14వ జేపీఎస్‌సీ పరీక్ష రద్దు
రాంచీ (జార్ఖండ్) : జార్ఖండ్ లో నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన విజయవంతమైంది. విద్యార్థులతో రెండు దశల్లో నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో వివాదాస్పదమైన 14వ జేపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తున్నట్టు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి దీపికా పాండే వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు లేవనెత్తిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇందులో భాగంగానే 14వ జేపీఎస్‌సీ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తాం
టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలతోపాటు జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపైనా సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు మంత్రి దీపికా పాండే వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీఐడీతో విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే దర్యాప్తు ప్రక్రియలో ఈడీ సహకారాన్ని కూడా కోరతామని చెప్పారు. గతంలో ప్రకటించిన ఫలితాలు, అభ్యర్థులకు జారీ చేసిన నియామక పత్రాల విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని, సీఐడీ దర్యాప్తును ప్రత్యేక న్యాయ కమిటీ పర్యవేక్షిస్తుందని మంత్రి తెలిపారు. రాబోయే 90 రోజుల్లో విచారణను పూర్తి చేసి, బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఆశ్రయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. భవిష్యత్తులో పేపర్ లీక్ వంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా పరీక్షల నిర్వహణ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళన విజయవంతం
- Advertisement -
- Advertisement -



