Monday, September 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువాడి..వేడిగా

వాడి..వేడిగా

- Advertisement -

నేటి నుంచి అసెంబ్లీ
పీఎం శ్రీ, మెట్రో రైల్ వార్షిక నివేదిక‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న సీఎం

న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్
రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉద‌యం 10 గంట‌ల‌కు చైర్మెన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న శాస‌న‌మండ‌లి, స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ అధ్య‌క్ష‌త‌న శాస‌న‌స‌భ ఆరంభం కాను న్నాయి. ఉభ‌య స‌భ‌ల్లో తొలుత ప్ర‌శ్నోత్త‌రాల‌ను చేప‌ట్ట‌నున్నారు. అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణ స‌మ‌గ్ర శిక్ష (టీ.ఎస్‌.ఎస్‌), పీఎం శ్రీ ప‌థ‌కంతోపాటు హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించి 2013 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 2018 వ‌ర‌కు వార్షిక నివేదిక‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ మేర‌కు అసెంబ్లీ కార్య‌ద‌ర్శి రేండ్ల తిరుప‌తి బులెటిన్ విడుద‌ల చేశారు. అనంత‌రం స‌భా వ్య‌వ‌హారాల క‌మిటీ (బీఏసీ) స‌మావేశ‌మై స‌భ‌ను ఎన్నిరోజులు న‌డ‌పాల‌నే దానిపై చ‌ర్చించి, నిర్ణ‌యం తీసుకుంటుంది. అయితే ఈనెల 11 వ‌ర‌కే స‌భ కొన‌సాగే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత వ‌ర‌సగా మూడు రోజుల‌(రెండో శ‌నివారం, ఆదివారం, సోమ‌వారం వినాయ‌క చ‌వితి)పాటు వ‌ర‌స‌గా సెల‌వులు రానుండ‌ట‌మే దీనికి కార‌ణ‌మ‌ని అసెంబ్లీ కార్య‌ద‌ర్శి కార్యాల‌య వ‌ర్గాలు తెలిపాయి.

కాగా ఇటీవ‌ల మ‌ర‌ణించిన మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిడి న‌ర్సింహారెడ్డి (భువ‌న‌గిరి), పెద్ది సుద‌ర్శన్ రెడ్డి (న‌ర్సంపేట‌)ల‌కు శాస‌న‌స‌భ సంతాపం తెల‌పాల్సి ఉంది. కానీ అసెంబ్లీ కార్య‌ద‌ర్శి విడుద‌ల చేసిన బులెటిన్‌లో ఆ ప్ర‌స్తావ‌నేదీ లేదు. అంటే తొలిరోజు గాకుండా ఆ త‌ర్వాత వారికి సంతాపాన్ని తెలిపే అవ‌కాశ‌ముందా? లేదా? అనేది చూడాలి. మ‌రోవైపు ఢిల్లీలో సోమ‌వారం నిర్వ‌హించ‌బోయే సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రవుతారా? లేదా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ భేటీలో తెలంగాణ‌, ఏపీకి సంబంధించిన న‌దీ జ‌లాల‌పై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశ‌మున్న నేప‌థ్యంలో అది అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ​

ఒకే ప్రాంగ‌ణంలో శాస‌న‌స‌భ‌, మండ‌లి…
ఈసారి అసెంబ్లీ స‌మావేశాలు ప్ర‌త్యేక ప్రాధాన్య‌తను సంత‌రించుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లీహాల్ లో కొన‌సాగిన శాస‌న‌మండ‌లి, శాస‌న‌స‌భ భ‌వ‌నం ప‌క్క‌నే కొలువుదీర‌నుంది. పాత శాస‌న‌స‌భ భ‌వ‌నం, గ‌తంలో టీడీఎల్పీకి ఉప‌యోగించుకున్న భ‌వ‌నాల‌కు మ‌ర‌మ్మ‌తులు చేసిన ప్ర‌భుత్వం… వాటిని కౌన్సిల్ కు కేటాయించింది. ఈ నేప‌థ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హ‌యాం నుంచి ఇప్ప‌టిదాకా 24 ఏండ్ల‌పాటు జూబ్లీహాల్‌లో కొన‌సాగిన శాస‌న‌మండ‌లి, ఇప్పుడు శాస‌న‌స‌భ ప‌క్క‌కే రానుంది. రెండు స‌భ‌ల మ‌ధ్య‌నున్న లాంజ్‌ను పార్ల‌మెంటులో మాదిరిగా సెంట్ర‌ల్ హాల్‌లాగా ఉప‌యోగించనున్నారు. ఈ రీత్యా మీడియా ప్ర‌తినిధుల‌ను గ‌తంలో మాదిరిగా లోనికి అనుమ‌తిస్తారా? లేదా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -