పనిముట్లు కొనుక్కోవాల్సిందే..
‘ఉపాధి హామీ’ నిబంధనల మార్పుతో కూలీలకు పెరిగిన పరేషాన్
‘వీబీజీఆర్ఎఎం-జీ’లో సౌకర్యాలు లేవు.. బిల్లులు రావు
నవతెలంగాణ-మహబూబాబాద్/భూపాలపల్లి/పరకాల
గ్రామీణ ప్రాంత పేదలకు కొంగుబంగారంలా ఉన్న ఉపాధి హామీ చట్టం తీవ్ర ఒడిదుడుకులకు లోనవు తోంది.. గతంతో పోలిస్తే పనిదినాల కల్పన, బడ్జెట్ కేటాయింపుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇది లక్షలాది మంది కూలీల జీవనోపాధిపై ప్రభావం చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్జీఏ)ను భారతదేశ అభివృద్ధి-ఉపాధి మరియు జీవనోపాధి హామీ మిషన్ (వీబీజీఆర్ఎఎం-జీ)గా పేరు మార్చి, పాతచట్టంలోని అనేక అంశాలను తొలగించి, కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీని వల్ల గ్రామీణులకు పని దినాలు భారీగా తగ్గిపోయాయి. ఫలితంగా కూలీలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పథకం అమల్లోకి వచ్చాక క్రమంగా పని దినాల కల్పన గ్రాఫ్ పడిపోతున్న విషయం గమనార్హం. మహబూబాబాద్ జిల్లాలో అధికారిక గణాంకాలను విశ్లేషిస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 55.88 లక్షల పనిదినాలు కల్పించగా, 2024-25 నాటికి 45.79 లక్షలకు పడిపోయింది. 2025-26లో పనిది నాల సంఖ్య మరింత తగ్గి 29.27 లక్షలకు పరిమితమైంది. అంటే రెండేండ్లలో సుమారు 26లక్షలకు పైగా పనిదినాలు కోతకు గురయ్యాయి. ఒక కుటుంబానికి సగటున ఇచ్చే పనిదినాలు 2023-24లో 50 రోజులు ఉండగా, 2025-26 నాటికి 31 రోజులకు తగ్గిపోయాయి. దీంతో కూలీలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం బ్లాకులు 18 ఉండగా, 487 గ్రామపంచాయతీల్లో 2.23 లక్షల యాక్టివ్ కూలీలు ఉన్నారు. ఇందులో సుమారు 49.61 శాతం మంది గిరిజనులే ఉ న్నారు. పనిదినాల కోత వల్ల జిల్లాలోని అత్యధిక జనాభా కలిగిన గిరిజన వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయి. పెరుగుతున్న నిత్యావసరాల ధరల దృష్ట్యా వేతన రేటు కొంత పెరిగినప్పటికీ. పని దినాల సంఖ్య తగ్గడం వల్ల కూలీల వార్షిక ఆదాయం పడిపోతోంది. జిల్లా యంత్రాంగం స్పందించి పనిదినాలను పెంచాలని, కూలీల వలసలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
భూపాలపల్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో నమోదిత జాబ్ కార్డులు 1,05,817 ఉండగా యాక్టివ్ జాబ్ కార్డులు 69,764 ఉ న్నాయి. మొత్తం 11,31,048 పని దినాలు కల్పించారు. 12మండలాల్లో కలిపి 11 లక్షలకు పైగా పని దినాలను కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈ చట్టం ఊతమిస్తోంది. అయితే, పలిమెల వంటి వెనుకబడిన మండలాల్లో ఉపాధి పనులను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. గతేడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే, అనేక మండలాల్లో పని దినాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల(17,191), కొత్తపల్లిగోరి (49,519) వంటి మండలాల్లో లక్ష్యానికి తక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు లక్షకుపైగా పని దినాలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు కూలీలకు పూర్తిస్థాయిలో పని దొరకని పరిస్థితి. మొత్తం 1,05,817 కార్డులు ఉన్నప్పటికీ, 69,764 కార్డులు మాత్రమే యాక్టివ్గా ఉండటం చట్టం అమలులో ఉన్న మందగమనానికి నిదర్శనం.
ఉపాధి’కి సాంకేతిక చిక్కు
హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలోని వంకాయకుంట వద్ద జరుగుతున్న పని ప్రదేశంలో ఎన్ఎన్ఎంఎస్ యాప్ కూలీలకు శాపంగా మారింది. గ్రామంలో మొత్తం 767 జాబ్ కార్డులు ఉండగా, 26 మంది మాత్రమే పనికి వచ్చారు. వేసవి ఎండలు మండుతున్నా పని ప్రదేశంలో కనీస మెడికల్ కిట్లు, నీడ వంటి సదుపాయాలు సరిగా లేకపోవడంతో కూలీలు బయటకు రాలేని పరిస్థితి. వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యం కూలీల నడ్డి విరుస్తోంది. గతంలో 15 రోజుల్లోపే అందే కూలి, ప్రస్తుతం మూడు నాలుగు నెలలవుతున్నా చేతికందడం లేదు. గతంలో 15 రోజులు పని చేసినా నేటికీ పైసా రాలేదని నూటెంకి బిక్షపతి, మారేబోయిన అశోక్ వాపోయారు. దీనికి తోడు ఆధార్ ఆధారిత చెల్లింపుల (ఎంబిపిఎస్) గందరగోళం మరో సమస్యగా మారింది. కూలీలకు తాము రెగ్యులర్గా వాడే బ్యాంకు ఖాతాలో కాకుండా, ఏ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఐరిష్, ఫేస్ రికగ్నైజేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక లోపాల వల్ల ఒక్కొక్కరితో ఫొటో తీయడం భారంగా మారింది.
సౌకర్యాలు కరువు.. బిల్లులు రావు
మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలో 470జాబు కార్డులు ఉన్నాయి. 800మంది కూలీలు పనికి నమోదు చేసుకున్నారు. గ్రామంలో కాంటూరు కందకాలు, చెరువులో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. వీబీజీఆర్ఎం-జీ బిల్లు వచ్చిన తర్వాత కూలీలకు ఉపాధి హామీ చట్టంలో తాగునీరు, మెడికల్ కిట్లు, టెంట్ సౌకర్యం కల్పించడం లేదు. గ్రామపంచాయతీలో నిధులు లేక సమకూర్చడం లేదని సమాచారం ఫిబ్రవరి మొదటి వారంలో పనులు చేపట్టారు. ఐదు వారాల బిల్లులు మాత్రమే వచ్చాయి. మార్చి నుంచి ఇప్పటివరకు కూలీలకు బిల్లు రాలేదు. జిల్లాలో 481 గ్రామాలకుగాను 205 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారు.
చట్టం మార్పుతో నిధుల కోత
ఉపాధి హామీ చట్టంలో మారుతున్న నిబంధనలు, బడ్జెట్ కేటాయింపుల్లో అనిశ్చితి వల్ల క్షేత్రస్థాయిలో మెటీరియల్ కాంపోనెంట్ పనులు నిలిచిపోయాయి. దీనివల్ల గ్రామాల అభివృద్ధి పనులు కుంటుపడటమే కాకుండా, కూలీలు మట్టి పనులకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఐరిష్ నమోదు చేసి హాజరు ఇస్తున్నారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో తప్పులు ఉండటం వల్ల వేలమంది కూలీల పేమెంట్లు నిలిచిపోతున్నాయి. ఎండ తీవ్రత పెరుగుతున్నా పని స్థలాల్లో నీడ కోసం టెంట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. 2014 కంటే ముందు కూలీలకు గడ్డపారలు, పాఠలు తట్టలు ఇచ్చేవారు. ఇప్పుడు కూలీలే కొనుక్కోవాల్సి వస్తున్నది
పనిదినాలు పెంచి వసతులు కల్పించాలి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ అధికారంలోకొచ్చిన నాటి నుంచి నేటి వరకు ఉపాధి హామీ చట్టానికి నిధుల కోత పెడుతూ వస్తున్నారు. గతేడాదిగా పనిదినాలు తగ్గుతూ వస్తున్నాయి. నిధులు సకాలంలో విడుదల కాక బిల్లు చెల్లింపులు ఆలస్యం చేస్తున్నారు. చేసిన కూలికి గిట్టుబాటు కాక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న చట్టం స్థానంలో కొత్తగా వీబీజీఆర్ఎం-జీ పేరుతో పథకంగా మార్చి నూతన నిబంధనలు పెడుతోంది. ఆధార్ ఆధారిత అనుసందానంతోపాటు, ఐరిష్ ఫొటో కాప్చర్ తప్పని సరి కావడంతో అనేక ఆటంకాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడి ఉపాధి హామీ పనిదినాలు పెంచి, పని ప్రదేశంలో వసతులు కల్పించాలి.
సాదుల శ్రీనివాస్, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి, మహబూబాబాద్
పాత చట్టాన్ని అమలు చేయాలి
ఉపాధి హామీలో ఐరిష్ క్యాప్చర్ విధానంతో ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కోసారి స్కాన్ కావడం లేదు. పలుమార్లు పని దగ్గరకు వచ్చి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. అటు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇటు ఉపాధి కూలీలు తర్జనభర్జన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీఆర్ఎఎం-జీ పథకాన్ని పూర్తిగా రద్దుచేసి పాత చట్టాన్ని అమలు చేయాలి.
జినక సోమయ్య, ఉపాధి కూలి



