న్యాయాన్యాయాలు

Justices”మనం మిట్ట మధ్యాహ్నం, కోర్టు ఆవరణలోకి, అడుగిడితే మన కళ్లముందు, మెరిసేవన్నీ, నలనల్లని అబద్దాలే!’ అంటాడు అలిశెట్టి ప్రభాకర్‌, కోర్టుల్లో న్యాయం జరుగుతుందని, అబద్దాలు ఓడిపోతాయని దేశంలోని అశేష ప్రజానీకం నమ్ముతున్న దాన్ని పటాపంచలు చేస్తూ చెప్పిన పద్యమది. అయితే కోర్టులలో పొందే న్యాయం గురించి అనేకమైన తీర్లుగా వ్యాఖ్యనాలూ, హాస్యాలూ, వ్యంగ్యాలూ మనం వింటాం. కోర్టులో న్యాయం కోసం తిరిగీ తిరిగీ చివరికి తీర్పు వెలువడ్డాక, గెలుపొందిన వాడూ పెద్దగా సంతోషించలేని పరిస్థితే ఉంటుందని, ఓడినవాడు కోర్టులో ఏడిస్తే, గెలిచినవాడు ఇంటికెళ్లి ఏడుస్తాడని ఓ నానుడి ఉంది. న్యాయస్థానాల న్యాయానికి సంకేతంగా కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయ దేవతను చూపెడతారు. ఎందుకంటే వాదనలు విన్నదాని మేరకే న్యాయం ఆధారపడి వుంటుందని అర్థం. అది వాస్తవమే అయినా, న్యాయమూర్తులకు కళ్లూ పనిచేస్తూనే ఉంటాయి. న్యాయమూర్తులూ మానవమాత్రులే కావున అన్ని రకాల భావోద్వేగాలను వారు కలిగి వుంటారనేది విస్మరించరాని వాస్తవం. మన సామాజిక, రాజకీయ అవగాహనలు కుడా తీర్పులలో ప్రతిఫలిస్తాయనేది కూడా వాస్తవమే. ఏది ఏమైనా కోర్టులు, న్యాయమందించే కేంద్రాలుగా ఉంటాయనేది ఓ నమ్మకం. ఆ నమ్మకం వమ్మయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయని న్యాయవ్యవస్థ భాగస్వాములే ఆందోళన చెందటం మనం చూస్తున్నాము.
న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించే, ముప్పువాటిల్లే ప్రమాదం పెరుగుతున్నదని, రాజకీయ ఒత్తిళ్లతో వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటున్నదని, దీన్ని అరికట్టాలని 600 మంది దేశంలోని న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ డి.వై. చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే, బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సోషల్‌ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయ మూర్తులపై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆందోళన చెందారు. ఈ సంఘటన పైన ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఇతరులను బుజ్జగించడం, వేధించడం, కాంగ్రెసు సంస్కృతి అని ఆయన ఆరోపించారు కూడా. దీనికి ప్రతిగా ప్రధానియే దేశంలోని ప్రతి వ్యవస్థ పైనా బల ప్రయోగానికి పాల్పడుతున్నారని, రాజ్యాంగాన్ని దెబ్బతీశారని కాంగ్రెసు నేత ఖర్గే విమర్శించారు. వీళ్లేమి విమర్శలు చేసుకున్నాగానీ కోర్టులపైనా, న్యాయమూర్తులపైనా, రాజకీయులు ప్రభావాన్ని కలిగిస్తున్న మాట వాస్తవం.
ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒకటీ రెండు తీర్పులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మింగుడు పడని విష యంగా మారింది. అందులో ముఖ్యంగా ఎన్నికల బాండ్లకు సంబంధించినది. 2017లో మోడీ ప్రభుత్వం కావాలని తెచ్చిన ఎన్నికల బాండ్ల విధానాన్ని సుప్రీం అవినీతికరమైనదని, వెంటనే బహిరంగపర్చాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని, ఎస్‌బిఐని ఆదేశించింది. మొత్తం ఎన్నికల బాండ్లలో సగానికి పైగా బీజేపీ పార్టీకే వెళ్లడమే కాక, ఈడి, సిబిఐ, ఐటి దాడుల తర్వాత సదరు కంపెనీలు బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు అధికార పార్టీకి అందించిన విషయాలు తేటతెల్లమయ్యాయి. ఇదే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల తీరుపై కూడా సుప్రీం అగ్రహం వ్యక్తం చేయటం, మొదలైన కొన్ని తీర్పులు, వ్యాఖ్యానాలు కేంద్రానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అసలు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర సంస్థలను రాజకీయంగా తమ ప్రత్యర్థులపై ఉపయోగిస్తూ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఈడి, సిబిఐ, ఐటిలను పావులుగా వాడుతున్న విషయం బహిరంగ రహస్యమే. ఎన్నికల వేళ ప్రత్యర్థులను వేధించి, ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడంపై అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. మొన్న అమెరికా, జర్మనీ స్వేచ్ఛా వాతావరణంపై అనుమానాలు వ్యక్తం చేయగా, ఐక్యరాజ్యసమితి కూడా రాజకీయ హక్కులకు రక్షణ ఉండాలని కాంక్ష్షించింది.
ఇది మాత్రమే కాదు ఇంత క్రితం అతి సున్నితమైన రామజన్మభూమి, బాబ్రీమసీదు కేసులో, ప్రభుత్వ వాదనకు అనుకూలంగా తీర్పునిచ్చిన జస్టిస్‌ రంజన్‌ గోగొరుకు రాజ్యసభ సీటునిచ్చి గౌరవించింది. ఇటీవల కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్‌ గంగోపాధ్యాయకు బీజేపీ లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ‘ఎవరైనా న్యాయ వ్యవస్థ నుంచి రాజకీయాల్లోకి వస్తే, అది ప్రశ్నలను లేవనెత్తుతుంది’ అన్న బెంగాల్‌ మంత్రి వ్యాఖ్యలు అక్షర సత్యాలు. దేశ చరిత్రలోనే న్యాయమూర్తులుగా ఉన్నవాళ్లు 2018లో మీడియా ముందుకొచ్చి న్యాయ వ్యవస్థలోని అవకతవకలపై విమర్శించారు. న్యాయమూర్తుల నియామకాల విషయంలోనూ కొలీజియం సిఫారసులకు భిన్నంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవటాన్ని మనం చూస్తాము. రాజకీయ జోక్యం లేని న్యాయవ్యవస్థతోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని పూర్వ న్యాయమూర్తి రేఖాశర్మ అన్నారంటే, జోక్యం పెరుగుతోందని గమనించాలి. న్యాయస్థానాలు, ప్రభుత్వ సంస్థల స్వతంత్రతను దెబ్బతీస్తున్న తీరును ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ జోక్యాన్ని అరికట్టగలిగితేనే రాజ్యాంగ హక్కులు పొందగలుగుతాము.

Spread the love