కుచేలోపాఖ్యానం

Kuchelopakhyanam‘కనిడాయం జను నంతగృష్ణుడు దళత్కంజాక్షు డప్పేద వి ప్రునినశ్రాంత దరిద్ర పీడితుం గృశీభూతాంగు జీర్ణాంబరున్‌ ఘన తృష్ణాతుర చిత్తు హాస్యనిలయున్‌ ఖండోత్తరీయుం గుచే లుని నల్లంతనే చూచి సంభ్రమ విలోలుండె దిగెం దల్పమున్‌’ చిక్కి శల్యముగానున్న, చిరిగిన వస్త్రములతోనున్న కుచేలుని చూడగానే ఆశ్చర్యంతో అతని దగ్గరకు గబగబా వెళ్లేందుకు తాను కూర్చున్న పాన్పు దిగాడు కృష్ణుడు అని పోతనామాత్యులు వర్ణిస్తున్న పద్యం అది. శ్రీమద్భాగవతములోని కుచేలోపాఖ్యానము అత్యంత ప్రసిద్ధమయిన కథ. కుచేలుడి అసలు పేరు సుధాముడు. నిత్య దారిద్య్రంలో చినిగిన వస్త్రాలను ధరిస్తాడు కనుక కుచేలుడయ్యాడు. అతని పేరు వినగానే మనకు ఆకలితో అలమటిస్తూ, ఒక పేద బ్రాహ్మణ రూపం గుర్తుకొస్తుంది. కృష్ణుడేమో రాజు, ఐశ్వర్యవంతుడు, ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. బిడ్డలు ఆకలితో అల్లాడిపోతుంటే, మీ స్నేహితుడిని కలిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని కుచేలుని భార్య చెబితే, కృష్ణుడి వద్దకు వస్తాడు. ఆదరించి ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడు కృష్ణుడు. ఇదంతా పురాణ కథ. ఇపుడు ఆ కథను పోల్చుకుంటున్న మోడీ గారి కథను వింటే మరీ మనం అబ్బురపడతాం. కృష్ణుడు, పాపం పేద స్నేహితుడిని ఆదరించి, ఆకలి తీర్చిన సంఘటనను, క్విడ్‌ ప్రోకో విషయానికి పోల్చుకోవటం కృష్ణ భక్తులకు మింగుడుపడని విషయం.
స్నేహితుడి దగ్గరకు వెళ్ళేపుడు ప్రేమగా, కృష్ణుడికి ఇష్టమైన రెండు పిడికిళ్ల అటుకులు మూటకట్టుకుని కుచేలుడు వెళతాడు. కృష్ణుడు పేద స్నేహితుడిని ఆదరించడాన్ని. తనకూ, కార్పోరేట్‌ శక్తులకూ మధ్య జరిగే ఫండ్సూ, బాండ్ల వ్యవహారంగా పోల్చి ప్రధాని మోడి మాట్లాడటం అత్యంత దారుణమయిన విషయం. ఇది కృష్ణుని అవమానించడం కాదా! కృష్ణుడు సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారంగా భక్తులు భావిస్తారు కదా! అట్లాంటి పాత్రను తనకా పాదించుకోవటం, పారిశ్రామిక కార్పోరేటు శక్తులను కుచేలునితో పోల్చడం అభ్యంతరకరమూ, హాస్యాస్పదమూ కూడా. అయితే మోడీ గారు ఒక విషయం మాత్రం చెప్పకనే చెప్పాడు. అదేమంటే, కార్పోరేట్‌ సంస్థాధిపతులు నాకు అత్యంత ప్రేమ గల స్నేహితులని, వారివ్వటం, వారికి నేనివ్వడం జరుగుతూనే వుంటుందని అంగీకరించారు.
