సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
చుక్క రాములు, పాలడుగు భాస్కర్
మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక,
కార్పొరేట్ అనుకూల వైఖరికి నిదర్శనం
నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరి స్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు మరో నిదర్శనం.. కేంద్ర కనీస వేతన సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణలో ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీకి ప్రాతినిధ్యం నిరాకరించడమేనని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ విమర్శించారు. రెండు రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్లలో నిర్వహిస్తున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశాలు ఆదివారం రెండో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా కనీస వేతన సలహామండలి బోర్డు నుంచి సీఐటీయూను మినహాయించిన కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్టలో జరుగుతున్న రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ బలపర్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు (సెప్టెంబర్ 7 న) రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనలలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల కనీస వేతనాలు, జీవన ప్రమాణాలు, ఉపాధి పరిస్థితులకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై నిర్ణయాలు తీసుకునే కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ వంటి ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అప్రజాస్వామికం, కక్షపూరితమైన చర్య అని అన్నారు. 2026 జులై 21న కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన కేంద్ర కనీస వేతన సలహా బోర్డు, వాస్తవానికి కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన త్రైపాక్షిక వేదికగా ఉండాలన్నారు. అయితే ప్రధాన కార్మిక సంఘాలను పక్కన పెట్టి, తనకు అనుకూలమైన వారితో బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా కార్మికుల వేతనాలను అణచి వేయడానికి, యజమానులకు అనుకూలమైన విధానాలను చట్టబద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ, కార్మికులకు మాత్రం ఈజ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ పరిస్థితులను మోడీ ప్రభుత్వం సృష్టిస్తోందన్నారు. లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను హరించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కనీస వేతనాల నిర్ణయ ప్రక్రియలో కూడా కార్మిక సంఘాల గొంతును నొక్కివేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన ధరలు, విద్యుత్ చార్జీలు, వైద్యం, విద్య, ఇల్లు, రవాణా ఖర్చులు నిరంతరం పెరుగుతు న్నప్పటికీ, కార్మికుల నిజమైన ఆదాయాలు మాత్రం పడిపోతున్నాయని వారు అన్నారు. మరోవైపు కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రజా ఆస్తుల అప్పగిం తలు కొనసాగుతున్నాయన్నారు. కార్మికుల కనీస వేతనాల నిర్ణయంలో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో ఏకాభిప్రాయంతో వచ్చిన సిఫా రసులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక కుటుంబం గౌరవ ప్రదంగా జీవించేందుకు అవసరమైన వేతనం లభించేలా కనీస వేతనాలను శాస్త్రీయంగా నిర్ణయించాలని కోరారు. మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించి పరిష్కారం కనుగొనే బదులు, కార్మిక సంఘాల ప్రాతినిధ్యాన్ని తొలగించి ఏకపక్ష నిర్ణయాలకు మార్గం సుగమం చేస్తోందన్నారు. సీఐటీయూను కనీస వేతన సలహా బోర్డు నుంచి తప్పించడం ద్వారా దేశంలోని కోట్లాది కార్మికుల సమస్యలను, వారి హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని అణచివేయలేరని తెలిపారు.
కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ పోరాటం బోర్డుల్లోని ప్రాతినిధ్యంతో ప్రారంభమైంది కాదన్నారు. కర్మాగారాల్లో, నిర్మాణ రంగంలో, రవాణా రంగంలో, అసంఘటిత రంగంలో, స్కీమ్ వర్కర్లలో, గిగ్–ప్లాట్ఫామ్ కార్మికుల్లో, ప్రభుత్వ–ప్రయివేటు రంగాల్లో పనిచేస్తున్న కోట్లాది కార్మికులతో కలిసి సీఐటీయూ నిరంతరం పోరాడుతుందని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ కక్షపూరిత వైఖరిని తెలంగాణ లోని కార్మికవర్గం, అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అసంఘటిత రంగ కార్మికులు ఐక్యంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, జె.మల్లికార్జున్, భూపాల్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వీరారెడ్డి, శ్రీకాంత్, జె.వెంకటేష్, వీఎస్.రావు, వంగూరి రాములు, ఈశ్వర్ రావు, కూరపాటి రమేష్, కల్యాణం వెంకటేశ్వర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



