ఏ సబ్జెక్ట్ అయితే అతన్ని మూడుసార్లు ఓడించిందో.. నేడు అదే సబ్జెక్ట్‌లో అతనొక ప్రభంజనం! ఏ సమాజం అయితే ”నీ వల్ల ఏమవుతుంది?” అని ఎగతాళి చేసిందో.. నేడు అదే సమాజం అతని వినూత్న బోధనా శైలికి సలాం చేస్తోంది! బ్యాంక్ ఎగ్జామ్స్‌లో ‘జనరల్ నాలెడ్జ్’ (GK) రాక కుంగిపోయిన ఒక సామాన్య రైతు బిడ్డ.. బట్టీ పట్టే మూస విధానాన్ని బద్దలుకొడుతూ ‘మ్యాప్ పాయింటింగ్’ అనే అద్భుతమైన అస్త్రాన్ని కనుగొన్నాడు? అవకాశాల్లేక ఉచితంగా క్లాసులు చెప్పిన స్థాయి నుంచి.. 50 వేలకు పైగా పుస్తకాలు విక్రయించి, ప్రతిష్టాత్మక కోచింగ్ సెంటర్లలో టాప్ ఫ్యాకల్టీగా ఎదిగాడు? ఓటమిని గెలుపుగా మార్చుకున్న యువకుడి కథ ఇది. అక్షరాలను బట్టీ పట్టడం కాదు.. ప్రపంచాన్ని ఇలా చదవాలంటూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కు సరికొత్త పద్ధతిని పరిచయం చేస్తున్న ‘లెర్న్ జీకే విత్ అంజి’ ఫౌండర్ ఆంజనేయులు సక్సెస్ జర్నీ అతని మాటల్లోనే...
మాది సాధారణ రైతు కుటుంబం. నాన్న తానికొండ నారాయణరావు, అమ్మ సత్యవతి. ఇద్దరూ వ్యవసాయం చేస్తూ ముగ్గురు అక్కలను, నన్ను చదివించారు. ప్రాథమిక విద్య అంతా రామనాధపురం ప్రభుత్వ పాఠశాలలోనే. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నల కష్టాన్ని చూస్తూ పెరిగాను. ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఎమ్‌ఎల్సీ కంపెనీలో ఉద్యోగం సాధించి వాళ్లను బాగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ, బీటెక్ పూర్తయ్యాక కెరీర్ పరంగా నాకంటూ ఎలాంటి క్లారిటీ లేదు. మా అక్క బ్యాంక్ ఉద్యోగి కావడంతో నన్ను కూడా బ్యాంక్ కోచింగ్ తీసుకోమని చెప్పింది. అక్క సలహాతో నంద్యాల వెళ్లి కోచింగ్ తీసుకున్నాను. ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. కానీ మెయిన్స్‌లో నాకు ‘జనరల్ నాలెడ్జ్ (GK), కరెంట్ అఫైర్స్’ విలన్స్‌లా కనిపించాయి. అప్పట్లో మార్కెట్లో ఉన్న జీకే పుస్తకాలన్నీ ‘వికీపీడియా’ను తలపించేలా, కేవలం ‘ఎత్తైనవి, పొడవైనవి’ అంటూ మూసధోరణిలో ఉండేవి. ఆ సమాచారాన్ని ఎలా చదవాలో, ఎలా గుర్తుపెట్టుకోవాలో అర్థం కాక బ్యాంక్ మెయిన్స్ పరీక్షల్లో ఏకంగా మూడుసార్లు ఫెయిల్ అయ్యాను. ఆ వరుస ఓటములు నన్ను తీవ్రంగా కుంగదీశాయి. కానీ, ఎక్కడైతే నేను ఓడిపోయానో.. భవిష్యత్తులో అదే సబ్జెక్టులో గెలవాలన్న కసిని పెంచి నాలో ఒక సరికొత్త ఆలోచనకు బీజం వేశాయి.
