వరలో నీటికోసం పాదయాత్ర చేస్తానని ప్రకటన

నవతెలంగాణ-మర్కుక్
సీఎం రేవంత్‌రెడ్డివి చిల్లర మాటలు అని.. పాలన చేతగాక బూతులతో దాడి చేస్తున్నాడంటూ మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎ‌స్‌ఎల్పీ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎత్తిచూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని సూచించారు. శాసనసభ, శాసన మండలిలో జరిగే ప్రతి చర్చలోనూ పాల్గొనాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అని ఆరోపించారు. ఇదొక థర్డ్ క్లాస్ పాలన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని, అందుకే దోపిడీలు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో నీళ్ల కోసం పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.

కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల వద్దకు వెళ్తానన్నారు. లక్ష మందితో 2 ప్రాజెక్టులను సందర్శించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల పై అసెంబ్లీలో నిలదీయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సర్వ బ్రష్టు ప్రభుత్వం అని అన్నారు.
15 నుంచి 20 అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, గంగుల కమలాకర్, చింత ప్రభాకర్, సుధీర్ రెడ్డి, అనిల్ జాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, మాణిక్ రావు, వివేక్ మందా గౌడ్, బండారు లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీలు సుంకరి రాజు, షేర్ సుభాష్ రెడ్డి, వెంకటరామిరెడ్డి,వంటేరు యాదవ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మధుసూదనా చారి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ రమణ, దేశపతి శ్రీనివాస్, మధుసూదన్ టాటా, వాణి దేవి, రమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కౌరవ సభకు కేసీఆర్ హజరు కాడు : హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని, ప్రజాస్వామ్యంలో రాజీనామా చేయాల్సి వస్తే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తేల్చి చెప్పారు. గౌరవ సభ అయితే కేసీఆర్ వచ్చే వారని.. కానీ అది కౌరవ సభ అని ఆరోపించారు. ఈ సభలకు కేసీఆర్ సైన్యంగా తాము హాజరవుతామన్నారు. కాంగ్రెస్ నియంత పాలనపై నిలదీస్తామని హెచ్చరించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రజల పక్షాన అడగడానికి బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -