ఎన్టీఏ ప్రధాన కార్యాలయం వద్ద విద్యార్థుల ఆందోళన
ఢిల్లీ పోలీసుల దాడి, అరెస్టు
బలవంతంగా వాహనంలో ఎక్కించిన పోలీసులు
పలువురికి గాయాలు
ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నేతృత్వంలోని వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించిన మార్చ్ ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది విద్యార్థులతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రధాన కార్యాలయానికి మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు దాడి చేశాయి. నిరసన తెలుపుతున్న విద్యార్థులను అరెస్టు చేసి అక్కడినుంచి బలవంతంగా తీసుకెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మెహినా ఫాతిమా, రాష్ట్ర కమిటీ సభ్యురాలు శరణ్య వర్మలను పోలీసులు ఈడ్చుకెళ్లారు. విద్యార్థినులని కూడా చూడకుండా మగ పోలీసులు వారిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాక విద్యార్థినుల మెడలు పట్టుకుని ఊపిరి ఆడకుండా చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ మార్చ్ కు ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సూరజ్ ఇలామన్, అధ్యక్షురాలు నాడియా నాయకత్వం వహించారు. ఏఐఎస్ఎఫ్, దిశ, ఎఐఎస్ఒ, ఎఐఎస్ఎ సంఘాలూ ఈ మార్చ్‌లో పాల్గొన్నాయి. వీరిని ఎన్టీఏ ప్రధాన కార్యాలయం నుంచి తొలగించడానికి పోలీసులకు, కేంద్ర బలగాలకు రెండు గంటలకు పైగానే సమయం పట్టింది.
పదేపదే పరీక్షలలో విఫలమ వుతున్న ఎన్టీఏను రద్దు చేయాలని, పునఃపరీక్షలు జరుగుతున్న సబ్జెక్టులకు రీఫండ్‌లు ఇవ్వాలని, పునఃపరీక్షలలో పరీక్షా కేంద్రాలను మార్చుకునేందుకు అనుమతించాలని, పునఃపరీక్షల కారణంగా పీహెచ్‌డి ప్రవేశాలు, ఫెలోషిప్‌లు, ఇతర విద్యా అవకాశాలలో జాప్యం జరగకూడదని, పరీక్షలలోని అవకతవకలపై స్వతంత్ర విచారణ జరపాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు.
వామపక్ష విద్యార్థి సంఘాల మార్చ్ ఉద్రిక్తం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



