కమ్యూనిస్టులవసరం…

Communists need...”ఇప్పుడే ఇక్కడే ఈ సందర్భంలోనే కమ్యూనిస్టులవసరం” అంటాడో ప్రజాకవి. సరిగ్గా ఇదే విషయాన్ని ఆ పార్టీ ప్లీనరీలో అగ్రనేతలందరూ నొక్కి వక్కాణించారు. అయితే ఈ దేశచరిత్రలో కమ్యూనిస్టులు అత్యంత బల హీనంగా, వారి అవసరం అనివార్యంగా మారిన దశలో ఈ సమావేశాలు జరుగుతుండటం గమనార్హం. ఇప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉండడం ఆ పార్టీలకే కాదు, ప్రజలకూ అవసరం. ప్రజల కోసం పోరాడటానికో, వారి సమస్యలను ప్రభుత్వాలకు నివేదించడానికో మాత్రమే కాదు… నేడు దేశానికి విద్వేషాలను అనుమతించని ప్రగతిశీల వాతావరణం కావాలి. అది కమ్యూనిస్టులు ఇవ్వగలరు. అందుకోసం కమ్యూనిస్టులు కావాలి. కూలిపో తున్న ప్రజాస్వామ్య లౌకిక విలువలను కాపాడుకోవడానికి కమ్యూనిస్టులు కావాలి. ప్రమాదంలో ఉన్న రాజ్యాంగ నియమాలను రక్షించు కోవడానికి కమ్యూనిస్టులు కావాలి. జరుగుతున్న పరిణామాలలో వారి పాత్ర లేకుంటే ప్రజలు నిస్స హాయులుగా మారిపోతారు. అది నివారించడానికి కమ్యూనిస్టులు కావాలి.
దేశంలో జనాన్ని క్రియారహితంగా, జ్ఞాన శూన్యులుగా తయారు చేసే చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. లౌకిక ప్రజాస్వామిక ఆచరణల గురించి కనీసం ఆలోచించడానికి కూడా వీల్లేని భయానక వాతావరణం అలుముకుంటోంది. అంతిమంగా దేశంలో మొత్తం మానవ చైతన్యమే అణ చివేతకు గురవుతోంది. ఫలితంగా దేశ భవిష్యత్తు మునుపెన్నడూ లేనం తగా ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యమంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవగాహనకు భిన్నంగా నేడు భారత దేశంలో అది అమలవుతోంది. మతాన్ని రాజ్యంతో విడదీయ లేనంతగా కలగలిపిన పరిపాలన సాగుతోంది. ప్రజలందరి సంక్షేమానికి, జీవన భద్రతకు, అభివృద్ధికి పూచీ పడవలసిన ప్రభుత్వాలు నిస్సిగ్గుగా తమ బాధ్యతల నుండి తప్పుకుంటు న్నాయి. తమ అంతులేని కార్పొరేట్‌ దోపిడీ నుంచి ప్రజల దృష్టిని ఏమార్చడానికి పాలకవర్గాలు మతాన్ని ఒక సాధ నంగా వాడుతున్నాయి. ఈ దేశంలో నెలకొన్న బహుళ మత విశ్వాసాలను అణచివేసి ఏకైక మతాధిపత్యానికి దారులు వేసే ప్రయత్నాలు పాలక రాజకీయ విధానాలలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఇవి రాజ్యాం గంలోని ఆధునిక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. ఈ విధానాల్ని సైద్ధాంతికంగా, రాజకీయంగా ఓడించి ఈ దేశ భవిష్యత్తును కాపాడు కోవాలి. అందుకు కమ్యూనిస్టులు అవసరం.
ఒకవైపు సమాజంలో సమా న అవకాశాల లేమి తీవ్రమవు తుండగా, మరోవైపు దాన్ని అర్థం చేసుకునేందుకు కావాల్సిన భావావరణం ప్రజలకు లేకపోవడం నేటి విషాదం. దీనివల్ల నిస్సహాయులైన ప్రజలు తమకు తెలియకుండానే ప్రచా రంలో ఉన్న తప్పుడు భావాలకు, ఉద్వేగాలకు ప్రభావితమవుతున్నారు. అధిక సంఖ్యాకుల మత విశ్వాసం విద్వేషంగా మారి ప్రజల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అల్ప సంఖ్యాకుల దైనందిన జీవితంలో భయం రాజ్యమేలుతోంది. వాస్తవాల్ని మరుగుపరచి అబద్ధాల పునాదుల మీద మిథ్యా చరిత్రని నిర్మించే మిత- మతవాద రాజకీయాలు విషం చిమ్ముతున్నాయి. ఈ కారణంగా మతం మత్తుమందుగా వాడిన ఒకానొక కాలం నుండి మతం ఒక ఉన్మాదంగా మారిన ఈ కాలంలోకి వచ్చిపడ్డాం. చివరికి దేవు ళ్లనూ దేవాలయాలను కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు సాధనాలుగా వాడుకునే స్థాయికి రాజకీయాలు దిగ జారాయి. ఈ ఎత్తుగడ పాతదే అయినప్ప టికీ ఈసారి చాలా బలంగా, వేగంగా సమాజాన్ని ప్రజాస్వామిక, లౌకిక స్ఫూర్తికి దూరంగా నెట్టివేస్తుండడం గుర్తించదగిన ప్రమాదం. దీనిని న్యాయస్థానాలు, ఎన్నికల కమిషన్‌ వంటి రాజ్యాంగ సంస్థలు కూడా అడ్డుకోలేని విభ్రాంతికర ఘటనలను పౌర సమాజమంతా మౌనంగా వీక్షిస్తోంది.
రాజ్యం మతం కలగలిసి ఇలా ప్రజల్ని గుడ్డివాళ్లను చేయడం భూ స్వామ్యవ్యవస్థ లక్షణం. నూతన ఆవిష్కరణలకు, అన్వేషణలకు అది అవ రోధంగా మారినందువల్లనే ప్రపంచమంతటా మత ప్రమేయం లేని ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాల ఆవిర్భావం కోసం అనేక పోరా టాలు జరిగాయి. ఆ పోరాటాల ఫలితమే నేటి ఆధునిక లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలు. ఈ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ ఆ రెండిటినీ కలిపి దేశాన్ని తిరిగి మధ్యయుగాల చీకటి కాలానికి తీసుకుపోతోంది. ఒకే జాతి, ఒకే మతం, ఒకే పౌరసత్వం, ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ.. లౌకిక రాజ్యాంగా, సమాఖ్య వ్యవస్థగా కొనసాగుతున్న దేశాన్ని మతరాజ్యంగా, ఏక శిలా సదృశంగా మార్చ జూస్తోంది. అదే జరిగితే సమాజంలో మునుపెన్నడూ ఊహించని విధంగా మతం భూమికగా ఒక విశృంఖలత్వం ప్రబలి మన ఇంటి ముంగిట్లోకొచ్చే భయానక రోజులను చూడాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలో ఇవాళ కమ్యూనిస్టులకు దేశ రాజకీయాలలో ఒక చారిత్రక పాత్ర ఉన్నది. పాలక మనువాదం దేశాన్ని నియం తృత్వం వైపు, కాలం చెల్లిన మధ్య యుగాల తిరోగమన విలువల వైపు నడుపుతున్న ప్రస్తుత సందర్భంలో ఏం చేయాలి? ప్రభు త్వము, ప్రజలు ఈ మత భావనలకతీతంగా, దూరంగా ఉండ గలిగితేనే అది నిజమైన స్వేచ్ఛ, సెక్యులరిజం అని ప్రజలకి ఎలా అర్థం చేయించాలి? మతమే రాజ్యంగా మారటం మహా ప్రమాదమన్న సంగతి ప్రజలకు ఎలా చెప్పాలి? జరుగుతున్న ఘటనల నుంచి ఈ మొత్తం సందర్భాన్ని ఎలా చూడాలి? ఎలా ఎదుర్కోవాలి. ఇదే ఇప్పుడు దేశం ముందు, కమ్యూనిస్టుల ముందు ఉన్న అతిపెద్ద సవాలు.. వారు ఈ సవాలును అధిగమించడంపైనే ఇప్పుడీ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Spread the love