అ’సమ్మతి’ సెగ

అ'సమ్మతి' సెగ”సార్‌, సార్‌, కొంపలు మునిగేలా ఉన్నారు! అక్కడ తన సీనియారిటీ వదిలేసి మన పార్టీలోకి వచ్చినా సరైన మర్యాదలు జరగలేదని వారి బాధ సార్‌ ”ఎండకు దౌడ్‌ దౌడున చెమటలు కక్కుతూ వచ్చిన సహాయకుడు చెప్పాడు. బరిసెల వీరేందర్‌, గాఢ విజరు ఇక పార్టీలో ఉండరు సార్‌. వాళ్ళ ప్రాముఖ్యత తగ్గిందని బాధ పడుతున్నారు. తమలాగే పార్టీలో ఉన్న వాళ్ళ గ్రూపుని బుజ్జ గించాలి. అసమ్మతి పెరగకుండా చూసుకోవాలి. చెప్పులు మోసినా ఫలితం దక్కలేదని ఒకాయన బాధపడుతున్నాడు. ఇలా ఒక్కచోటే కాదు అన్ని చోట్లా చోటా బడా నాయకులు చిన్నా చితకా పార్టీల్లో అప్పుడప్పుడూ చేరుతూనే ఉంటారు, బాధలు పడుతూనే ఉంటారు, వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటారు.
”ఏ కొంపలూ మునగవు కాని ఒక పని చేరు, వాళ్ళు పడితే పడ్డారుగాని నీవేమీ బాధ పడొద్దు. అసమ్మతి వర్గంగా ఉంటారని వార్త వేయించు”
”మనమే వేయిస్తే బాగుంటుందా!” అనుమానం.
”మనమే వేయించామని ఎవరికీ అర్థం కాదు. మనవి కాకున్నా వేసే పత్రికలు మనకున్నారు. నువ్వేం భయపడొద్దు”
”అంతేనంటారా సార్‌”
”అంత గాక మరేమిటి. రాజకీయాల్లోకి వచ్చినాక ఎన్నెన్నో విషయాలు నేర్చుకోవాలి సహాయకా” అంటూ గోడకున్న కఅష్ణుడు, అర్జునుడి బమ్మ ఉన్న క్యాలెండర్‌ చూపించాడు నాయకుడు. మళ్ళీ నాయకుడే నోరిప్పాడు. ”ఈ అసమ్మతి అనే పదంలోనే సమ్మతి ఉంది. నేను నీతో ఉండలేను పోతున్నాను అంటే ఇంకో చోట బాగాలేనప్పుడు మళ్ళీ నీదగ్గరికే వస్తా అన్న అర్థమూ ఉంది. ఈసారి ఎవ్వరితోను పొత్తు లేదు అన్నప్పుడు ఎవరితో అలయన్స్‌ పెట్టుకుంటాడబ్బా అని ఆలోచించాలి. కాబట్టి మామూలు నిఘంటువుకి, రాజకీయ నిఘంటు వుకీ తేడాలుంటాయి శిష్యా” అన్నాడు
”సార్‌, మన క్యాలెండరులో నెల మార్చలేదు, ఇంకా డిసెంబరే ఉంది” అంటూ మార్చబోయాడు మిస్టర్‌ సహాయక్‌.
”ఉండనీ సెగలేకుండా కాస్త చల్లగా ఉంటుంది!!”
అప్పుడు నిజంగానే శ్రీకృష్ణుడిలా కనిపించాడు బాసు సహాయక్‌ కి!!