చదివే విధానాన్నే మార్చేసిన హైదరాబాద్
బ్యాంక్ ఎగ్జామ్స్ నా వల్ల కాదు అనుకుని, రైల్వేస్ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్‌కు వచ్చాను. అక్కడ జరిగిన ఒక సంఘటన నా ఆలోచనా విధానాన్నే మార్చేసింది. ఓసారి ఫ్యాకల్టీ ‘భారతదేశ నదులు’ (Rivers) అనే టాపిక్ మీద రెండు రోజుల పాటు చాలా అద్భుతంగా క్లాస్ చెప్పారు. కానీ ఆ క్లాస్‌లో కూర్చున్న నాకు ఇండియాలో ఏ రాష్ట్రం ఎక్కడుందో కూడా తెలియదు! సార్ సబ్జెక్ట్ ఎంత బాగా చెప్పినా.. ముందుగా ‘మ్యాప్’ నేర్చుకుంటేనే ఆ నదులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తున్నాయో అర్థమవుతుందని ఆయన చెప్పలేదు, ఆయన చెప్పేది నాకూ ఏమీ అర్థం కాలేదు. దాంతో నాకో నిజం తెలిసొచ్చింది. ఫ్యాకల్టీ కేవలం సబ్జెక్ట్ చెబుతున్నారు కానీ, దాన్ని ‘ఎలా చదవాలో’ ఎవరూ చెప్పట్లేదు. ఒక పక్క క్లాసులు అర్థం కాక పడుతున్న ఇబ్బంది, మరో పక్క రైల్వే నోటిఫికేషన్లు కూడా ఎంతకీ రాకపోవడంతో.. ఆ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడం వథా అనిపించింది. అప్పుడే నాలో ఒక బలమైన ఆలోచన మొదలైంది. ”నా దారి ఇది కాదు, నాలా ఇబ్బంది పడే విద్యార్థులకు జీకేను సులభంగా ఎలా చదవాలో నేర్పించడమే నా లక్ష్యం” అని గట్టిగా నిర్ణయించుకున్నాను. నాకు అర్థం కాని ఆ ‘నదుల’ పాఠం దగ్గరే నా రీసెర్చ్ మొదలుపెట్టి, తీవ్రంగా శోధించి ‘మ్యాప్ పాయింటింగ్’ టెక్నిక్‌ను కనుగొన్నాను. కళ్లున్నా గుడ్డి వాళ్లలా బట్టీ పట్టకుండా, విజువలైజేషన్ ద్వారా నేర్చుకునే విధానాన్ని సొంతం చేసుకున్నాను.
‘లెర్న్ జీకే విత్ అంజి’ ఛానెల్
మ్యాప్ పాయింటింగ్ కనుక్కున్న కొత్తలో, మొదట్లో ఎవరికీ దాని విలువ తెలియక నాకు అవకాశాలు ఇవ్వలేదు. అప్పుడు వెనక్కి తగ్గకుండా.. మళ్లీ నంద్యాల వెళ్లి, నేను ఒకప్పుడు ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నానో, అక్కడి బ్యాంక్ విద్యార్థులకు ముందుగా ఉచితంగా జీకే క్లాసులు చెప్పడం ప్రారంభించాను. నా క్లాసులకు వస్తున్న స్పందన చూసి ఆ తర్వాత వివిధ కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లకు పాఠాలు చెప్పే అవకాశాలు వచ్చాయి. అయితే, నేను శోధించి కనుగొన్న ఈ వినూత్న ‘మ్యాప్ పాయింటింగ్’ కేవలం కోచింగ్ సెంటర్లకే పరిమితం కాకూడదని, అక్కడికి వెళ్లి వేలకు వేలు ఫీజులు కట్టలేని మారుమూల గ్రామీణ విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా నా వంతు సాయంగా అందాలని నిశ్చయించుకున్నాను. ఆ తపనతోనే Learn GK with Anji యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాను. బట్టీ పట్టే పాత పద్ధతులకు స్వస్తి పలికి.. విజువలైజేషన్, 3ణ టెక్నిక్స్ ఉపయోగించి నేను రూపొందించిన వీడియోలను విద్యార్థుల కోసం ఉచితంగా యూట్యూబ్‌లో అందుబాటులోకి తెచ్చాను. సరైన గైడెన్స్ లేక నేను పడ్డ ఇబ్బందులు, నేడు ఏ ఒక్క విద్యార్థీ పడకూడదన్నదే నా ముఖ్య ఉద్దేశం.
ఉద్యోగం రాలేదని కుంగిపోలేదు…
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని నేనెప్పుడూ కుంగిపోలేదు. ఏదో ఒకటి చేయాలి అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఉంది. ”నాకు ఉద్యోగం రాకపోతేనేం, నాలాంటి వేలాది మంది నిరుద్యోగులకు నేనెందుకు దారి చూపకూడదు? భారం అనిపించని విధంగా నేనెందుకు ఒక అద్భుతమైన పుస్తకం రాయకూడదు?” అన్న ఆలోచనే నన్ను ముందుకు నడిపించింది. నేను పడ్డ ఇబ్బంది మరే విద్యార్థి పడకూడదని ముందుగా మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నింటినీ పరిశీలించాను. అవన్నీ చూశాక.. ‘ఒక పుస్తకం అసలు ఎలా ఉండకూడదు? విద్యార్థులకు బరువుగా ఎలా అనిపించకూడదు?’ అనేది నాకు స్పష్టంగా అర్థమైంది. నా దష్టిలో ‘మ్యాప్ పాయింటింగ్’ అంటే కేవలం పోటీ పరీక్షల్లో మార్కులు తెచ్చుకునే సబ్జెక్ట్ కాదు. భౌగోళిక పరిస్థితులను కండ్లకు కట్టినట్టు చేప్పగలిగే బేసిక్ నాలెజ్డ్. అది అందరికి అవపరం. ఆ ఆశయంతో, ఏకంగా 200 టాపిక్స్‌ను మ్యాప్ పాయింటింగ్, ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా కళ్లకు కట్టినట్టు వివరిస్తూ ANJI GK PUBLICATIONS ద్వారా GK Genius (తెలుగు, ఇంగ్లీష్ మీడియం) పుస్తకాలను తీసుకువచ్చాను.
అవమానాలు, ఆర్థిక కష్టాలు దాటుకుని!
”ఇంజనీరింగ్ చదివి ఈ పనేంటి? పుస్తకం రాస్తే నీకేమొస్తుంది?” అని ముఖం మీదే ఎగతాళి చేసిన వాళ్లు ఎంతోమంది. అదే నన్ను ముందుకు నడిపించింది. ఒక అద్భుతమైన పుస్తకం అయితే రాశాను. కానీ, దాన్ని పబ్లిష్ చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేని అయోమయ స్థితి.. దానికి తోడు తీవ్ర ఆర్థిక సమస్యలు. నేను పడుతున్న ఈ కష్టం చూసి మా అమ్మానాన్న చాలా బాధపడ్డారు. ”నీకెందుకురా ఈ కష్టాలు, ప్రశాంతంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా” అని ప్రేమగానే కాస్త గట్టిగా మందలించారు. లక్ష్యం కోసం పోరాడేటప్పుడు ప్రపంచం మొత్తం మనకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. లోకం నన్ను విమర్శించినా, అమ్మానాన్నల కళ్లలో ఆవేదన చూసినా.. నా ఆశయం మీద నాకున్న నమ్మకం మాత్రం సడలలేదు. ఆ క్లిష్ట సమయంలో నా భార్య నాకు కొండంత అండగా నిలబడింది. కొందరు మిత్రులు తోడుగా నిలిచారు. ‘వెనక్కి తగ్గితే ఓడిపోయినట్టు, ధైర్యంగా అడుగేస్తేనే చరిత్ర సష్టించినట్టు’ అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. అందుకే సమస్యను చూసి పారిపోవడం కాదు, దాన్ని ఎదుర్కోవడమే నిజమైన గెలుపు అనుకున్నాను. ఈ రోజు నా ”+ఖ +వఅఱబర” పుస్తకం ద్వారా 50 వేలకు పైగా విద్యార్థులకు చేరువవడం, వేలాది మంది నా క్లాసుల కోసం ఎదురుచూడటం చూసి.. నాడు నన్ను ఎగతాళి చేసిన వారే నేడు ఆశ్చర్యపోతున్నారు. ఆనాడు నా కష్టం చూసి బాధపడిన మా అమ్మానాన్నల కళ్లలో ఈరోజు గర్వం చూశాను. ఇది నా వ్యక్తిగత గెలుపు మాత్రమే కాదు, ఒక ఆశయం కోసం ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయకుండా పోరాడే ప్రతి యువకుడి గెలుపు!
అవనిగడ్డ ‘ప్రగతి’ ప్రయాణం…
నా సబ్జెక్ట్ నైపుణ్యం, పుస్తక రచన నన్ను ప్రతిష్టాత్మక అవనిగడ్డ ప్రగతి డీఎస్సీ కోచింగ్ సెంటర్ (పామర్రు క్యాంపస్)లో ఫ్యాకల్టీగా అడుగుపెట్టేలా చేశాయి. అక్కడికి వెళ్లిన తర్వాత నేను వందలాది మంది విద్యార్థులకు మ్యాప్ పాయింటింగ్ నేర్పించడం ప్రారంభించాను. కేవలం 70 సెకన్లలో 195 దేశాల పేర్లు చెబుతూ, 3ణ విజువల్స్‌తో కఠినమైన సబ్జెక్టులను సైతం సులభంగా వివరిస్తున్న నా శైలి ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ శ్రీ సనకా పూర్ణచంద్రరావు గారిని ఎంతగానో ఆకర్షించింది. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను.. కేవలం ‘భాష’ వస్తే అక్షరాలను మనం ‘చదవగలం’, అదే ‘మ్యాప్ నాలెడ్జ్’ ఉంటేనే ఆ విషయాన్ని పూర్తిస్థాయిలో ‘అర్థం చేసుకోగలం’. అందుకు అనేక ఉదాహరణలున్నాయి.
నా భవిష్యత్ లక్ష్యం ఇదే!
రేపటి దేశ భవిష్యత్తు యువతదే అయినప్పుడు, ఆ యువతను దేశాన్ని నడిపించే అత్యున్నత అధికారులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అందుకే తల్లిదండ్రులందరికీ నాదొక విన్నపం.. మీ పిల్లలను కేవలం మార్కుల పరుగుపందెంలో యంత్రాలుగా మార్చకండి. చిన్న వయసు నుంచే వారికి ‘జనరల్ నాలెడ్జ్’, ‘మ్యాప్ పాయింటింగ్’ మీద అవగాహన పెంచండి. ఇటీవల కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు మ్యాప్ పాయింటింగ్ నేర్పించినప్పుడు.. కేవలం 5వ తరగతి చదువుతున్న పసిపిల్లలు సైతం ప్రపంచ పటంలోని దేశాల పేర్లన్నీ అవలీలగా చెబుతుంటే చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ సంఘటనే నా ఆలోచనలకు మరింత బలాన్నిచ్చింది. నా ఆలోచనలు చూసిన పూర్ణచంద్రరావు గారు.. ”ఈ నాలెడ్జ్ కేవలం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మాత్రమే పరిమితం కాకూడదు. ఈ ‘మ్యాప్ పాయింటింగ్’ టెక్నిక్‌ను స్కూల్ స్థాయిలోనే పిల్లలకు నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్లు అద్భుతాలు సష్టిస్తారు” అని నన్ను ఎంతగానో మోటివేట్ చేశారు. ఆయన ప్రోత్సాహంతో మేమిద్దరం కలిసి రూపకల్పన చేసినదే GK Genius Program అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా మ్యాప్ పాయింటింగ్ నేర్పించడమే నా తుది లక్ష్యం. నా జీవితంలో నేను సివిల్స్ సాధించలేకపోయి ఉండొచ్చు.. కానీ, నా దగ్గర మ్యాప్ పాయింటింగ్ నేర్చుకున్న స్కూల్ పిల్లల్లో భవిష్యత్తులో ఏ ఒక్కరైనా యూపీఎస్సీ (UPSC) సాధించి ఐఏఎస్, ఐపీఎస్ (IAS, IPS)) అధికారులుగా ఈ దేశాన్ని నడిపిస్తే.. నా కష్టానికి అదే అసలైన సార్థకత.



