ఇ20తో దీర్ఘకాలంలో నష్టమే
రబ్బరు భాగాలపై ప్రభావం
మైలేజీ తగ్గుతోంది : ఆటోమోటివ్ రీసెర్చ్
అసోసియేషన్ వెల్లడి
ముంబయి : ఇథనాలు ఇంధనంతో వాహనాలకు దీర్ఘకాలంలో ముప్పేనని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం, మంత్రి నితిన్ గడ్కరీ తరచుగా 20 శాతం ఇథనాలు (ఇ20) ఇంధనం సురక్షితమని.. వాహనాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని దేశవ్యాప్తంగా చేస్తోన్న ప్రచారానికి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఆర్‌ఎఐ) నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతినిధులు, వాహన తయారీ సంస్థలు 20 శాతం ఇథనాలు కలిపిన ఇ20 ఇంధనం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని బహిరంగంగా వాదిస్తుంటే.. ఎఆర్‌ఎఐ రహస్య అధ్యయనం మాత్రం తీవ్రమైన సాంకేతిక లోపాలను ఎత్తిచూపడంతో ప్రభుత్వ వాదనలపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.ముఖ్యంగా ఇ10 ప్రమాణాలతో తయారైన వాహనాల్లో ఇ20 ఇంధనాన్ని వాడటం వల్ల రబ్బరు ఇంధన వ్యవస్థలు దెబ్బతింటున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. హోస్‌లు, గాస్కెట్లు, సీల్స్, ఓ-రింగ్స్ వంటి కీలక భాగాలు త్వరగా పాడైపోతున్నాయని.. ఫలితంగా వాహన యజమానులు అదనపు భారాన్ని భరించి వీటిని మార్చాల్సి వస్తుందని నివేదిక హెచ్చరిస్తోంది.
నిర్వహణ, భద్రత విషయంలోనూ ప్రభుత్వ వాదనలకు విరుద్ధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.
ఒకవైపు ఎటువంటి సమస్యలు లేవని ప్రభుత్వం అంటుంటే మరోవైపు బిఎస్6 టర్బోచార్జ్డ్ ఇంజిన్‌లలో కేవలం 265 గంటల పరీక్షలోనే ఎగ్జాస్ట్ వాల్వ్ విఫలమైనట్లు ఎఆర్‌ఎఐ అధ్యయనంలో తేలింది. ఇంజిన్ మన్నికను పరీక్షించే కనీస ప్రమాణాలు 2,000 గంటలు ఉండగా.. అంతకంటే చాలా ముందే ఇటువంటి వైఫల్యాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కంపెనీలకు చెందిన వాహనాల్లో ఎలాంటి సమస్యలు కనిపించకపోగా.. మరికొన్ని సంస్థల వాహనాల్లో మాత్రమే సాంకేతిక లోపాలు గుర్తించినట్లు అధ్యయనం పేర్కొంది. సాధారణ మధ్యతరగతి వాహనదారుల భద్రతను పణంగా పెట్టి పూర్తిస్థాయి క్షేత్రస్థాయి పరిశీలన జరగకముందే ఇ20ని రుద్దుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
ఒక పక్క మంత్రి గడ్కరీ ఇంధన భద్రత గురించి గొప్పగా చెబుతుంటే.. మరోపక్క రహస్య నివేదికలు వాహనాల కాలపరిమితి తగ్గుతుందని హెచ్చరించడం ఆందోళకర అంశం. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను దాచకుండా వాహనదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకమైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.ఇ20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజీపై ప్రభావం పడుతుందని ఎఆర్‌ఎఐ డైరెక్టర్ డాక్టర్ రెజి మథాయ్ తెలిపారు. వాహన తయారీ సంస్థలతో కలిసి నిర్వహించిన నియంత్రిత పరీక్షల్లో ఇ10తో పోలిస్తే ఇ20 ఇంధనం వాడినప్పుడు వాహనాల మైలేజీలో సుమారు 2 నుంచి 6 శాతం వరకు తగ్గుదల నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఇథనాల్‌కు ఉండే క్యాలరీ విలువ తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. పాత, కొత్త వాహనాలపై రోలర్ల సాయంతో నిర్ణీత ఉష్ణోగ్రతల వద్ద ఈ పరీక్షలు జరిపినట్లు ఆయన తెలిపారు. మైలేజీ తగ్గుదలపై వాహనదారులలో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఎఆర్‌ఎఐ వెల్లడించిన ఈ గణాంకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.



