దారితప్పిన గురుకులాలు

దారితప్పిన గురుకులాలుప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యాలయాలలో విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు, పలు సంఘాల ప్రతి నిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలు చదువు తున్న పాఠశాలలు/ కళాశాలల నిర్వహణ అస్తవ్యస్తమైందనే ఆరోపణలున్నాయి. విద్యార్థుల బలవన్మరణాలకు రకరకాల కారణాలు వెదికే వారు వాటి నివారణకు పక్కా ప్రణాళికలు రచించి హక్కుదారులను మెప్పించడంలో విఫలమయ్యాయనే చెప్పవచ్చు. వసతి గృహాలు, గురుకులాలు మార్కుల విషయంలో ఆశించిన మేర ఫలితాలు సాధిస్తున్నమాట వాస్తవమే. కాని కొంతమంది ప్రాణాలు విడిచి తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చడం దారుణం. ఆరువందల పైచిలుకు విద్యార్థులు చదువుకునే ప్రాంగణా లలో విద్యార్థుల్ని ఇబ్బందులకు గురిచేసే అంశాలపై తగు శ్రద్ద వహించవలసిన తరుణం ఆసన్నమైంది. సన్నబియ్యం, చికెన్‌, మటన్‌, గుడ్డుతో రుచికరమైన భోజనం, మొదటిశ్రేణి ఉత్తీర్ణతపై దృష్టి సారించి గొప్పలు పోవడం ఆనవాయితీ అయింది. పక్కా భవనాలు నిర్మించాలని, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలని, విద్యాయేతర విషయా లలో కూడా విద్యార్థులు రాణిం చాలని పలువురు చెప్పడం షరామామూలే, మొదటి తరంగా విద్యనార్జిస్తున్న వెనుకబడిన వర్గాల విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకొని వారి భావోద్వేగాల పట్ల శ్రద్ద వహించడం కొరవ డిందనే విమర్శలున్నాయి. నిరాశా నిష్పృహలకు లోనై కుంగుబాటుకు గురైన విద్యర్థులను భుజం తట్టి నేనున్నాననే భరోసా కల్పించవలసిన వారు కరువయ్యారనేది అక్షరసత్యం. మనోవిజ్ఞాన నిపుణురాలు శ్రీమతి అంజలి చాప్రియా రాసిన పుస్తకం లాంటి పుస్తకాలు మేధావివర్గం చదవకపోవడం పెద్ద లోపం గానే భావించవచ్చు. మనస్తత్వ నిపుణులు విద్యార్థులతో మనసుతో మట్లాడి ఓదార్చాలని చెబుతారు. నిరంతరం పర్యవేక్షించవలసిన ప్రాంతీయ సమన్వయ కర్తలు చాలామంది పరిజ్ఞానలేమి వలన విద్యాలయాలపై పట్టు సాధించలేకపోతున్నారనే విషయం కూడా అవగతమవతున్నది. వెరసి విద్యార్థుల ఇష్టాఇష్టాలు, కష్టనష్టాలను మనసు విప్పి బిడియం లేకుండా చెప్పుకునే పిరిస్థితులు విద్యాలయాలలో తీసుకు రావడం ప్రధాన కర్తవ్యమైంది. ఇక నిఘా విభాగానికి చెందిన విశ్రాంత ఉద్యోగులను చక్కెర, బెల్లం లాంటివి తూకం వేయడానికి, ఉన్నతాధికారులు సిబ్బందికి మధ్య సమన్వయం కుదుర్చడానికి పరిమితం చేసారని తెలుస్తోంది. ఇలాంటి ఐరావతాలకు కోట్లలో చెల్లించడం నిరర్ధకమని సంఘాలు ఘోషిస్తున్నాయి. గురుకులం ఒక నమూనా సమాజం. అందుకే ఇక్కడ సమాజంలోని మంచి చెడులు ప్రతిబింబిస్తాయి. అయితే సాధారణంగా ఐదో తరగతిలో చేరిన విద్యార్థులు 12వ తరగతి దాకా గురుకులాల్లోనే చదువుకుంటారు. అంటే దాదాపు ఎనిమిదేండ్ల కాలంలో వారిని ప్రభావితం చేసి మానసిక రుగ్మతలను, దౌర్బల్యాల్ని పోగొట్టడంతో పాటు ఇతరాత్ర చెడు వ్యసనాలకు లోనుకాకుండా చూడవలసిన గురుతర బాధ్యత ఎవరిదన్న ప్రశ్న తలెత్తుతోంది. సిబ్బంది నిర్లిప్తత కారణంగా కొత్తగూడెం జిల్లాలోని ఒక గురుకులంలో విద్యార్థులు గంజాయికి బానిసై వింతగా ప్రవర్తిస్తున్నారని పదిహేనురోజుల క్రితం పత్రికలలో ప్రచురితమైంది. రంగారెడ్డి జిల్లాలోని ఒక గురుకులంలో విద్యార్థులు ఏకంగా పాత ఇనుప సామాగ్రి అమ్ముకున్నారంటే పర్యవేక్షణాలోపం లోప భూయిష్టంగా వుందని అర్థమవుతున్నది. మరో పాఠశాలలో స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన ఏడవ తరగతి విద్యార్థులను పాఠశాల నుండి గెంటి వేయవలసి రావడం పరిస్థితికి అద్దంపడుతోంది. విషయం విషయేతర పోటీలలో విద్యార్థులు సాధించిన విజయాలను ప్రచారం చేసుకుంటూ లోపాలను కప్పిపుచ్చుకో వడంలో మాత్రం ఇటు అధికారులు అటు సిబ్బంది తమ ఐక్యమత్యాన్ని చాటుకుంటు న్నారని కూడా తెలుస్తోంది. ఇంకా కొన్ని పాఠశాలలోనైతే విద్యార్థుల పుస్తకాలు, నోట్‌ బుక్కులు ట్రంకు పెట్టెలు మాయమయ్యాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక పుట్టిన రోజులు, పండగ సందర్భాలలో మైనారిటీ తీరని విద్యార్థులు సురాపానం చేస్తూ పట్టుబడ్డ దాఖలాలు కోకొల్లలు. ఇలాంటి వార్తలు పత్రికల వారికి తెలియకుండా జాగ్రత్త పడడంలోనే తలమునకలైన సిబ్బంది, తగు విద్యాబుద్ధులు నేర్పించడానికి, విద్యార్థులలో మానసిక పరివర్తన తీసుకురావడానికి సమయాన్ని వెచ్చించడం లేదనే వాస్తవాన్ని గ్రహించవలసిన అవసరముంది.
నిర్దిష్ట సమయాలలో నైపుణ్యం, విభిన్న పరిస్థితులకు అనుగుణంగా మసలుకునే సామర్థ్యం, వినూత్న వ్యూహాలు, వ్యక్తిత్వ లక్షణాలు, సమర్థవంతమైన సంభాషణ, సహనం, సానుకూలత, సృజనాత్మకత నేటితరం ఉపాధ్యాయ వర్గాలలో ఆశిచినంతమేర లేకపోవడం కూడా విద్యార్థుల పాలిట శాపమైందని తెలుస్తోంది. మేధో సంపన్నులైన ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి విద్యార్థులపై పట్టుకలిగి వుంది. వారిని సన్మార్గంలో నడిపించేవారు. గతంలో మెండుగా వుండేవారని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. విద్యార్థులకు చదువుపై అమితాసక్తిని కలిగించిన సందర్భాలలో విద్యార్థులు కుంగుబాటుకు గురవడం చాలా అరుదు. భవిష్యత్తుపై నమ్మకం, విద్యార్థికి తాను తప్పక సాధిస్తాననే భరోసా తీసుకురావడంలో మనం విఫలమవుతున్నామని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్తగా బోధనావృత్తిలోకి వచ్చిన వారిలో ఎక్కువ మంది