‘తెలుగు’కు ఏది వెలుగు?

What is the light of 'Telugu'?ప్రపంచంలో నేడు సృజనకు, వినూత్నతకు పట్టం కడుతున్న వేళ.. ఈ సృజన, వినూత్నత ఎక్కడి నుంచి వస్తుంది? మాతృభాష బతికితేనే సృజన పుడుతుంది, వినూత్నత విచ్చుకుంటుంది. విద్యా, విజ్ఞానం వాటి నుంచి విరాజిల్లుతుంది. ఇది పరిశోధనలో తేలిన శాస్త్రీయతే కదా!. దీనిని కాదనగలరా? మాతృభాష అంటే వట్టి అక్షరాల పోగు కాదు. తల్లి పేగు నుంచి గర్భస్థ శిశువుకు ప్రాణధార ఎలా ప్రవహిస్తుందో, తల్లి భాష నుంచి మనిషికి జ్ఞానధార అలానే సంక్రమిస్తుందనేది శాస్త్రీయంగా రూఢ అయింది. అలాంటి మాతృభాష పరిరక్షణ కోసం కొందరు యువకులు ప్రాణాలర్పించిన ”ఫిబ్రవరి 21వ తేదీని” ఐక్య రాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో” అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా” ప్రకటించింది. ప్రపంచంలో ఆంగ్లభాష అనే రోడ్డురోలర్‌ కింద పడినలిగిపోతున్న మాతృభాషలెన్నో..! భాష అనేది ఆ జాతికి తల్లి వేరు అని యునెస్కో గుర్తించింది. ఏ మాతృభాష అంతరించినా మానవ మేధలో కొంత భాగం అంతరించినట్లే. అంతేకాదు ఆ జాతి సాంస్కృతిక వారసత్వానికి సంబంధించి అనేక వెలకట్టలేని రూపాలైన ఆచార వ్యవహారాలు, సామెతలు, నానుడులు, చమత్కారాలు, జాతీయాలు, మౌఖిక, లిఖిత ఆ ప్రాంత సమాచార సంగతులు సర్వం అంతరించిపోతాయి. ”మాతృభాష కన్నయితే ఆంగ్ల భాష కళ్లజోడు” లాంటిది. అసలు కళ్లుంటే? కదా కళ్లజోడుతో పని పడేది. నేడు ఆధునిక వైద్యశాస్త్రం నవజాత శిశువుకు తల్లిపాలు తప్పనిసరి తాగించాలి, బొడ్డు (పేగు) తాడు మూలకణాల్ని భద్రపరిస్తే భవిష్యత్తు ఆపత్కాలంలో ఎనలేని మేలు జరుగుతుందని చెబుతుంది. అలాగే ఆయా జాతులకు జీవనాడి, సంస్కృతికి, మూల కణాలకు, సహజ వికాసానికి మారుపేరైన మాతృభాషను ఇంతగా నిర్లక్ష్యం చేయరాదు. మాతృభాషలో బోధన జరపడం అంటే పరభాషను నేర్చు కోవద్దని కాదు. ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో తప్పనిసరి చేసి, ఉన్నత విద్యలో తెలుగును ఒక విషయంగా ఉంచినప్పుడే భాష మనుగడలో ఉండగలదు. ఆ తరువాత ఎన్ని భాషలు అయినా నేర్చుకోవచ్చు. రాజ్యాంగంలో పొందుపరచుకున్నట్లు మాతృ భాషలను రక్షించుకుంటూ అన్యభాషలు నేర్చుకుందాం. అంతే కాదండోరు ప్రపంచంలో సొంతభాషను నమ్ముకుని అభివృద్ధి చెందిన దేశాలు జపాన్‌, చైనా, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ లాంటివి వారి వారి మాతృభాషల్లోనే విశ్వ విద్యాలయ స్థాయి వరకూ విద్యాబోధనాభ్యాసన చేస్తున్నారు. పాలనలోనూ అవే భాషలను ఉపయోగిస్తూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన వారి చిత్తశుద్ధి నుంచి స్ఫూర్తి పొందాల్సి ఉంది. ప్రపంచీకరణ ముసుగులో ఆంగ్ల మాధ్యమాన్ని అద్దాల మేడలో చూపిస్తూ మాతృభాషను పురిటి నొప్పులకు గురిచేస్తున్న కార్పొరేట్‌శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై, సమాజం పైనే ఉంది. మాతృభాషను మృతభాషగా మారడానికి ముమ్మాటికీ ప్రభుత్వాలు, చదువుకున్న తెలుగు సమాజం, మానవ నిర్లక్ష్యమే కారణం. చదువుకోని జనం నాల్కలపై నడయాడిస్తూ భాషను బతికిస్తున్నారు. ఆధునిక ప్రపంచీకరణ యుగంలో పేదోడి పిల్లలకేమో మాతృభాష మాధ్యమంలో బోధన, పెద్దోడి పిల్లలకేమో ఆంగ్ల చదువులు అనే భేదాభిప్రాయాలు పొడచూపుతున్నాయి. అందుకే పాలకులు పేదోడి పిల్లలైనా, పెద్దోడి పిల్లలైనా ఒకే పాఠశాలలో చదివేలా విద్యా విధానంలో సమూల మార్పులు చేయాలి. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యలో నైనా, సర్కారు బడిలోనైనా మాతృభాష తప్పనిసరి చేయాలి. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ప్రపంచంలో ఎక్కడైనా ఏ మాతృభాషకైనా పెను ప్రమాద సంకేతా నికి కారణం అది మాట్లాడే వారి సంఖ్య క్రమేపి తగ్గిపోతుం డటం వల్లనే. భావ వ్యక్తీకరణకు మాతృ భాషను సాధనంగా వినియోగించే వారు తగ్గిపోతుంటే? ఆ భాష ఉనికికే పెను ప్రమాదం పొంచి ఉంది. అలాగే నెమ్మదిగా నశించి పోతుంది. అలా భారత్‌లో 1961 నాటికి 1652 భాషలు వినియోగంలో ఉండేవి. 2011 నాటికి అందులో 280 పైగా అంతరించిపోయాయి. మాట్లాడే వారి సంఖ్య నానాటికి తగ్గడం వల్ల తెలుగు కనుమరుగయ్యే ముప్పు పొంచి ఉందని భాషా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఐదు దశాబ్దాల పాటు దేశంలో అత్యధికులు మాట్లాడే భాష జాబితాలో తెలుగు మూడో స్థానంలో కొనసాగేది. నేడది హిందీ, బెంగాలీ, మరాఠీల తర్వాత నాలుగో స్థానానికి పరిమితమైంది. సైబర్‌ శకం, డిజిటల్‌ యుగంలో భాషలు మరింత వేగంగా ప్రాధాన్యం కోల్పోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏకత్వంలో భిన్నత్వానికి, సాంస్కృతిక వైవిధ్యానికి నెలవైన భారతా వనిలో భాషలు మన ఘన వారసత్వానికి ప్రతీకలు. ఆసంపదే నాగరికతకు గట్టి పునాది. అది ఇప్పుడు బీటలు వారుతోంది!.
మన దేశ జనాభాలో తెలుగు మాట్లాడేవారు 1971 నాటికి 8.16శాతం ఉండేవారు. నాలుగు దశాబ్దాలలో 6.7 శాతానికి పడిపోయారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాతృభాషపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అందువల్ల పతన వేగం ఇంకా కొనసాగుతూనే ఉందన్న ఆందోళన మాతృభాష అభిమానులలో పెరిగిపోతోంది. ఎందుకింతటి దుస్థితి దాపురించింది?. అమ్మ భాషను పాఠశాల గుమ్మంలోనే వదిలి పెట్టాల్సి వస్తున్న దురవస్థ విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను చావు దెబ్బతీస్తుందంటూ జాతీయ సాధన సర్వే (నాస్‌), అసర్‌-2023 లాంటి సర్వేలు సమస్య మూలాలను స్పృశించాయి. మాతృభాషలో పట్టులేని వారు ఇతర భాషల్లోని నైపుణ్యాలు ఒడిసి పట్టలేరన్న నిజాన్ని పరభాష మోజులో పడి మనవారు గుర్తించడం లేదు. ఇది ”అంధుడికి అద్దం ఇవ్వడం లాంటిదే” అన్న మేధావుల హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న ప్రభుత్వాలు, ఆంగ్లంలో చదివితేనే తమ పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయన్న తల్లిదండ్రుల భావన చాలామందిని ఆంగ్లభాష వైపు మళ్లిస్తుంది. అన్నింటా మాతృభాష వినియోగం పెరిగితేనే కాపాడుకోగలం. దీనికి ప్రభుత్వాలే విశేషకృషి, ప్రాధాన్యత కల్పించాల్సి ఉంది. ప్రభుత్వ నియామకాల్లో అమ్మ భాషకు, తెలుగు మాధ్యమానికి పెద్దపీట వేయాలి. మన తెలంగాణ ప్రభుత్వం శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల్లో తెలుగు వినియోగాన్ని పెంపొందిం చడానికి గట్టి కృషి చేయాలి. తేనెలొలికే తెలుగు రుచిని పసినాలుకలకు పంచి, వారిలో మాతృభాషపై అనురక్తిని పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులు అందిపుచ్చు కోవాలి. తెలుగు గడ్డపై అమ్మ భాషకు ప్రాణప్రతిష్ట చేయడానికి ఆధునిక సాంకేతిక ఉపకరణాల్లో తెలుగును వాడటానికి ఉపయోగపడేలా ఆధునికరించే కృషి తక్షణమే చేపట్టాలి. తెలుగును ప్రపంచ భాషగా గుర్తించేలా ఆధునీక రించాలి. సాంకేతిక నిపుణులు, భాషావేత్తలు, పాలకులు, తెలుగుజాతి చిత్తశుద్ధితో కృషిచేయాలి. ఏ భాషైనా వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం ద్వారానే అభివృద్ధి చెందుతుంది. ప్రతి ప్రభుత్వ శాఖలో, పాలన, న్యాయ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరగాలి. తెలుగు మాధ్య మాలు చదివేవారికి సరియైన భవిష్యత్తు, ప్రత్యేక అవకాశాలు కల్పించబడాలి. అప్పుడే తెలుగుభాష వెలుగొందుతుంది.
మేకిరి దామోదర్‌ 9573666650

Spread the love