ఢిల్లీ బైక్.. బీహార్ ముఠా.. మహారాష్ట్ర బ్యాగు
పీఎంజే దోపిడీ కేసులో
షాకింగ్ మలుపులు!
ధర్మపురిలో దొరికిన ‘ఢిల్లీ’ బైక్.. నంబర్ ప్లేట్ ట్విస్ట్!
క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించేలా పోలీసుల వేట
న్యాట్‌గ్రిడ్ నిఘా.. 16 బృందాల గాలింపు.. అడవుల్లో కూంబింగ్!
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ నగర నడిబొడ్డున పట్టపగలు జరిగిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసు ఒక హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గాలి వేగంతో వచ్చి, తూటాలు పేల్చి నగలతో మాయమైన ఆ ఐదుగురు దుండగుల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ఢిల్లీ బైక్, బీహార్ ముఠా, మహారాష్ట్ర బ్యాగ్.. ఇలా ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో ఆధారం బయట పడుతుంటే, ఈ కేసు విచారణ అంతర్రాష్ట్ర ఆపరేషన్‌గా మారింది. ఆదివారం ఉదయం కరీంనగర్ నగరంలోని పీఎంజే జ్యువెల్లరీ షోరూంలో తూటాలు పేలాయి. మాస్కులు కూడా లేకుండా లోపలికి చొరబడిన ఐదుగురు సాయుధ బందిపోట్లు, నిమిషాల వ్యవధిలో కోట్లాది రూపాయల నగలతో పలాయనం చిత్తగించారు. గంట ముందే నగరంలోకి ప్రవేశించి, పని ముగించుకుని మాయమైన ఈ ‘హైటెక్’ దొంగల వెనుక ఉన్నది ఎవరు? బీహార్ ఆయుధాలు, ఢిల్లీ బైకులు, మహారాష్ట్ర బ్యాగుల మధ్య ఉన్న లింకేంటి? పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తున్న నిజాలు ఒక ఉత్కంఠను రేపుతున్నాయి.
అడవి బాటలో వేట..
నిందితులు ప్రధాన రహదారులగుండా వెళ్తే చెక్‌పోస్టుల వద్ద దొరికిపోతామన్న ముందస్తు ప్లాన్‌తో.. గ్రామీణ రహదారులు, అటవీ మార్గాలను ఎంచుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు, రుద్రారం మీదుగా జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ అటవీ గ్రామాల మీదుగా వీరు ప్రయాణించినట్టు తెలుస్తోంది. బీర్పూర్ అడవుల్లో ఒరిషా రిజిస్ట్రేషన్‌తో ఉన్న మరో బైక్ దొరికినట్టు ప్రచారం జరుగుతుండటంతో, సుమారు 200 మంది పోలీసు బలగాలు జగిత్యాల అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. గోదావరి నదిని దాటి దెందెపల్లి అడవుల గుండా లేదా నది తీరం వెంబడి ఆటోల్లో సాధారణ ప్రయాణికుల్లా దుండగులు తప్పించుకున్నారా? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
‘ఐ లవ్ నందూర్బర్’.. ఆ బ్యాగే అసలు గుట్టు?
షోరూం వద్ద దొంగలు వదిలేసిన ఒక బ్యాగ్ పోలీసులకు బలమైన ఆధారాన్ని ఇచ్చింది. దానిపై ‘ఐ లవ్ నందూర్బర్’ అని ఉంది. నందూర్బర్ అనేది ఉత్తర మహారాష్ట్రలోని గుజరాత్ సరిహద్దులో ఉన్న జిల్లా అని తేలింది. నిందితుల్లో ఒకరిని పూణేకు చెందిన పాత నేరస్థుడిగా గుర్తించినట్టు తెలుస్తోంది. వీరు బీహార్‌కు చెందిన కరుడుగట్టిన ముఠా సభ్యులని, ప్రొఫెషనల్ బందిపోట్లని ప్రాథమికంగా నిర్ధారించారు. దోపిడీ సమయంలో ఒక నిందితుడు కింద పడిపోయినప్పుడు, అతని వద్ద ఉన్న 3.2 రివాల్వర్‌కు సంబంధించిన మ్యాగజైన్ అక్కడే పడిపోయింది. ఇది కంట్రీమేడ్(నాటు) ఆయుధమైనప్పటికీ, జర్మన్ మేడ్ వెపన్‌ను పోలి ఉంది. బీహార్‌లోని కొన్ని అక్రమ ఆయుధ తయారీ కేంద్రాల్లో ఇలాంటి వెపన్స్ తయారు చేస్తారు. తయారీదారులు తమదైన ఒక చిన్న మార్క్(గుర్తు)ను ఆయుధాలపై ఉంచుతారు. ఆ మార్క్ ఆధారంగా ఈ ఆయుధాన్ని ఎవరు కొనుగోలు చేశారు? ఎవరి ద్వారా సరఫరా అయింది? అనే వ¶లాలను పోలీసులు వెతుకుతున్నారు.
నాట్‌గ్రిడ్ వేట.. హైటెక్ దర్యాప్తు
క్షేత్రస్థాయిలోనే కాకుండా, సాంకేతిక రంగంలోనూ పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నేరస్థుల డేటాబేస్ (నేషనల్ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్) సాయంతో నిందితుల ఫొటోలను సరిపోల్చు తున్నారు. నిందితుల నేరచరిత్ర, పాత ఎఫ్‌ఐఆర్‌లను విశ్లేషిస్తున్నారు. దేశంలోని కరుడుగట్టిన నేరస్థుల డేటాబేస్ అయిన న్యాట్‌గ్రిడ్ సాయంతో నిందితుల పాత నేరచరిత్ర, జైలు రికార్డులను విశ్లేషిస్తున్నారు. ఇంకోవైపు సి-డాట్ పద్ధతిలో దోపిడీ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్న అనుమానిత సెల్‌ఫోన్ నంబర్లను సేకరించారు. నిందితులు దోపిడీ తర్వాత ఫోన్ నంబర్లు మార్చినప్పటికీ, పాత కాల్ డేటా ఆధారంగా వారి నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్నారు. ఇప్పటికే బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు 16 పోలీసు బృందాలు పయనమ య్యాయి. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకు న్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ, అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ధర్మపురిలో దొరికిన ‘ఢిల్లీ’ బైక్..
దోపిడీ అనంతరం నిందితులు పల్సర్, అపాచీ బైకులపై పరారయ్యారని గుర్తించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని వెంబడించారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా ధర్మపురి పుష్కరఘాట్ సమీపంలో ఒక పల్సర్ బైక్ కలకలం రేపింది. ఆ బైక్ నంబర్ (టీఎస్09వీ6876)ను పరిశీలిస్తే అది హైదరాబాద్‌కు చెందిన ఒక ‘బెలెనో’ కారుదని తేలింది. పోలీసులు ఇంజిన్, చాసిస్ నంబర్లను విశ్లేషించగా, ఆ బైక్ ఢిల్లీ షోరూం నుంచి విక్రయించినట్టు, ఢిల్లీకి చెందిన వాహనమని స్పష్టమైంది. పోలీసుల కండ్లు గప్పేందుకు నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి దొంగిలించిన బైక్‌కు కారు నంబర్ ప్లేట్ తగిలించినట్టు స్పష్టమవుతోంది.
ఆపరేషన్ కరీంనగర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



