ప్రభుత్వం చెప్పేది ఒకటి అమలయ్యేది మరొకటి
11న కలెక్టరేట్ల ఎదుట నిరసనలుమద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీరైతులతో కలిసి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
‘ధాన్యం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం వీడాలి.. ప్రభుత్వం చెప్పేది ఒకటి క్షేత్రస్థాయిలో అమలయ్యేది మరొకటి. ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా పేరుతో ధాన్యానికి మార్కెట్‌లో ధరలు తగ్గించి కొనుగోలు చేస్తే ఊరుకునేది లేదు’ అని ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడాలి ప్రభుత్వం చెప్పేది ఒకటి అమలయ్యేది మరొకటి 11న కలెక్టరేట్ల ఎదుట నిరసనలు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యాన్ని సీపీఐ(ఎం) బృందం రైతులను, అధికారులను అడిగి తెలుసుకుంది. అనంతరం రైతులతో కలిసి వ్యవసాయ కార్యాలయం ముందు జాన్‌వెస్లీ ధర్నా చేశారు. గ్రామాల్లో వ్యాపారులు ధాన్యానికి క్వింటాకు రూ.1800 ఇస్తున్నారని, వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చిన రైతుల నుంచి క్వింటాల్‌కు రూ. 1700 కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2400 ప్రకటించి కేవలం రూ.1700కే ఖరీదు చేసి నాణ్యత పేరుతో నిలువునా ముంచుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు రెండున్నర కేజీల అదనపు తూకం చేసి రైతులకు టోకరా పెడుతున్నారని తెలిపారు. మక్కలు, వరి ధాన్యాన్ని రైతులు వ్యవసాయ మార్కెట్‌కు తెచ్చి 15 రోజులు కావస్తున్నా… ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.
మార్కెట్‌లో కొనుగోళ్లు ఆలస్యమైతే అకాలవర్షానికి ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని మండిపడ్డారు. మార్కెట్‌లో తగిన టార్పాలిన్లు లేకపోవడంతో ఐదు రోజుల క్రితం కురిసిన వర్షానికి మక్క, వరి ధాన్యం తడిసి ముద్ధయ్యిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. కొందరు దళారీ వ్యాపారులు మార్కెట్‌లో రూ. 1700కు రైతుల దగ్గర కొని ప్రభుత్వానికి రూ.2400కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ చూపి రైతుల నుంచి వచ్చిన ధాన్యం కొనుగోళ్ల వేగవంతానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలపై అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడాలని, లేనిపక్షంలో ఈనెల 11న కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం మార్కెట్ సెక్రెటరీకి సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. ప్రతి గింజా కొనుగోలుకు ప్రయత్నిస్తున్నామని, రైతులు ఎటువంటి ఆందోళన పెట్టుకోవద్దు అని అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్‌రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు, కార్యదర్శివర్గ సభ్యులు కిల్లె గోపాల్, కురుమూర్తి, రాజు, ప్రశాంత్, రాజు, బుర్రి భాస్కర్ రైతులు పాల్గొన్నారు.



