గొర్రెల పెంపకంలో తెలంగాణనే ఫస్ట్
నిధులివ్వని రాష్ట్ర సర్కారు… పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
కాపరులకు శిక్షణ, అవగాహన కల్పించడంలో మాత్రం విఫలం
అధిక మాంసం దిగుబడి, రోగనిరోధక శక్తి తట్టుకునే పరిశోధనలు నిల్
కనుమరుగవుతున్న దక్కన్ గొర్రె జాతి బ్రాండ్ ఇమేజ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలోనే అత్యధిక గొర్రెజీవాలున్నది తెలంగాణలోనే. మాంసం ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ మొదటిస్థానం తెలంగాణదే. ఇలాంటి ప్రాంతంలో గొర్రెలు, మేకల పెంపకంపై కాపరులకు అవగాహన కల్పించే కేంద్రం లేకపోవడం గమనార్హం. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన గొర్రెల పరిశోధనా కేంద్రాన్ని పాలకులు ఖతం పెట్టేస్తున్నారు. జీవాలను కాసేవారికి శిక్షణ ఇవ్వడంలోనూ, అవగాహన కల్పించడంలోనూ విఫలమ య్యారు. ఏ జీవాలను కాస్తే కాపరులకు లాభదాయకం? తెలంగాణ వాతావరణానికి తట్టుకునే కొత్త జాతులను సృష్టించడమెలా? ఒకే ఈతలో రెండు,మూడు పిల్లలను వేసే జాతులను అభివృద్ధి చేయడమెలా? అనే పరిశోధనలే లేవు. పైగా, తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్‌గా ఉన్న దక్కన్ జాతి గొర్రె అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో గొర్రెలు, మేకల పెంపకం, అధిక దిగుబడి ఇచ్చే జాతులపై పరిశోధనలు చేసేందుకు ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తున్నది.
తెలంగాణలో గొర్రెలు, మేకల పెంపకంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి 10 లక్షల కుటుంబాల దాకా బతుకుతున్నాయి. అందులో పెంపకందారులతో పాటు తోళ్ల వ్యాపారులు, దళారులు, మాంసం అమ్మేవాళ్లు ఉన్నారు. రాష్ట్రంలో 8,109 ప్రాథమిక సొసైటీల్లో 7,61,895 మంది గొర్రెల కాపరులు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. వీరిలో 70 శాతానికిపైగా కురుమలు, యాదవులే ఉన్నారు. తెలంగాణలో 20వ పశుగణన ప్రకారం 1,90, 63,058 గొర్రెలు, 49,34,673 మేకలున్నాయి. 2025-26లో కేంద్ర ప్రభుత్వం 21వ పశుగణన చేసినప్పటికీ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. 2019 పశుగణన ప్రకారం దేశంలోనే అత్యధిక గొర్రెజీవాలున్నది తెలంగాణలోనే. అలాంటిది ఇక్కడ మాత్రం మేలు రకాల గొర్ల జాతులపై పరిశోధనలు చేసే కేంద్రం మాత్రం లేదు. గొర్రెలు, ఉన్నిపై పరిశోధనల కోసం రాజస్థాన్‌లోని అవికానగర్‌లో సీఎస్ఆర్డబ్ల్యూఐ ఉంది. తెలంగాణతో పోలిస్తే అక్కడ గొర్రెల జనాభా సగం కూడా లేకపోవడం గమనార్హం. రాజస్థాన్‌లో 20వ పశుగణన ప్రకారం గొర్రెల సంఖ్య 79 లక్షలే. అలాంటి చోట పరిశోధనా కేంద్రం ఉంది. మేకలకు సంబంధించిన పరిశోధనా కేంద్రం ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉంది. ఆ రెండు పరిశోధనా సంస్థల వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. కొత్తజాతులపైనా, ఉత్పత్తి పెంపుదల కోసం, ఉత్పాదకత పెంచే రకంగా ఎలాంటి పరిశోధనలు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో ఉన్న దక్కన్ జాతి గొర్రెల పరిశోధన క్షేత్రానికి నిధులను కేటాయించడం లేదు. మరోవైపు తెలంగాణ చిహ్నమైన నల్లగొంగడి, నల్లగొర్రె జాతి అంతరించిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యధిక గొర్రెలు, మేకల సంపద కలిగి, అత్యధిక మాంసాన్ని వినియోగిస్తున్న తెలంగాణలో కేంద్ర గొర్రెల పరిశోధన సంస్థను ఏర్పాటు చేయాలని గొర్రెలు, మేకల కాపరుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పరిశోధనా కేంద్రంపై పాలకుల దాడి
దేశంలో ఎక్కడా లేనివిధంగా 1950లో దక్కన్ జాతిగొర్రెల(నల్లగొర్రెలు) పెంపకం, అధిక ఉత్పాదకత, ఉన్ని రాబట్టే పరిశోధనల నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో 236 ఎకరాల్లో గొర్రెల పరిశోధనల నిమిత్తం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గొర్రెకాపరులపై చిన్నచూపుతో పాలకులు అధికారులు, శాస్ర్తవేత్తలను క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. దీంతో అక్కడ పరిశోధనలు అటకెక్కాయి. అదే పాలకులు మళ్లీ ఆ సంస్థ నిరుపయోగం ఉందనే సాకు చూపెట్టి దానికి సంబంధించిన భూముల్లో నుంచి రోడ్లు వేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు యూనివర్సిటీకి వందెకరాలను కేటాయించింది. నాలుగు ఎకరాలను ఆర్డీఓ కార్యాలయానికి ఇచ్చేసింది. జిల్లా కోర్టుల ప్రాంగణానికి 15 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వ అవసరాలకు తీసుకున్న భూమి, కబ్జాలకు గురైన భూమి పోను అక్కడ మిగిలింది కేవలం 22 ఎకరాలే. ప్రభుత్వమే దానికి నిధులివ్వకుండా నిర్వీర్యం చేసి ఇప్పుడు అక్కడ పరిశోధనలు జరగట్లేదు కాబట్టి వేరే అవసరాలకు తీసుకోవాలనే పనిలో పాలకులు పడటం విడ్డూరంగా ఉంది. జీఎంపీఎస్, ఇతర సంఘాల పోరాటాల ఫలితంగా సర్కారు కొంత వెనక్కి తగ్గినా…గొర్రెల కాపరులు తమకు హక్కుగా లభించిన పరిశోధనా కేంద్రంపై పోరాడకపోతే రాబోయే కాలంలో ఆ పరిశోధనా కేంద్రం కనుమరుగు కావడం ఖాయం.
తెలంగాణలో గొర్రెలు,
మేకల పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి
దేశంలో అత్యధిక గొర్రెలు ఉన్నది తెలంగాణలోనే. మేకల సంఖ్య కూడా
గణనీయంగానే ఉంది. గొర్రె, మేక మాంసాన్ని అత్యధికంగా వినియోగిస్తున్నదీ తెలంగాణనే. తెలంగాణకు చెందిన దక్కన్ గొర్రె జాతి ఉన్నికి ప్రసిద్ధి. మాంసం టేస్ట్కూడా బాగుంటుంది. ప్రస్తుతం 51 గొర్రెజాతులు, 45 రకాల మేక జాతులు న్నాయి. కానీ, తెలంగాణలో దక్కన్, నెల్లూరు బ్రౌన్, నెల్లూరు జుడిపి జాతి
జీవాలనే పెంచుతున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల్లోని పరిశోధనా కేంద్రాల వల్ల తెలంగాణకు ప్రయోజనమేమీ లేదు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అయిన
దక్కన్జాతి పరిరక్షణ కోసం, మేలు రకాల జీవాల జాతి వంగడాల సృష్టి కోసం తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం గొర్రెలు, మేకల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దక్కన్ జాతిగొర్రెల పరిశోధనా కేంద్రానికి నిధులను విడుదల చేసి పునర్వైభవం తీసుకురావాలి.
ఈ రెండు అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టబోతున్నాం.
–ఉడుత రవీందర్, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
గొర్రెల పరిశోధనా కేంద్రానికి మిగిలింది 22 ఎకరాలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



