ప్రేమించు ప్రేమకై

love love‘నీకు ఏదైనా కానుకనీయాలని నేనెంత అన్వేషించానో… సరైనది దొర కనే లేదు. బంగారుగనికి బంగారాన్నీ, జలనిధికి కన్నీటినీ కాన్కలుగా ఈయటం ఏం బాగుంటుంది! అన్నీ అలానే అన్పించాయి. నా హృదయాన్నో, ఆత్మనో ఇవ్వాలనుకోవటం ఉచితం కాదు, ఎందుకంటే అవి ఇప్పటికీ నీ దగ్గరనే వున్నాయి’. అంటాడు ప్రేయసితో ప్రేమతో రూమీ కవి. ప్రేమికు రాలికి ఏదో కానుక ఇవ్వాలనీ కోరికతో వెదుకులాడిన తపన కనపడతుంది ఇందులో. 13వ శతాబ్దపు కవి రూమీకి ప్రేమంటే ఇవ్వడమే. అది కానుక యినా, హృదయమైనా. ఇదేమో 21వ శతాబ్దం. ఇప్పుడు ప్రేమ పేరుతో తీసుకోవడం తప్ప మరేమీ ఉండదేమో! ఇంకా ఉంటే గింటే ద్వేషమూ, ప్రాణం తీయటమూ కనిపిస్తుంది. ప్రేమకు నిర్వచనాలు మారిపోయినరు. అనంతమైన మానవ జీవన పరిణామం సంతరించుకున్న భావన ప్రేమ. అనుబంధాల లోగిల్లలో ప్రేమ ఒక పరీమళమై ఆనందాన్ని పంచుతుంది. ప్రేమ అనేది ఒక భావన కావున మనసులోనే వుంటుంది. కానీ దాని వ్యక్తీకరణ భాహ్య చర్యలలోనే కనిపిస్తుంది. అనిపిస్తుంది. ముద్దు పెట్టటం, ఆలింగనం చేసుకోవటం, హత్తుకోవటం, బహుమతులివ్వటం, ఇవన్నీ ప్రేమ కు గుర్తులు, ప్రకటనలు. ఇక ప్రియురాలికైనా, ప్రియుడికైనా తమ ప్రేమను తెలిపేందుకు పరిమళభరితమైన పూవును కానుకగా అందిస్తారు. ఇప్పటి కానుకల తీరు మారిందిలే. అది వేరే విషయం. చరిత్రలో అమర ప్రేమ గాథలు ఎన్నో మనకున్నాయి. జూలియస్‌, సీజర్‌, సలీమ్‌ అనార్కలి, లైలా మజ్నూ, షాజహాన్‌, ముంతాజ్‌, మొదలైన వారి ప్రేమ కథలు మనల్ని ముగ్ధులను చేస్తుంది. తన ప్రేమకు గుర్తుగా భార్య స్మృతికి చిహ్నంగా తాజ్‌ మహల్‌ను నిర్మించి తరతరాలుగా చరిత్రలో నిలిచిపోయాడు షాజహాన్‌. ఇక శరత్‌ చిత్రించిన దేవదాసు, పార్వతిల ప్రేమకథ, ఇప్పటికీ పాఠకులను, ప్రేక్షకులను కట్టిపడేస్తూనే వుంది.