ఇంతకీ ఈ కుచేలోపాఖ్యానం మన ప్రధాని గారికి ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఎందుకు జపిస్తున్నారంటే, మొన్న ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణం. రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో విరాళాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్దమని రద్దు చేసింది. ఎందుకంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిన డబ్బును ఇస్తున్నారనే విషయాలు కప్పిపెట్టి పార్టీలకివ్వటం అవినీతికి తావిస్తుందని, క్విడ్‌ ప్రోకోకు దారితీస్తుందని విశ్లేషణచేసింది. గత పదేండ్లుగా అదే జరుగుతోంది. దేశంలో అందరికంటే అధికంగా ఆరు వేల కోట్ల రూపాయల బాండ్లను అధికార బీజేపీ అందుకుందని తెలిసింది. నువ్వు నాకు ఇది ఇస్తే, నేను నీకు ఇది చేస్తా అనే ఒప్పందం రహస్యంగానే జరిగిపోతుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. 2018 నుండి ఈ అవినీతికర వ్యవహారం బాండ్ల రూపంలో సాగుతునే ఉంది. మోదీగారి స్నేహితులు ఆదానీ, అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను, వాటి వాటాలను నిరాఘాటంగా అందిస్తూనే వున్నారు. కార్పోరేటు పన్నురేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు పన్నురేటును 25 శాతం నుండి 15 శాతానికి తగ్గించారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,45,000 వేల కోట్ల ఆదాయం నష్టం వచ్చింది. కార్పోరేట్లకు రూ.ఆరు లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. దీనికి బదులుగా కార్పోరేట్లు భారీ విరాళాలు వీరికి అందించారనేది బహిరంగ రహస్యం.
ఇది అసలు కథ. అవినీతి కథ. ప్రతి పక్షాలు ఈ క్విడ్‌ ఫ్రోకోను బయట పెట్టి విమర్శిస్తూ వుంటే, కుచేలు డిచ్చిన అటుకులను కూడా ప్రతిపక్షాలు అవినీతిగానే పేర్కొంటారని పోల్చిచెప్పటం, తననుతాను కృష్ణుడిగా పోల్చుకోవటం విడ్డూర మైన విషయం. కుచేలుడిచ్చిన పిడికెడు అటుకుల్లాంటివా వేలకోట్ల రూపాయల బాండ్లు? ఇది పురాణపాత్రలనూ అవమానపర్చటం కాదా! ప్రభుత్వం అంత ఉదార స్వభావంతో, ప్రేమతో, కృష్ణుడిలా ప్రతి సహాయం చేస్తున్నదా! ఏమి నటన! ఎంతటిదయ! భళే, భళే. ఈ రకమైన దయ, ప్రేమ, దేశానికి వెన్నెముక లాంటి రైతుపైన ఎందుకు చూపలేక పోతున్నారు. ప్రభుత్వమిచ్చిన హామీలనే నెరవేర్చమంటూ రైతులు ఢిల్లీకి చేరి ఆందోళన చేస్తుంటే ఏ మాత్రం పట్టించు కోకుండా తీవ్ర నిర్భంధానికి పాల్పడుతున్నాడు మోడీ. వాళ్లు దేశ ప్రజలకు అన్నం పెడుతున్నారు. వాళ్ల పంటకి మద్దతు ధర ఇమ్మంటున్నారు. అంతేకదా! వీళ్లకీయటానికి చేతులు రాకపోగా, తూటాలు పేల్చి ప్రాణాలు తీయటం ఏ పురాణ పురుషుడి అనుకరణ! సాక్షాత్తు సుప్రీంకోర్టు తప్పు పట్టి అవినీతి జరిగే ఎలక్టోరల్‌ బాండ్లను రద్దు చేస్తే, ఏమి చేయాలో అర్థంకాక సుప్రీం తీర్పునే ఎగతాళి చేస్తూ, కుచేలుడి అటుకులు తిని, ఆదరించిన కృష్ణుడినే అవినీతి పరుడని తప్పు పడతారా అని పోల్చుకొని మాట్లాడటం సిగ్గుచేటయిన విషయం.

Spread the love