మత్తుకు చిత్తవుతున్న యువత

మత్తుకు చిత్తవుతున్న యువతఉడుకు రక్తం, ఉక్కు నరాలతో ఉరకలెత్తే యువతరమే ఏ దేశానికైనా సహజ వనరులను మించిన బలమైన సంపద. యువత ఆరోగ్యంగా, పటిష్టంగా సక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు ఆ దేశం అభివృద్ధి సాధించడం చాలా సులభం.మన దేశముతో పాటు ప్రపంచంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలను తీసుకుంటే ఎక్కడైనా యువతరానిదే కీలకపాత్ర. అధిక శాతం మంది యువ జనాభాతో ప్రపంచంలోనే నవ యువదేశంగా కీర్తించబడుతున్న మనదేశం ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉంది. అయితే అద్భుతాలను సృష్టించాల్సిన ఈ యువశక్తి ఇప్పుడు ”మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల” బారిన పడి నిర్వీర్యంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.ముఖ్యంగా విద్యార్థి దశలో చెడు వ్యసనాల బారిన పడి, యువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విచ్చలవిడిగా దొరుకుతున్న డ్రగ్స్‌, పెరిగిపోతున్న ”మద్యం” అలవాటు, వారి జీవిత గమ్యాన్ని పతనం వైపు నడిపిస్తున్నాయి.ఈ మధ్య హై స్కూల్‌ స్థాయి విద్యార్థులు కూడా ”గంజాయికి” అలవాటు పడ్డారని వార్తను చూస్తే భావిభారత పౌరులుగా ఎదగాల్సిన యువతరం ఎటువైపు వెళుతుందో తెలియని పరిస్థితి ఉంది.
మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఇప్పుడు అందరినీ కలవరపరిచే విషయం ”డ్రగ్స్‌”. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే వీటికి అధిక శాతం మంది ”విద్యార్థులు” బానిసలుగా మారడటం. సరదాగా స్నేహితులతో మొదలు పెట్టిన ఈ అలవాటు చివరకు వారిని బానిసలుగా మార్చి,పరువు ప్రతిష్టలను తీసి అర్ధాంతరంగా జీవితాన్ని కోల్పోయే పరిస్థితికి తీసుకువస్తుంది.విద్యార్థులకు యువకులకు డ్రగ్స్‌ను మొదట తక్కువధరలో ఇచ్చి, అలవాటు అయిన తర్వాత ఎక్కువ ధరలకు అమ్మడంతో వాటిని కొనే స్తోమత లేక దొంగతనాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించి కటకటాల పాలైపోతున్నారు కొందరు యువకులు. కొన్నేళ్ల క్రితం వరకూ హైదరాబాద్‌ లాంటి పట్టణాలలో మరియు కొన్ని విశ్వ విద్యాలయాలకు మాత్రమే పరిమితమైన డ్రగ్స్‌ భూతం ఇప్పుడు శరవేగంగా విస్తరించి పట్నం నుండి పల్లెలకు విస్తరించింది. ధనవంతులు, గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉన్నవారికి, విశ్వవిద్యాలయాల్లో కొంతమందికి పరిమితమైన ఈ డ్రగ్‌ సంస్కృతి, గ్రామాల్లోకి,పాఠశాల విద్యార్థుల వరకు రావడమే అందరికీ ఆందోళన కలిగిస్తోంది.ఈ మధ్య గ్రామాల్లో కొందరు విద్యార్థులు గంజాయి తాగుతూ, అమ్ముతూ పోలీసులకు చిక్కడంతో డ్రగ్స్‌ వినియోగంతో పాటు గంజాయి వాడకమూ అధికంగా పెరిగిందనే అసలు విషయం బయటపడింది.
కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులకు డ్రగ్స్‌ అలవాటు చేయిస్తున్నారని, ఇటువంటి వాళ్ల వలలో చిక్కుకోకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలనీ తల్లిదండ్రులు కూడా ఎప్పడికప్పుడు పిల్లలను గమనిస్తూ ఉండడం వల్ల కొంతవరకైనా అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు. ఒక విద్యార్థి ఇంటి నుంచి బయటకెళ్లిన దగ్గర్నుంచి స్కూల్లో అతనేం చేస్తున్నాడు? స్నేహితులు ఎలాంటివారు? బయటేం చేస్తున్నాడు? ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు అప్పుడప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పిల్లలపై నమ్మకం ఉంచడం ముఖ్యమే కానీ, పూర్తిగా పర్యవేక్షణ లేకుండా ఉండటం మంచిది కాదనీ ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు ఇద్దరూ వారిపనుల్లో బిజీ అయిపోయి పిల్లలను పట్టించుకోకపోవడం వల్ల, ఇలాంటి అలవాట్లు చేసుకొని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పిల్లలకు కష్టాలు తెలువకుడదని అడిగిన వెంటనే, బైక్‌, పాకెట్‌మనీ ఇవ్వడం వల్ల విలాసవంతమైన లైఫ్‌ స్టైల్‌కు అలవాటు పడి, చాలామంది విద్యార్థులు మరింత ఆనందం కోసం డ్రగ్స్‌, మద్యపానం, గంజాయి వంటి వాటికి బానిసలుగా మారుతున్నారు.వీటికి బానిసలుగా మారి, విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకుని జీవచ్ఛవాలుగా మారుతున్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు, యువకులు, తల్లిదండ్రులు ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మద్యపానం, డ్రగ్స్‌ అనేవి జీవితాన్ని నాశనం చేసే విషయాలని వాటి జోలికి వెళ్లకుండా స్వీయనియంత్రణతో ఉండాలని తెలియచేయాలి.అదే విధంగా స్నేహితులే వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారని విద్యార్థులు గుర్తించి వ్యసనాలు, చెడు అలవాట్లు ఉన్న స్నేహితుల్ని వీలైనంత దూరంగా ఉంచడం వల్ల కొంతైనా తగ్గించవచ్చు.డ్రగ్స్‌ మహమ్మారి నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత భయంకర వ్యసనంగా మారింది.దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత యువత, విద్యార్థులపై ఉంది.ఒక్క చిన్న తప్పు అందమైన జీవితాన్ని నాశనం చెయ్యకుండా ఉండాలంటే ”గంజాయి, డ్రగ్స్‌, మద్యపానం” వంటి వాటిని దగ్గరకు రానియ్యకుండా ఉండి జీవితాంతం ఆనందంగా ఉండి దేశాభివృద్ధికి సహకరిస్తారని ఆశిద్దాం.
గడప రఘుపతిరావు 9963499282

Spread the love