ఇప్పుడీ ప్రేమ ఊటంకింపులెందుకంటే, ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపు కుంటోంది. వారోత్సవాలూ జరు గుతాయి. దాన్నే వాలంటైన్స్‌డే అని పిలుస్తున్నారు. ఎప్పుడో క్రీస్తు పూర్వం వాలెంటైన్‌ అనేవాడు ప్రేమ సందేశాలిస్తూ, ప్రేమ వివాహా లను ప్రోత్సహిస్తుంటే అక్కడి చక్రవర్తి కుమార్తె అతని ప్రేమలో పడు తుంది. అది సహించలేని చక్రవర్తి వాలెంటైన్‌ను నిర్భంధించి మరణ శిక్ష విధిస్తాడు. అతని మరణదినాన్నే ప్రేమికుల దినోత్సవంగా జరుపు కుంటున్నారన్నది ఒక ప్రచారంలో వున్న కథ. ఏదేమయినా ప్రేమను గురించి ఒక రోజును కేటాయించుకోవటం మరింత ప్రాచుర్యం పొం దింది. ఈ ప్రేమికుల వారోత్సవాలు, వ్యాపారాత్మక హోరులో కానుకల మార్కెట్టు లాభాల కార్యక్రమంగా మారిపోయింది. ఎంత విలువైన బహుమతిని ప్రియురాలుకు అందించగలిగితే అంత గాఢమైన ప్రేమ గా పరిగణింపబడుతోంది. వ్యాపారంలో ప్రేమను భాగం చేయటం నేటిచిత్రం. ఈ సందర్భంగా కోట్లాది రూపాయల వ్యాపారం ప్రపంచ వ్యాపితంగా సాగుతుంది. అదటుంచితే, ప్రేమ అనే ఒక గొప్ప భావన, కేవలం ఆకర్షణల, వాంఛల స్థాయికి దిగజారిపోయింది. అంతేకాదు నన్ను ప్రేమించకపోతే తాను బతికి ఉండకూడదనే ఒక దుర్మార్గ మానసిక స్థితికి వచ్చింది. ప్రేమయినా, స్నేహమయినా ఇద్దరి మధ్య, ఇరు మనసుల మధ్య జరిగేది. కానీ నేను ఇష్టపడుతున్నాను, నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ ఇష్టపడాలి. అనే ఆలోచనలు నేటి యువ తలో ప్రబలిపోయాయి. మొన్నటికి మొన్న నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో నడిబజారులో పట్టపగలు అలేఖ్య అనే అమ్మాయిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేసాడు శ్రీకాంత్‌ అనే యువకుడు. నన్ను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అని వెంటపడ్డాడు. నిరాకరించగానే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన మొదటిది కాదు. చివరిదీ కాదేమో! ఇలాంటి ద్వేషోన్మాద హత్యలు మన ముందు చాలానే జరిగాయి. హతమార్చడంలో ప్రేమెక్కడైనా కన పడుతుందా! అదొక వాంఛాపూరిత ఉన్మాదం. వస్తు వ్యామోహం సంస్కృతి పెరిగి పోవడమూ, ప్యూడల్‌ సాంస్కృతిక ఆలో చనలూ కలగలసి, మహిళలంటే కూడా బానిసలుగా, సరుకులుగా మార్చే సిన దాని పర్యవసానమే ఈ ఫలితాలు. ప్రేమను ఉత్సవం చేస్తున్న ఈ నెలలోనే ప్రేమను హత్య చేయటం ఒక విషాదం.
అయితే ఈనాటి ప్రేమలన్నీ ఇలానే ఉన్నాయని, ఉంటాయని కాదు, ఇంతటి మార్కెట్‌ భ్రమల, వస్తు వ్యామోహాల కాలంలోనూ ఆస్తులకు, అంత స్తులకు, కులమతాలకు అతీతంగా ప్రేమను పంచుకుని బ్రతుకుతున్న, సహజీవనాలు చేస్తున్నవారూ ఉన్నారు. వారందరికీ ప్రేమికులరోజు శుభాకాంక్షలు తెలపాలి. అంతేకాని ఈ సాకులు చూపి అసలు ప్రేమలను, యువతీ యువకుల స్వేచ్ఛను వ్యతిరేకిస్తూ, సనాతన ధర్మం పేర ఆధిపత్య భావజాలాన్ని రుద్దే చర్యలనూ తిప్పికొట్టాల్సిన అవసరం వుంది. ప్రేమా, మానవీయ సంబంధాలను నెలకొల్పే దానికి సామాజిక అవగాహనలను నేటి తరానికి అందించాల్సివుంది. ”ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును” అన్న గురజాడ మాటలు నిత్య ఆచరణీయాలు. ఒక్క రోజేమిటి ప్రేమించడానికి! ఎప్పుడూ ప్రేమమయులంగానే జీవించాలి. సమస్త మానవ జాతిపై ఉన్న ప్రేమవల్లనే, వారి విముక్తి కోసం జీవితాన్ని వెచ్చించిన మార్క్స్‌ ప్రేమకు నిలువెత్తు నిద ర్శనం. మార్క్స్‌ జెన్నీల ప్రేమా ప్రపంచానికే ఆదర్శం. ప్రేమించు ప్రేమకై, ఏమింకవలెనురా!’ అంటూ పాడుకోవాలి మనం.

Spread the love