Monday, September 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజీతం తీసుకుంటూ అసెంబ్లీకి ఎందుకు రారు

జీతం తీసుకుంటూ అసెంబ్లీకి ఎందుకు రారు

- Advertisement -

ప్రతిపక్ష హోదాను అపహాస్యం చేస్తున్న కేసీఆర్‌
తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి : మహాధర్నాలో పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌డిమాండ్‌
బీఆర్‌ ఎస్‌ ‌పదేండ్ల పాలన..
కాంగ్రెస్‌ ‌రెండున్నరేండ్ల పాలనపై చర్చకు సిద్ధమంటూ సవాల్‌
హాజరైన మంత్రులు శ్రీధర్‌‌బాబు, పొన్నం, అజారుద్దీన్‌,
పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు

​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రాని బీఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌… ఆ హోదాను అపహాస్యం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌ కుమార్‌ ‌గౌడ్‌ ‌విమర్శించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఆయన సభకు రాకపోవటం అత్యంత శోచనీయమని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన కేసీఆర్‌‌ను డిమాండ్‌ ‌చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు సారధ్యంలో ఎంపీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌‌తోపాటు మంత్రులు శ్రీధర్‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌ ‌రెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్‌, అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, పలువురు ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ ‌కుమార్‌‌ గౌడ్‌ ‌మాట్లాడుతూ…‘పదేండ్ల పాలనలో బీఆర్‌ ఎస్‌ ‌రాష్ట్రానికి ఏం ఒరగబెట్టిందో.. రెండున్నరేండ్లలో కాంగ్రెస్‌ ‌ప్రజలకు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందో చర్చించేందుకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా…?’ అని కేసీఆర్‌కు సవాల్‌ ‌విసిరారు.

బీఆర్‌ ఎస్‌‌ పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు… గత ఎన్నికల్లో కాంగ్రెస్‎ను ఆశీర్వదించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్‎కు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది కీలక పాత్ర అని చెప్పారు. కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని కేసీఆర్‌ ‌ను నిలదీశారు. అధికారం ప్రజలిచ్చే కానుకని, వారి ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగానే తమ ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి అనేక హామీలను అమలు చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌ఇండ్లిస్తామని చెప్పి ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు భిన్నంగా ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌నాయకులకు చదువుతో పాటు సంస్కారం అవసరమని హితవు పలికారు. పదేండ్ల కాలంలో విదేశీ పెట్టుబడులు ఏ మేరకు తెచ్చారో చెప్పాలని నిలదీశారు.

తాము రెండున్నరేండ్లలో రూ.లక్షా 78వేల కోట్లు విదేశీ పెట్టుబడులతోపాటు గ్లోబల్‌ ‌సమ్మిట్‌‌తో రూ. ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. 70వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చామని, ఇంకో రెండున్నరేండ్లలో మరిన్ని ఉద్యోగాలు ఇచ్చితీరుతామని హామీనిచ్చారు. ఉద్యమకారులు గద్దర్‌, అందెశ్రీని కేసీఆర్‌ ‌విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం వారిని సముచితంగా గౌరవించిందని గుర్తు చేశారు. కుల సర్వేతో తెలంగాణ దేశానికే రోల్‌ ‌మోడల్‌‌గా నిలిచిందని వివరించారు. బీజేపీ నేతలు తమ ప్రభుత్వం గురించి వ్యంగంగా మాట్లాడటం తప్ప వారు రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్‎ను కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. ఒకవేళ అల్లుడు, కొడుక్కి అవకాశం ఇవ్వాలనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని కేసీఆర్ కు సలహానిచ్చారు.

గత బీఆర్ఎస్ పాలనలో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పులపాలైందని వాపోయారు. ఆ ప్రభుత్వం రూ. ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిందని, ఈ క్రమంలో తాము ఓ వైపు కేసీఆర్‌ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యా, వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గతంలో కేసీఆర్ వైద్య రంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. స్కిల్ యూనివర్శిటీతో యువతలో నైపుణ్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును తొక్కిపెట్టి ఆయా తరగతుల నోటికాడి కూడును లాక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచైనా సరే… బీసీల గణనను కులగణనలో చేర్పిస్తామని చెప్పారు.

​రండి.. అనుభవాలను వివరించండి.. : శ్రీధర్‌‌బాబు
శ్రీ‌ధర్‌ ‌బాబు మాట్లాడుతూ పదేండ్లపాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌..అసెంబ్లీకి వచ్చి వివిధ అంశాల్లో తన అనుభవాలను వివరించాలని కోరారు. అంతే తప్ప బీఆర్‌ ఎస్‌ ‌నేతలతో రోడ్లపై మాట్లాడించడం సరికాదని హితవు పలికారు. ఇందుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ ‌వైఖరి మారకపోతే..మరో పదేండ్లు రోడ్లపైనే ఉంటారని హెచ్చరించారు. వెయ్యి రోజుల్లో ఎన్నో చేశాం.. మిగిలిన వాటన్నింటినీ రెండున్నరేండ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విష ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఉచితంగా ప్రయాణిస్తున్నారా? అని ప్రశ్నించారు. పేదల ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌వాళ్లు దీన్ని వినియోగించుకోవటం లేదా? అని నిలదీశారు. కేసీఆర్‌ ‌హయాంలో పదేండ్లపాటు ఒక్క రేషన్‌ ‌కార్డూ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలకు రేషన్ కార్డు రాలేదా? సన్నబియ్యం తీసుకోవట్లేదా? అని ప్రశ్నించారు.

​భయపడుతున్న కేసీఆర్‌
అజారుద్దీన్‌ ‌మాట్లాడుతూ అసెంబ్లీకి రావడానికి కేసీఆర్‌ ‌భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం తగదని హితవు పలికారు.

​అసెంబ్లీకే రాకపోతే ఎలా? : మంత్రి పొన్నం
పొన్నం ప్రభాకర్‌ ‌మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగి 365రోజులు ఉద్యోగానికి రాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారు కదా? మరి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ ఒక్క సారి కూడా అసెంబ్లీకి రాకపోతే ఎలా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన బీజేపీ.. తెలంగాణకు ఏం తెచ్చిందో చెప్పాలని నిలదీ శారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. గురుకులాల్లో డైట్‌, కాస్మోటిక్‌ ‌చార్జీలు పెంచామ న్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -