ఎన్నికల పత్రాలు.. మోదీయ మోసాలు!?

ఎన్నికల పత్రాలు.. మోదీయ మోసాలు!?ఎన్నికల పత్రాల పథకం ఇండియా రాజకీయ పార్టీలకు నిధులు చేకూర్చే విధానం.ఈ ఉభయతారక రహస్య చందాలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. భారతపౌరుడు, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించిన నిబంధనలను నెరవేర్చిన నమోదుచేయబడిన ఏదైనా భారతీయ సంస్థ ఈ పత్రాలను కొనచ్చు. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ నిర్దిష్ట శాఖల నుండి రూ.వెయ్యి నుంచి పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి విలువల చెక్కు, డిజిటల్‌ చెల్లింపులతో మాత్రమే దాత దీన్నికొనాలి.ఈ పథకం అమలుకు ముందు రాజకీయ పార్టీలు తమకు అందే రూ.20 వేల పైబడ్డ చందాల వివరాలను ఆదాయ పన్నుశాఖకు తప్పనిసరిగా ప్రకటించాలి. ఎన్నికల పత్రాల పథకం 2017-18 బడ్జెట్‌లో ప్రవేశపెట్టబడింది. ఇది నగదు చందాలను రూ.2 వేలకు పరిమితం చేసింది. ఈ పథకం రాజకీయ నిధుల రంగంలో పారదర్శకత, జవాబు దారితనాన్ని పెంచుతుందని,భావితరాలకు అక్రమ నిధుల సృష్టిని నిరోధిస్తుందని ప్రభుత్వం వాదించింది.ఎన్నికల పత్రాల పథకంలో అక్రమ ఆర్థిక కార్యక్రమాలకు, అపారదర్శకతకు, దోపిడీకి అవకాశం ఉందని వాదిస్తూ 30 జనవరి 2017నరిజర్వ్‌ బ్యాంక్తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పత్రాల ప్రవేశానికి కార్పొరేషన్‌ల ద్వారా అందించబడే చందాలపై ఉన్న పరిమితిని రద్దుచేసింది. వ్యక్తులు, కార్పొరేషన్‌లు తమ రాజకీయ విరాళాల సమాచారాన్ని అందించాల్సిన తప్పనిసరి బాధ్యతను తొలగించింది. తమ వార్షిక ఆర్థిక నివేదికలలో రాజకీయ విరాళాల భాగాన్ని నివేదించే బదులు, కంపెనీలు పత్రాల కొనుగోలుకు ఏకీకఅత నిధిని బహిర్గతం చేయాలి. ఇందుకు 1961ఆదాయ పన్ను చట్టం, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనలను సవరించారు.ఈ సవరణల పరిణామాలు బాధాకరం. ఒక వ్యక్తి, కార్పొరేషన్‌, ఆసక్తి సమూహం మొత్తాన్ని బయటపెట్టకుండా ఏదైనా రాజకీయ పార్టీకి అపరిమిత మొత్తంలో నిధులను విరాళంగా ఇవ్వవచ్చు.
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ శాఖల మంత్రి, స్వతహాగా న్యాయవాది, దివంగత అరుణ్‌ జైట్లి ఎన్నికల పత్రాల పథకాన్ని ఆర్థిక బిల్లుగా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగ ఆర్థిక బిల్లు నిర్వచనం ప్రకారం ఇది ఆర్థిక బిల్లు కాదు. బడ్జెట్‌ లోని ఏ అంశమయినా ఆర్థిక బిల్లేనని ప్రభుత్వం తప్పుగా వాదించింది.ఈ పత్రాలకు అనామకత ప్రధాన అపశృతి. చందాదారుని వివరాలు తెలుపకుండానే ఎన్నికల పత్రాలను కొని రాజకీయ పార్టీలకు ఇవ్వవచ్చు. కాని దాత వివరాలు లబ్ధిదారు పార్టీకి తెలుస్తాయి. నల్ల సంపాదన దానంతో కార్పొరేట్‌ సంస్థలు నీకిది నాకది సూత్ర లాభాలు పొందుతాయి.ఎన్నికల ప్రక్రియలో అక్రమ నిధుల (నల్లధనం) పెరుగుదల, రాజకీయ పార్టీలకు ఆర్థిక సహకారం ఎన్నికల పారదర్శకతపై తీవ్ర పరిణామాలను కలిగిస్తాయి. భారతీయ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విధానాల తారు మారుకు దారితీస్తాయి. ఉనికిలోలేని(షెల్‌) కంపెనీల ఖాతాలు అనుకూల రాజకీయ పార్టీలకు విరాళాలను అందించడానికి ఒక సాధనంగా ఉపయోగపడే అవకాశం ఉంది. చట్టబద్ధ మార్గాల ద్వారా పొందిన లేదా పన్ను విధించబడిన నిధులను ఉపయోగించి లబ్ధిదారులు పత్రాలను కొంటారు. వాటిని పన్ను ప్రయోజనాల కోసం అక్రమంగా పొందిన లేదా ప్రకటించని నిధులతో మూడవ పక్షానికి అమ్ముతారు. మూడవ పక్షం వాటిని రాజకీయ పార్టీలకు బదిలీ చేస్తుంది.అప్రకటిత వ్యక్తులు, సంస్థలు నవంబర్‌ 2023 నాటికి రూ.16, 518 లక్షల కోట్ల ఎన్నికల పత్రాలను స్టేట్‌ బ్యాంక్‌ నుండి కొన్నారు. కొన్న పత్రాలలో 95 శాతం బీజేపీకి అందాయని నివేదికలు తెలిపాయి. జాతీయో ద్యమంలో పాల్గొని దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల నిధుల కోసం దేబిరించింది. ఎన్నికల పత్రాల నిధులు, ఓటర్ల ఆధార్‌ కార్డుల, జన్‌ ధన్‌ బ్యాంక్‌ ఖాతాల వివరాలు అధికార పక్షం బీజేపీ దగ్గరే ఉన్నాయి. అది అనేక అత్యవసర పథకాల ద్వారా ఎన్నికల ముందు ఓటర్ల బ్యాంక్‌ ఖాతాలకు అధికారికంగా కొంత, అనధికారికంగా కొంత డబ్బును బదిలిచేసి ఎన్నికల లబ్ధి పొందవచ్చు.
