Friday, May 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంతేమ, తాలు, తరుగు పేరధాన్యం లో కోత మానాలి

తేమ, తాలు, తరుగు పేరధాన్యం లో కోత మానాలి

- Advertisement -

ఐకేపీ, మార్కెట్ కేంద్రాల్లో షెడ్లు, టార్పాలిన్లు పెట్టాలి
కాంటాలు వేసి, మిల్లులకు తరలించాలి
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య
అనాజిపురంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన

నవతెలంగాణ -భువనగిరి రూరల్
తేమ, తాలు, తరుగు పేరుతో క్వింటాల్ కు రెండున్నర కిలోల నుండి నాలుగున్నర కిలోల వడ్లను రైతుల నుంచి దండుకోవడాన్ని మానాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో, మార్కెట్ కేంద్రాలలో రైతులకు ధాన్యం నిల్వల కోసం షెడ్లు, టార్పాలిన్లు(కవర్లు), తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీఐ(ఎం) స్థానిక నేతలతో కలిసి సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తామని ఊకదంపుడు ముచ్చట్లు చెప్తున్నదని విమర్శించారు. ‘మరి నిన్న మొన్న అకాల వర్షాలతో పెద్ద ఎత్తున రైతులు వరి ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతుంటే ఒక్క మంత్రి కూడా రైతు మార్కెట్ కేంద్రాలను ఎందుకు సందర్శించలేదు’ అని ప్రశ్నించారు. వానలో ధాన్యం తడిసి మొలకలు వస్తుంటే రైతులు భయపడకుండా బాధపడకుండా ఎట్లా ఉంటారని ప్రశ్నించారు. ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్లా కూర్చుంటారని అన్నారు. ఎక్కడ ఐకేపీ సెంటర్ కనబడటం లేదన్నారు. ఎవరిదో భూమి ఆ భూమి మీద రైతులు ధాన్యం కుప్పలు పోసుకుంటున్నారని దీనికి ఐకేపీ సెంటర్ అని పేరు ఎట్లా పెడతారని ప్రశ్నించారు.

ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించి మార్కెట్ కు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కాంటావేసి లారీలకు ఎత్తి మిల్లులకు ఎందుకు తరలించడం లేదన్నారు. మిల్లులకు పోయేవరకు ధాన్యం రక్షణ బాధ్యత రైతుదే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు. రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి మిగిలిన సమస్యలు పట్టించుకోక పోవడం వల్ల రైతు కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చూపించాలని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒక్క రూపాయి కూడా రైతు నష్టపోకుండా చూడాలని, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, మండల నాయకులు పాండాల మైసయ్య, జిట్ట అంజిరెడ్డి, శాఖ కార్యదర్శి కొడాలి కృష్ణ, నాయకులు పిట్టల వెంకటేష్, యండి.రపీక్, గంగదారి భాను, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -