కేతిగాడు : హారు ట్రంప్! హౌఆర్‌యు? వెల్‌కం టు ది గ్రేట్ చైనా.
జుట్టుపోలుగాడు : ఫైన్. షీ జిన్‌పింగ్. ది గ్రేట్ టు నేషన్స్ సమ్మిట్. మన రెండు మహాదేశాల సమావేశం గురించి యావత్ ప్రపంచం ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నది.
కేతిగాడు : యా.. కానీ అమెరికా ఇప్పుడు క్షీణదశలో వున్నది. అలాంటప్పుడు ‘ది గ్రేట్ అమెరికా’ అని అనవచ్చునా.
జుట్టుపోలుగాడు : భలేవారు మీరు. తమాషాగా జోక్ చెప్పినా జనాలు మీది సీరియస్ కామెంట్ అనుకుంటారు. మీ వదనం అలాంటిది.
కేతిగాడు : యస్. అవును… మేం ఏది సీరియస్‌గా తీసుకున్నా మీరు జోక్‌గా తీసిపారేస్తారు. అందుకే స్వయంగా మిమ్మల్ని పిలిపించుకుని మరీ డైరెక్టుగా చెప్తున్నా. మా తైవాన్ జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎంతకైనా తెగిస్తాం. ఇందులో ఎలాంటి దాపరికం, మొహమాటాలు, మర్యాదలు వుండవ్. తైవాన్ చైనాలో అంతర్భాగం. మీ కొంటె మాటలు, వింత చేతలు ఈ విషయంలో పనికిరావ్. ఏమిటలా బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకు పోయారు. కూల్ ట్రంప్! కూల్! ఒక దేశాధినేతగా మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు.
జుట్టుపోలుగాడు : అసలు విషయం మరిచాను. ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం అయింది ప్రధానంగా హార్మోజ్ జలసంధి విషయమై మాట్లాడటానికి. అవునా…
కేతిగాడు : అవును చెప్పండి.
జుట్టుపోలుగాడు : హార్మోజ్ జలసంధిని తెరవాలి.
కేతిగాడు : అవును తెరవాలి. రాకపోకలను ఎవరూ నియంత్రించకూడదు.
జుట్టుపోలుగాడు : చూశారా. మా ప్రతినిధి బృందంలో టెస్లా స్పేస్ ఎక్స్‌ల సి.ఇ.ఒ. ఎలాన్ మస్క్ నుండి యాపిల్ ఛీఫ్ టిమ్ కుక్‌ల వరకు వున్నారు. ఒక్క అమెరికానే కాదు, ఈ ప్రపంచాన్నే శాసించగల అపర కుబేర దిగ్గజాలు. ఇలాంటివారితో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే ఒక అడుగు ముందుకు పోవచ్చు.
కేతిగాడు : ఎవరు? మీరా? వారా? మేమా?
జుట్టుపోలుగాడు : మీరు భలే చమత్కారులు. పరస్పరం.
కేతిగాడు : మాటలదేముంది. అసలు విషయానికి వద్దాం.
జుట్టుపోలుగాడు : మా బోయింగ్ విమానాలను ఓ రెండొందలు తక్షణం కొనండి.
కేతిగాడు : అలాగే.
జుట్టుపోలుగాడు : మరో 750 భవిష్యత్‌లో కొంటే బావుంటుంది.
కేతిగాడు : చూద్దాం.
జుట్టుపోలుగాడు : మీ ముక్తసరి భలే నచ్చుద్దబ్బా. కానీ మేం సుంకాలు విధించినప్పుడు వెన్వెంటనే అదే రీతిలో బదులిస్తారు.
కేతిగాడు : నిజమేగా.. ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం.
జుట్టుపోలుగాడు : ఏది ఏమైనా మన శిఖరాగ్ర చర్చలు చారిత్రకమైనవి.
కేతిగాడు : మన చర్చలు ఉభయులకే గాక ప్రపంచానికి మేలు చేయాలని ఆశిద్దాం.
జుట్టుపోలుగాడు : మనది వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన సంబంధం.
కేతిగాడు : అవును. తేడా వస్తే విశ్వాసం సన్నగిల్లుతుంది. ఎవరికైందీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా…
జుట్టుపోలుగాడు : మీరు మా చిరకాల స్నేహితులు. అదెలా మరచిపోగలను. మీరంటే మాకు అపార గౌరవం. వచ్చే సెప్టెంబర్‌లో మీరు మా అమెరికాను సందర్శించాలి. ఇదే మా ఆహ్వానం.
కేతిగాడు : ఓ.కే. మిస్టర్ ట్రంప్! ఈ సందర్భంగా మీకో ముఖ్య విషయం చెప్పాలి. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో ఓ ఘటన జరిగింది. అప్పటికే అగ్రస్థానంలో వున్న స్పార్టా దేశం, ఎదిగి వస్తున్న ఏథెన్స్‌ను చూసి, తనకంటే ఎక్కడ ముందుకు పోతుందనే భయంతో యుద్ధదాడికి దిగుతుంది. దీనిని నేను చెప్పడం లేదు. థూసిడి డేసి అనే ఓ చరిత్రకారుని విశ్లేషణ. గుర్తు చేస్తున్నా.. అంతే.
బంగారక్క : (చప్పట్లతో ప్రవేశం) చాలా బాగా నటించారు. మనం కళాకారులం. వాస్తవాన్ని తెలుపుతూనే, ఆయా పాత్రల స్వభావాన్ని, గౌరవాన్ని, హుందాని కాపాడాలి. అది మన బాధ్యత కూడా. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అగ్రదేశాలు అమెరికా – చైనాలు ఇలా చర్చలు జరుపుకోవడం నిస్సందేహంగా ప్రపంచానికి రవ్వంత ఊరట కలిగిస్తుంది. కొన్ని దేశాలైనా ఇప్పుడు భయం గుప్పిట్లో నుండి విడివడి ఊపరి పీల్చుకోగలుగుతాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయిలో సాగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. చాలా ఏళ్ల తరువాత, ట్రంప్ ఇప్పుడు చైనాలో కాలూడినాడు. పరస్పర విశ్వాసంతో, సహకారంతో అది ఎంత పరిమితమైనా వాణిజ్య ఒప్పందాలకు రావడం, ఆ ద్వైపాక్షిక బంధాన్ని బలపరుచుకోవడం ఆహ్వానించదగ్గది. కయ్యానికి కాలు దువ్వడం ఎప్పుడూ హితవు కాదు. ఒక విధంగా ట్రంప్‌కు ఇది గొప్ప ఉపశమనం. ఇంటా బయటా వ్యతిరేకతను మీదు మిక్కిలిగా మూట గట్టుకున్నాడు. చైనా సహకారం లేనిదే ఇరాన్ విషయంలో అంగుళం కూడా ముందుకు పోలేనని తెలిసివచ్చింది.
ఇద్దరూ : కాబట్టి కయ్యం కంటే వియ్యం ఉత్తమం. శుభం.
– కె.శాంతారావు, 9959745723