రిజర్వ్‌ బ్యాంక్‌ చట్ట సవరణల చట్టబద్ధతను వ్యతిరేకిస్తూ, ఈ పత్రాల వినియోగ అవకాశం కల్పించిన 2016, 2017 ఆర్థిక చట్టాల ద్వారా ప్రజాప్రతినిధి చట్టం, ఆదాయ పన్ను చట్టం, కంపెనీల చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణలను సవాలు చేస్తూ ప్రభుత్వేతర ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (అసోసియేషన్‌ ఫార్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌), మార్క్సిస్టు, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థనలను సుప్రీంకోర్టు పరిశీలించింది. నల్లధనం విపరీత ముప్పును ఎదుర్కోవడానికి, దేశ పరివర్తనకు సహాయం చేయడానికి ఒక సాధనంగా బాధ్యతను పెంచడం, ఎన్నికల సంస్కరణలను ప్రోత్సహించడం ఈ ఎన్నికల పత్రాల ప్రాథమిక లక్ష్యమని సుప్రీంకోర్టులో నొక్కిచెప్పి ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.ఈ పత్రాల అమలుకు చేసినచందా పరిమితిని ఎత్తివేయడం, విదేశీ విరాళాలను ప్రోత్స హించడం వంటి చట్ట సవరణలు అనివార్య దుష్ఫలితాలను ఇస్తాయని, రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయ పారదర్శకతను దెబ్బతీస్తాయని, రాజకీయ విధానాలు మారిపోతాయని భారత ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. తాము ఎన్నుకోబోయే అభ్యర్థి ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాడో తెలియకపోతే రాజ్యాంగ అధికరణ 19(1) (ఎ) ఇచ్చిన అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ అసంపూర్ణం అవుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని,రాజకీయ పార్టీలకు ఎవరు చందాలిస్తారో తెలుసుకునే పౌర,సమాచార హక్కులకు భంగమని 15 ఫిబ్రవరి 2024న సుప్రీంకోర్టు ఎన్నికల పత్రాల పథకాన్ని కొట్టేసింది. ఏడేండ్లుగా అమల్లో ఉన్న ఎన్నికల నిధుల వ్యవస్థను ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తక్షణమే నిలిపివేసింది. ఈ పత్రాల జారీని నిలిపివేయాలని, ఆ పత్రాలను కొన్నవారి, రాజకీయ పార్టీలు పొందిన మొత్తాల వివరాలను ప్రకటించమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఆదేశించింది.ఆదాయ పన్ను, ప్రజా ప్రాతినిధ్య చట్టాల సవరణలను కూడా రద్దుచేసింది. ”ఆర్థిక అసమానతలతో డబ్బు,రాజకీయాల మధ్య అనుబంధంలో ఆర్థిక సహకారాలు నీకిది నాకది ఏర్పాట్లకు దారితీస్తాయి.వ్యక్తులను, సంస్థలను ఒకేలా చూడ్డం పక్షపాత నిర్ణయం.సామాన్యుల, కంపెనీల చందా మొత్తాలలో, చందా ఉద్దేశాలలో తేడాలుంటాయి. ప్రతిఫలాపేక్షతో ఇచ్చే కంపెనీల చందాలు ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.” అని కోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది.”రాజకీయ సహకారాలు చందాదారునికి బల్ల వద్ద స్థానాన్ని కల్పిస్తాయి. ఈ పొందు విధాన నిర్ణయాల మీద ప్రభావం చూపుతుంది.” అని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ అన్నారు.
‘నీకిది నాకది’ సూత్రంతో రాజ్యసభ సభ్యులైన సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోరు ఏప్రిల్‌, 2019లో ఎన్నికల పత్రాలపై స్టే విధించడానికి నిరాకరించారు. సాధారణ ఎన్నికలు రెండు నెలల్లో జరగనున్న నేపథ్యంలో రహస్య చందాల ఎన్నికల పత్రాల పథకం రద్దు మోదీ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ కాగలదు. ముందు చూపున్న బీజేపీ రాజకీయులు ఇప్పటికే కోట్లాది రూపాయలు వసూలుచేసి ఉంటారు. కోర్టు ఎన్నికల పత్రాల అమ్మకాలను ఆపకపోతే ఇంతకు పది రెట్లు వసూలు చేసేవారు. కొత్త అమ్మకాలు ఆగుతాయి.
సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
949020 4545

Spread the love