ఎమ్మెల్యే ‘గంగుల’ క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ దాడి.. కౌశిక్‌రెడ్డి కారు ధ్వంసం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ వేదికగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య సాగిన మాటల యుద్ధం కాస్తా చివరకు భౌతికదాడులకు దారితీసింది. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌పై బండి సంజరు వ్యాఖ్యలకు కౌంటర్‌గా కౌశిక్‌రెడ్డి చేసిన విమర్శలు బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని నింపాయి. ఈ క్రమంలో కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడే ఉన్న కౌశిక్‌రెడ్డి కారును, కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలు గాయపడటంతో ఉద్రిక్తత నెలకొంది.
వివాదానికి ఆజ్యం పోసిన ‘డ్రగ్స్’ సవాళ్లు
ఈనెల 6న కేంద్ర మంత్రి బండి సంజరు మీడియా సమావేశంలో.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా వ్యక్తిగతంగా దూషిస్తూ విమర్శలు చేశారు. ‘కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారు. దమ్ముంటే పరీక్షలకు రావాలి’ అంటూ పరుష పదజాలంతో మాట్లాడారు. దీనికి కౌంటర్‌గా గురువారం హుజూరాబాద్ ఎమ్మెలే పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ‘బండి సంజరు తంబాకులో డ్రగ్స్ కలుపుకుని తింటున్నారు.. అందుకే ఆయనకు బట్టతల వచ్చింది. కేటీఆర్‌ను నేను టెస్టులకు తీసుకొస్తా.. బండి సంజరు కూడా సిద్ధమా?’ అని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు కౌశిక్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నాయి.
కర్రలతో క్యాంపు కార్యాలయానికి…
కౌశిక్‌రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున కార్యకర్తలు కర్రలతో అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కార్యాలయంపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. కౌశిక్‌రెడ్డి కారును రాళ్లతో కొట్టి అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్, కిటికీ అద్దాలు పగిలిపోయాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. మరోవైపు పాడికౌశిక్‌రెడ్డి నియోజకవర్గ కేంద్రం హుజూరాబాద్ లోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసేందుకు బీజేపీ శ్రేణులు దూసుకొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్బంధించారు. ఈ క్రమంలో ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం కర్రలు విసురుకున్నారు.
నాపై హత్యాయత్నం :
హుజూరాబాద్ ఎమ్మెలే పాడి కౌశిక్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజరు ఇద్దరూ కలిసే తనపై హత్యాయత్నం చేయించారని ఎమ్మెలే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఈ దాడి అనంతరం మీడియాలో మాట్లాడిన ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. తనపై రెక్కీ జరుగుతోందని ముందే చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని, దాడి జరుగుతుంటే పోలీసు కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘బండి సంజరు.. నీకు దమ్ముంటే గీతా భవన్ చౌరస్తాలో చర్చకు రా.. ఇరిగేషన్, ఐటీ లేదా ఏ సబ్జెక్ట్ మీదైనా చర్చించడానికి మేము రెడీ.. టైం, ప్లేస్ నువ్వే చెప్పు’ అంటూ సవాల్ విసిరారు. తమరు సబ్జెక్ట్ మాట్లాడకుండా ‘మమ్మమ్మే, తత్తత్తే, బెబ్బెబ్బే’ అంటే కుదరదు బండి సంజరు.. అంటూ ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ నేతల ఖండన.. బంద్‌కు పిలుపు
ఈ దాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి గూండాగిరి జరగడం దురదృష్టకరమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దాడికి నిరసనగా ఈనెల 9న (శనివారం) కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చినట్టు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జివి.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు సైతం కౌశిక్‌రెడ్డిని హెచ్చరిస్తూ.. ప్రకటనలు చేశారు. ‘నాలుక అదుపులో పెట్టుకోకపోతే జిల్లాలో తిరగనివ్వం’ అంటూ హెచ్చరించారు. ప్రస్తుతం కరీంనగర్‌లో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. రాజకీయ పక్షాల మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే!.
కరీంనగర్‌లో ‘రాజకీయ’ రణరంగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