సాప్ట్‌వేర్‌, కార్పోరేట్‌ రంగాల వైపు తమ అదృష్టాన్ని పరిక్షించుకొని ఇక్కడ స్థిరపడ్డవారే. సహజంగానే వీరు ఉపాధ్యాయ వృత్తిని ఒక భాద్యతగా తీసుకోవడం కష్టమే. బిల్‌, బెల్‌కే పరిమితమైన ఉపాధ్యాయ వర్గం విద్యార్థులను స్థిత ప్రజ్ఞులుగా చేయడంలో విఫలమవుతు న్నదని కూడా వినిపిస్తోంది. అయితే కొన్నిచోట్ల ఆణిముత్యాల్లాంటి ఉనాధ్యాయులుండటం ఆయా విద్యాలయాలలో చదువుతున్న విద్యార్థుల అదృష్టమే. పాఠశాలలలో తరచూ ప్రధానాచార్యులను ఏదో ఒక నెపంతో మార్చడం, మెమోలు జారీ చేయడం, ఏకంగా సస్పెన్షన్‌లు విధిస్తున్న కార్యదర్శులు సమస్యల మూలాలలోకి వెళ్లడానికి సమయం వెచ్చించడంలేదనే అపవాదు వుంది. ఎవరో చేసిన తప్పిదానికి ప్రిన్సిపాళ్లను బలిచేసి చేతులు దులుపుకుంటున్న ప్రధాన కార్యాలయ సిబ్బందికి కార్యదర్శులకు సరైన నివేదిక అందించడంలో నేర్పరితనం కొరవడిందని స్పష్టమవుతున్నది. పాఠశాలలు గాడి తప్పడానికి, ప్రమాణాలు లోపించడానికి చాలాకాలంగా అక్కడ తిష్ట వేసిన సిబ్బందే కారణమవుతున్నారనే విషయాన్ని విస్మరిస్తున్నా రనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక గురుకులంలో నెలకొన్న పరిస్థితుల వలన ఒక మంచి ఉపాధ్యాయిని బలవన్మరణానికి పాల్పడిన విషయాన్ని ప్రధాన కార్యాలయం గమనించలేకపోయింది.
మనం ఏ విద్యార్థిని అడిగినా తాను డాక్టరో, ఇంజనీరో అవుతానని ఐదో తరగతిలో ఉన్నప్పుడే చెప్పడం మనం వింటుంటాం. అయితే ఇలాంటి విద్యార్థులు కుంగుబాటుకు గురై చదువులో వెనుకబడిపోవడం, ముభా వంగా వుడడం మనం గమనించలేక పోతున్నా మని విద్యావేత్తలు, చెబుతున్నారు. చదువులో వెనకబడడం వలన తమ తల్లిదండ్రుల ఆశ యాలు నెరవేరవేమోనని విద్యార్థులు ఆందోళ నకు గురయ్యే ప్రమాదముంది. అయితే ర్యాంగింగ్‌ షేమింగ్‌ జరిగిన సందర్భాలలో కూడా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతా రనేది వాస్తవం. ఇలాంటి పరిస్థితులు బలవన్మ రణానికి దారితీసే అవకాశం తక్కువ. ఇటీవల ఒక మెడికల్‌ కళాశాలలో జూనియర్‌ విద్యార్థికి సీనియర్‌ విద్యార్థులు గుండుగీయడం వెలుగు లోనికి వచ్చింది. అయితే భావోద్వేగా లను నియంత్రించుకున్న బాధిత విద్యార్థి ఫిర్యాదు చేసి ఆరుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేయిం చడం విన్నాం. విషయ పరిజ్ఞానంలో ముం దున్న విద్యార్థులకు భవిష్యత్‌ ఒక భరోసా, అదే వారిలో తగిన ఆత్మస్థైర్యాన్ని నింపి భావోద్వేగా లను నియంత్రణలోనికి తీసుకువస్తుందని మనోవైజ్ఞానికుల అభిప్రాయం. అయితే ఎలాంటి భేషజాలు లేకుండా విద్యార్థులు తమ ఇబ్బందుల్ని ఇతరులతో చెప్పుకునే స్వేచ్ఛా యుతమైన వాతావరణం విద్యాప్రాంగణాలలో తీసురావడం తక్షణ అవసరం.
డా||. మహ్మద్‌ రఫియొద్దిన్‌ 9849110160

Spread the love