‘అసమానతల’ ప్రపంచం!

'అసమానతల' ప్రపంచం!‘పుర్రెకో బుద్ది..జిహ్వకో రుచి’ అనే నానుడి అందరికీ తెలిసిందే. కార్పొరేట్‌ దోపిడీ పెరుగుతున్నకొద్దీ ప్రపంచంలో మరిన్ని అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇప్పటికే అనేక వింతలు, విశేషాలు ఎప్పటికప్పుడు వార్తలు, టీవీల్లో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. కొంతమంది ఔత్సాహికులు వారికి నచ్చినవాటిపై వీడియోలు చేసిమరీ ‘నెట్టింట’ పెడుతున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఖరీదైన కార్లలో తిరుగుతూ, విలాసవంతమైన భవనాల్లో సేదతీరుతూ చెమట వాసన కూడా తెలియని లగ్జరీ పీపుల్స్‌కు మాత్రమే.
నదీ తీరాన, సముద్రంపై షిప్‌ల మీద, విలాసవంతమైన రెస్టారెంట్లలో, ఇష్టమైన పర్యాటక ప్రాంతాల్లో ఇలా వినూత్నంగా డిన్నర్‌ ప్లాన్స్‌ వేసుకొని చాలామంది ఎంజారు చేస్తుంటారు. అదే అంతరిక్షంలో అయితే ఇంకెలా ఉంటుంది? సరదాగా భూమి నుండి లక్ష అడుగుల దూరంలోకి అంతరిక్షంలోకి జర్నీ చేస్తే ఇటు సూర్యోదయం..అటు సూర్యాస్తమయాన్ని చూస్తూ గాల్లో తేలుతూ మంచి రుచికరమైన డిన్నర్‌ చేస్తుంటే..! ఆహా.. ఓహో ఆ ఊహే అద్భుతంగా ఉందికదూ. ఈ కొంగొత్త ఆలోచనతో ఓ వ్యాపారవేత్త అంతరిక్షంలో డిన్నర్‌ ప్లాన్‌ చేశాడట! బెలూన్‌ ద్వారా నిర్వహించే ఈ ట్రిప్‌కు స్పేస్‌ వీఐపీ అనే సంస్థ రూపకల్పన చేసింది. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటన కోసం కంపెనీ ఇప్పటికే ప్రముఖ డానిష్‌ షెఫ్‌ను (పాకశాస్త్రనిపుణుడు) రంగంలోకి దింపింది. ప్రపంచంలో ఐదో అత్యద్భుత రెస్టారెంట్‌గా పేరుగాంచిన ప్రముఖ డానిష్‌ రెస్టారెంట్‌లో ఆయన షెఫ్‌గా ఉన్నారు. హైటెక్‌ స్పేస్‌ బెలూన్‌లో అతిథులకు షెఫ్‌ స్వయంగా ఆహారాన్ని వడ్డిస్తారట..!
ఈ ట్రిప్‌లో భాగంగా పర్యాటకులు లక్ష అడుగుల ఎత్తున అంతరిక్షంలోకి బెలూన్‌లో వెళతారు. సూర్యోదయ, సూర్యాస్తమయాల్ని ఆస్వాదిస్తూ డిన్నర్‌ని ఎంజారు చేస్తారు. అంతరిక్ష పర్యాటకం ఊపందుకుంటున్న తరుణంలో ఈ కొత్త ఆలోచనతో చేసిన బిజినెస్‌ స్టార్టింగే మాంచి ఊపందుకుంది. ‘ముందు మాకు రిజిస్ట్రేషన్‌ చేయండి.. మాకు రిజిస్ట్రేషన్‌ చేయండి’ అంటూ జనాలు కూడా ఎగబడుతుండటం ఇక్కడ విశేషం. మొత్తం ఆరుగురు.. ప్రత్యేక క్యాప్సూల్‌లో సిట్టింగ్‌ అవకాశం కల్పించే ఈ బెలూన్‌ అంతరిక్ష పర్యటనకు ఒక్కోటిక్కెట్‌ ధర సుమారు ఐదు లక్షల డాలర్లుగా (సుమారు రూ.4.14 కోట్లు) ఉండొచ్చని తెలుస్తోంది. ధర ఇంత భారీగా ఉన్నా ఔత్సాహిక పర్యాటకులు మాత్రం వెనక్కు తగ్గడంలేదు. ఇండియా నుంచి కూడా చాలామంది దీని గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట! ట్రిప్‌ గురించి ప్రకటించిన 24 గంటలలోపే చాలామంది తమ పేర్లు రిజిస్టర్‌ చేసుకుంటామంటూ ముందుకొస్తున్నారట.
ఇదంతా ఒక విధంగా అభివృద్ధి అవుతున్న ప్రపంచంగా మనకు కనిపిస్తుంది. ఇంకా మన ఇండియా లాంటి దేశమైతే ఏదైనా సాధిస్తే మాటల్లోనే చెప్పలేం. అంతరిక్షంలోకి వ్యోమనౌకను పంపి విజయవంతమయ్యాం. దీని గురించి మారుమూల ప్రాంతంలోని సామాన్య జనానికి పూర్తిగా తెలియకపోయినా..ఏదో సాధించామనే ఒక భావోద్వేగం వారి రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. చాతీ ఆరంగుళాలు ముందుకు పెరిగిందనడంలో ఆశ్చర్యం లేదు. ‘సాధించాం..రా.’ అనే ఫీలింగ్‌ మనసులో బలంగా నాటుకుంది. ఇదంతా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో మన శాస్త్రవేత్తలు చేసిన కృషి. కాదనలేం..అభినందించాల్సిందే. దీని ఫలాలు ఎప్పుడో ఏదోరూపంలో భవిష్యత్తు తరానికి చెందుతాయనేది ఆశాభావం. అయితే ఇక్కడ చెప్పాల్సిన అంశమేమిటంటే అంతరిక్షంలోకి పంపిన రాకెట్‌తో అనేక పరిశోధనలకు ప్రయోజనం. కానీ అంతరిక్షంలో చేసే డిన్నర్‌తో ఏం ఉపయోగమనేది ప్రశ్న?
ఇక్కడ లోతుగా చూడాల్సింది పేద, ధనిక మధ్య తారతమ్యాలు. ధనవంతులు, బాగా బలిసినోళ్లు ఏం చేసినా అది వైరల్‌గానే మారుతుంది. తాజాగా అంతరిక్షంలో డిన్నర్‌కు చేసే ప్లానింగ్‌ కూడా అలాంటిదే. ఇటీవల భారతదేశ దిగ్గజ వ్యాపార వేత్త అయిన అనిల్‌ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ మ్యారెజ్‌ రిసెప్షన్‌ ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో తెలిసిందే. ఆ కార్యక్రమానికి అయిన ఖర్చు వేల కోట్ల రూపాయలు. అందులో వంట చేసినోడికి ఇచ్చిన పారితోషికంతో పేద కుటుంబం ఏడాది హాయిగా గడపొచ్చు. మన మధ్యతరగతి జనాలు పార్కుల్లో ఆనందంగా గడుపుతారు. ఇంకొంతమంది జలపాతాల్లో విహరిస్తారు. మరికొందరు సాగరతీరాన సరదాగా గడపుతారు. ఎక్కువమంది ట్రెయిన్‌లలో ప్రయాణిస్తారు. కుటుంబాలతో షికారుకెళ్తారు. దీని ద్వారా మానసికోల్లాసమే కాకుండా ట్రిప్పులకు ఉపయోగించే కార్ల ద్వారా డ్రైవర్లకు లేదా బోటుషికారులు చేస్తే దాని నిర్వాహకులకు, మనం విహారయాత్రకు కాలు బయటపెడితే చాలు.. ఏదో రూపాన కొన్ని కుటుంబాలు జీవనోపాధి పొందుతాయి. మరీ పేదరికంలో ఉండి ఈ కాస్త ఆనందాన్ని కూడా పొందలేని వారు శ్రమలోనే దాన్ని ఆస్వాదిస్తారు. కూలి పనులు, వ్యవసాయ పనులు చేసేటప్పుడు పాడే పాటల ద్వారా ఆనందం పొందుతారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.
సముద్ర తీరాన ఏర్పాటుచేసిన రెస్టారెంట్లలో కడుపునిండా తినొచ్చు, రుచులను ఆస్వాదించొచ్చు. ఆకాశంలో విహరిస్తూ చేసే విన్యాసాల గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. ఎత్తయిన పర్వతాలపై పడుకునేందుకు ఏర్పాటు చేసిన గదుల్లో హాయిగా నిద్రపోవచ్చు. కానీ అతికొద్ది ధనవంతులు మాత్రమే ఉపయోగించుకునే ఇలాంటి వాటివల్ల నాగరికత అభివృద్ధి చెందుతుందంటే ఏకిభవించలేము. సగం కాలిన కడుపుతో బతుకున్న ప్రజలు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనదేశంలోనైతే ముడొంతుల్లో ఒక వంతు జనాభా అలాగే ఉంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైంది. దీనికి పాలకుల సహకారం కూడా అదేస్థాయిలో ఉంది. దేశం నుంచి దోచుకుపోయిన వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో విదేశాల్లో, ఇలాంటి ఖరీదైన పర్యటనలతో ప్రశాంతంగా గడుపుతున్నవారు అనేకమంది ఉన్నారు.వారి గురించి మాట్లాడటం ఇప్పుడు దేశమున్న పరిస్థితుల్లో చాలా అవసరం.కానీ మనమది చేస్తున్నామా?
మన దేశంలోనిదే మణిపూర్‌ ఒక చిన్న రాష్ట్రం. జాతివైషమ్యాలతో ఏడాదికిపైగా మండుతోంది. ఎంతోమంది దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఆడపిల్లల్ని నడిరోడ్డుపై నగంగా నడిపించి మరీ హత్య చేశారు. ఆదుకునేందుకు, అడ్డుకునేందుకు ఏ ఒక్కరూ రాలేదు. కనీసం పరామర్శకు కూడా ఆ కుటుంబాలు నోచుకోలేదు. చాలా కుటుంబాలు హత్యకు గురయ్యాయి. చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. ఇంతటి దారుణమైన పరిస్థితి అక్కడుంటే ధైర్యం చెపాల్సిన మన ప్రధాని దేశ, విదేశాల్లో పర్యటిస్తారు. ఇంకా చెప్పాలంటే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చూస్తారు. కాశ్మీర్‌ వెళ్తారు, లడక్‌లో ప్రయాణిస్తారు. లక్షద్వీప్‌లో సేదతీరుతారు. కానీ మణిపూర్‌ బాధితుల్ని పరామర్శించేందుకు ఆయనకు ఒక్క పూట కూడా సమయం దొరకదు! ఇది మన దేశప్రజలు చేసుకున్న దౌర్భగ్యం. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఢిల్లీ నడిరోడ్డుపై మద్దతు ధరకోసం రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు ఈ విషయం కూడా తెలియదు తమ కోసమే పోరాడుతున్నారన్న సంగతి. ఇలాంటివాటి గురించి ఎవరికీ బాధలేదు. కనీసం చర్చ కూడా పెట్టరు. కానీ కార్పొరేట్‌ మాయజాలంతో ఆకట్టుకునే అంతరిక్షాల్లో డిన్నర్‌లు, విమానాల్లో విందుల గురించి బాగా సెర్చ్‌చేస్తారు. పర్యటనలకు అడ్వాన్స్‌ బుకింగ్‌లు కూడా చేసు కుంటారు. ఇది మన పాలకులు చెబుతున్న అభివృద్ధి. ఇదేనా దేశం వెలుగుతున్న తీరు! ఇది మారాలి. మనకు రోజు ఎంతోమంది తారసపడుతుంటారు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. చుట్టుపక్కల వారు, మన స్నేహితులు, వారి బాధలు, సమస్యలు ఏకరువు పెడుతుంటారు. కానీ ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో మనమెక్కడున్నాం? పేదరికం, నిరుద్యోగం పెరగడానికి కారణమెవరు? పేద,ధనిక మధ్య పెరుగుతున్న అంతరాలు ఇంకెంతకాలం? వీటి గురించి ప్రధానంగా చర్చించాలి. సగటు మనిషి ఆవేదన తీర్చేందుకు తోటిమనిషి ఉన్నారన్న ధైర్యమివ్వాలి. ప్రపంచంలో ఏమూలన సమస్య ఉన్నా తమదిగా భావించాలి. అలా కృషిచేస్తూ పోరాడే ప్రగతిశీల ఉద్యమాలకు, అభ్యుదయ శక్తులకు తోడుగా నిలవాలి. అప్పుడే ఈ అసమానతల ప్రపంచాన్ని అర్థం చేసుకోగలం.
ఎన్‌ అజయ్ కుమార్‌
9441122809

Spread the love