తెలంగాణ తెచ్చుకోవడమే శాపమా
ఉమ్మడి రాష్ట్రంలో పీఆర్సీ, డీఏలు పెండింగ్‌లో లేవు
సమస్యల పరిష్కారమే లక్ష్యం : ఉద్యోగుల సంకల్ప సభలో జేఏసీ చైర్మెన్ లచ్చిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ వస్తే ఉద్యోగులకు మంచి పీఆర్సీలు, డీఏలు వస్తాయనీ, సమస్యలు తీరుతాయని ఆశించామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి అన్నారు. కానీ స్వరాష్ట్రంలోనే తెలంగాణ ఉద్యోగులకు సమస్యలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను తెచ్చుకోవడమే ఉద్యోగులకు శాపమా?అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సంకల్ప సభను నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా తరలొచ్చారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పీఆర్సీ, డీఏలు పెండింగ్‌లో లేవని గుర్తు చేశారు. తెలంగాణలో పీఆర్సీ, డీఏలు పెండింగ్‌లో ఎందుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ రెండున పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగడం లేదని గుర్తు చేశారు. కానీ ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పీఆర్సీ, డీఏలు ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందంటూ ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులపైనే వివక్ష, చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. మానవీయ కోణంలో ఆలోచించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని సూచించారు. పీఆర్సీని అమలు చేయాలనీ, పెండింగ్‌లోని డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 42 ఉద్యోగుల సమస్యల పరిష్కారమే జేఏసీ లక్ష్యమని ప్రకటించారు. ఉద్యోగులు సంఘటితం కావాలని జేఏసీ సెక్రెటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్చలకు పిలవడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ నాయకులు ఎస్ రాములు, మహిపాల్‌రెడ్డి, బాణాల రాంరెడ్డి, నిర్మల, రాధ, గరికె ఉపేందర్‌రావు, దర్శన్‌గౌడ్, కృష్ణుడు, అబీబుద్దీన్, కుమార్, చంద్రశేఖర్‌గౌడ్, సైదులు, రాధ, రమేష్ పాక, వి భిక్షం, పెంటయ్య, అరికెల వెంకటేశం, ఉపేందర్‌రావు, పులి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలోనే ఉద్యోగులకు సమస్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