కాబట్టి చెప్పొచ్చేదీ, బూటొచ్చేదీ ఏమిటంటే ఎండాకాలంలో కాని, ఎన్నికల సమయంలో కానీ ఈ సెగ, అసమ్మతి సెగ అన్నవి మనుషుల్ని కాస్త ఇబ్బంది పెడతాయి. అంతమాత్రం చేత బయటకు పోవడం మానే స్తామా లేదే? అంచేత బయటకు పోదాం రాండి. ఎండాకాలం లోనే ఈ సెగ ఎందుకుంటుంది అన్న దానిపై మనం కొంత శ్రద్ధ పెట్టాలి. పొద్దున లేస్తూనే వేడిగా లేకున్నా కాస్త చల్లగా ఉంటుంది. ఎండ మొదలవుతుంది, మొదలవడమే కాదు అది పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగే ఎండ వాతావరణంలోని గాలిని మెల్లమెల్లగా, తరువాత స్పీడుగా వేడి చేస్తుంది. అప్పుడు ఆ వేడితో పాటు మనకు సెగ తగులుతుంది. అలా సెగ తగలకుండా ఏసీ వేసుకుంటామంటే అది బయట గాలిలో ఇంకా వేడిని పెంచుతుంది. మనం ఈ వేడితో చల్లదనాన్ని, చల్లదనంతో వేడిని తయారు చేయొచ్చు కరెంటుతో. అందుకే కొద్దిగా సైన్సుతో పరిచయం పెంచుకోవాలి. లేదంటే గుండె కుడివైపు కాదురా ఎడమవైపు ఉండేది, చిన్నప్పుడు మాథ్స్‌ చదువుకోలేదా అన్న డైలాగులను జాతిరత్నాలతో చెప్పిస్తారు. దీన్నిబట్టి సైన్సు ఎంత ముఖ్యమో సినిమాలు చూడడం కూడా అంతే ముఖ్యం.
వాతావరణాన్ని అంచనావేసి ఎప్పుడు వేడిగా, వాడిగా తయారవుతుందో ఎవరు అధికారంలోకి వస్తారో అని ఎగ్జిట్‌ పోల్స్‌ లాంటివి పెడుతూ ఉంటారు. అవి అన్ని పార్టీలకూ ఉన్నా, నిజాలు చెప్పేవీ ఉన్నాయి. అయితే ఇవి పోలింగు ముగిశాక వేడిని పెంచేవే, అంతే కాని అసలైన సెగ రగిలే రోజుల్లో ఉండవు.
ఇక ఎవరైనా కొత్త పార్టీ పెట్టినప్పుడు, లేదా పాత పార్టీకే కొత్త పేరు పెట్టినప్పుడు, ఒక పార్టీ ఇంకో పార్టీలోకి కలిసి పోయినప్పుడు ఇలా కొన్ని సందర్భాల్లో రాజకీయ వేడి పెరుగు తుంది. అది కొత్త సీసాలో పాత సారా అనీ ఇంకా అటువంటి డైలాగులే వస్తాయి. చిన్నగా పంచాయతీ, మునిసిపాలిటి, లేదా ఉపఎన్నికలప్పుడు కొద్దిగా వేడి మొదలవుతుంది. మొత్తం రాష్ట్ర శాసనసభకే ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం వేడిగా తయా రవుతుంది. ఇంకొన్నిసార్లు శాసనసభకు, పార్లమెంటుకు ఒకే సారి ఎన్నికలైతే అప్పుడు మే నెలలో ఎండలాగా ఉంటుంది పరి స్థితి. రాజకీయ వాతావరణంలో కూడా అన్ని రుతువులూ ఉంటాయని మరవరాదు. ఓజోన్‌ పొరకు రంధ్రం పడినందున భూమిపై వాతావరణం వేడెక్కుతోందని అందరికీ తెలుసు. సేం టు సేం అలాగే రాజకీయంలో కూడా జరుగుతోంది. ఇక్కడా వర్షాకాలం, చలికాలం, ఎండకాలం ఉంటాయి. ఇప్పుడు అన్ని సీజన్లలో మామిడికాయలు దొరుకుతున్నట్టు అన్ని రాజకీయ పార్టీలనుండి జనాలు అటూ ఇటూ అవుతుంటారు. నిఖార్సుగా నిలబడేది కొద్దిమందే అని అందరికీ తెలుసు. తెలిసో తెలియకుండానో వైరిపక్షంలోని వారిని కేసుల్లో ఇరికించి వాళ్ళే తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా పోతున్నాయి పరిస్థి తులు. నాకు రాజకీయం బాగా తెలుసునని గొప్పలుపోయే వాళ్ళే ఇలాంటి తప్పులు చేయడం చూడొచ్చు. తొందరపడి ఒక కోయిల ముందే కూయొచ్చు కూడా.
ఏ కారణం చేతనైనా ఆకాశం మబ్బు పట్టి ఎండ సరిగా రాకపోయినా, ఒకవేళ వచ్చినా రోజూ ఉన్నంత ఎండ, ఎండసెగ లేకపోయినా, ఈ పేపర్‌ తీసిపెట్టుకొని మళ్ళీ ఎండలు మామూలు స్థితికి వచ్చినప్పుడు చదూకోగలరని మనవి!!
జంధ్యాల రఘుబాబు 9849753298

Spread the love