Saturday, May 9, 2026
E-PAPER
Homeసోపతిమనోజ్ఞ శకలాలు-1

మనోజ్ఞ శకలాలు-1

- Advertisement -

ప్రతి మనసులోనూ కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. అవి చిన్న చిన్న తళుకుల్లా మనలో మిగిలిపోతాయి. ఆ గడిచిన క్షణాల వెలుగు తునకలే ఈ మనోజ్ఞ శకలాలు. అలాంటి జ్ఞాపకాల్లో ఆమెది ప్రత్యేక స్థానం. ఆమె గురించి ఆలోచించడం అంటే… ఒక సీజన్‌ను గుర్తుచేసుకోవడం లాంటిది. ఎప్పుడో ఒకప్పుడు వచ్చి మనసును ముద్దాడి, వెళ్ళిపోయినా… ఆ గాలి మత్తు మాత్రం ఇంకా ఎక్కడో తిష్ట వేసినట్టే ఉంటుంది. ఆమె నవ్వు పెద్దగా కాదు, నెమ్మదిగా విప్పుకునే చామంతి పువ్వులా ఉంటుంది. ఆ నవ్వులో ఒక నిశ్శబ్ద విశ్వాసం ఉంటుంది. మనసు గందరగోళంలో ఉన్నప్పుడు, మాటలకంటే ముందుగా దారి చూపించే నిశ్శబ్దం అది. మాటల్లో కాదు, మౌనంలో మాట్లాడే అలవాటు ఆమెది. ఎవరైనా వింటున్నారో లేదో అన్న ఆందోళన లేకుండా, తన భావాలను గాలి చేతుల్లో వదిలేసే తత్వం. ఆమెతో గడిపిన క్షణాలు పెద్ద కథలు కావు. చిన్న చిన్న తళుకులు… కాఫీ కప్పు అంచున తాకిన వేలి గుర్తులు, కళ్ల ముందే అటూ ఇటూ తిరుగుతూ నవ్వుతూ సైగలతో ఆటపట్టించిన ఆ క్షణాలు, రోడ్డుపై వినిపించిన ఓ పాత పాటకు గొంతుకలుపుతూ ఇచ్చిన స్పందనలు.. ఇవన్నీ కలిపితేనే ఆమె.

కాలం మడతల్లో దాగిన ఆమె జ్ఞాపకాలు, గుర్తొచ్చే ప్రతిసారీ గుండెలోకి వెలుగులా జారిపడుతుంటాయి. ఒకసారి వాన పడుతుంటే, తడవకుండా నిలబడిపోవాల్సిన చోట ”ఇంకాస్త తడవాలి…” అని నవ్వుతూ ముందుకు నడిచింది ఆమె. ఆ చినుకుల్లో ఆమె జుట్టు తడుస్తుండగా, నేను చెప్పలేని ఏదో మాట… అప్పుడు మౌనంగా మిగిలిపోయింది. ఒక్కోసారి… జనం మధ్యలో కూడా, ఒక్క క్షణం నా వైపు తిరిగి చూసి ఏమీ చెప్పకుండా నవ్వుతుంది. ఆ నవ్వులో ”నేను ఇక్కడనే ఉన్నాను” అన్న నిశ్శబ్ద హామీ ఉంటుంది. విడిపోతున్న ప్రతి సాయంత్రం అదే మాటలు, అవే నవ్వులు… కానీ అడుగులు మాత్రం వెనక్కి లాగుతున్నట్టుండేవి. ”మళ్లీ కలుద్దాం” అనేది మాటగా ఉన్నా, ఆ మాట వెనుక దాగి ఉన్న అసహనం ఇద్దరికీ తెలుసు. కొన్ని మాటలు అప్పుడే చెప్పాల్సింది. కొన్ని క్షణాలు కొంచెం ఎక్కువగా పట్టుకోవాల్సింది.

ఇప్పుడు ఆ అవకాశాలు అన్నీ జ్ఞాపకాలుగా మారిపోయాక, అవి ఎంత విలువైనవో అర్థమవుతోంది. ఆమెతో ఉన్నప్పుడు కాలం నెమ్మదిగా నడిచినట్టుండేది. ఇప్పుడు ఆమె లేకుండా, కాలం ముందుకు పరుగెడుతుంటే నేను మాత్రం అప్పుడు ఆగిపోయిన చోటే నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రేమ అనేది మనం కలిసి గడిపిన సమయం కాదు. ఆ సమయం ముగిసిన తర్వాత కూడా మనలో మిగిలిపోయే మార్పు. మనుషులు వస్తారు… వెళ్తారు. కానీ వారు మనలో వదిలే అనుభూతులు
కాలానికి అతీతంగా నిలుస్తాయి. ప్రతి సంబంధం ఒక ముగింపు కోసం కాదు.. ఒక అవగాహన కోసం వస్తుంది. ప్రతి విడిపోవడం ఒక కష్టంగా కాకుండా.. మనసు లోతులను పరిచయం చేసే ఒక ప్రయాణంగా మిగులుతుంది. చివరికి మనకు మిగిలేది వాళ్లు కాదు, వాళ్లతో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో ఆ అనుభూతి. అది గుర్తొచ్చినప్పుడల్లా మనసు కాస్త నొప్పిగా నవ్వుతుంది. బహుశా అది ప్రేమ స్వభావం కాబోలు… ఆమెను పూర్తిగా అర్థం చేసుకున్నానని అనిపించిన క్షణమే… ఇంకో కొత్త కోణం కనిపించేది.

ఆమె ఒక ప్రశ్నలా ఉండేది. సమాధానం తెలిసినట్టే అనిపించేది, కానీ పూర్తిగా ఎప్పుడూ పట్టుబడేది కాదు. ఆమె వెళ్లిపోయిన తర్వాత కూడా కొన్ని అలవాట్లు అలాగే మిగిలిపోయాయి. ఉదయం కాఫీ తాగేటప్పుడు ఒకసారి కిటికీ బయటకు చూడటం, రాత్రి నిద్రపోయే ముందు ఆమె పాటను మళ్లీ వినడం.. ఇవన్నీ నిత్యం ఆమె తలపులను గుర్తుచేసేవే. ”తలపులు” అంటే కేవలం జ్ఞాపకాలు కాదు. అవి మనలో మిగిలిపోయిన మనమే. ఆ తలపుల్లోంచి విడిపోయి మిగిలే ఈ చిన్న చిన్న కాంతి తునకలే… మనోజ్ఞ శకలాలు. ఆమె గురించిన నా తలపులు కూడా అలాంటివే. ఆమెతో ఉన్నప్పుడు నేను ఎలాంటి వాడినో గుర్తు చేసే అద్దం తను. ఆమె గురించి రాయడం అంటే ఆమెను తిరిగి పిలుచుకోవడం కాదు, నా లోపల ఇంకా మిగిలి ఉన్న ఆ మదుత్వాన్ని తడుముకోవడం. అందుకే అలాంటి తలపులు మనోజ్ఞ శకలాలై మిగులుతాయి. ఎందుకంటే… జీవితంలో కొందరు మనతో ఉండటానికి రారు.. మనలో ఏదో మార్చి వెళ్లిపోవడానికి వస్తారు. ఆ మార్పు ఒక్కసారిగా కనిపించదు. నెమ్మదిగా మన ఆలోచనల్లోకి జారుతూ, మన నిర్ణయాల్లో స్థిరపడుతూ, చివరికి మన స్వభావంగా మారిపోతుంది. అప్పుడు వాళ్లు మన జ్ఞాపకాలలో కాదు, మన స్పందనల్లో, మన మౌనంలో, మన హదయంలో మనల్ని మెల్లగా తీర్చిదిద్దిన అనుభవంగా స్థిరపడిపోతారు.
– రామ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -