బడుగుల మహా జాతర సమ్మక్క, సారక్క

Barangays The Great Fair Sammakka Sarakkaఉమ్మడి వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం అడవుల్లోని ఆదివాసీ గూడాల్లో ఎగసిపడ్డ అగ్గిపిడుగులు సమ్మక్క సారక్కలు. కాకతీయ రాజుల పెత్తనంపై సివంగుల్లా తిరగబడ్డ యోధులు. వారి అమరత్వానికి గుర్తుగా ప్రజలు జరుపుకునే మహా ఉత్సవమే మేడారం జాతర. నేటి నుండి ఆ మహాజాతర ప్రారంభం కాబోతోంది. ఒక కుగ్రామమైన మేడారం ఈ రెండు రోజులు మహాజనసంద్రంగా మారుతుంది. ఆ వీరవనితల చారిత్రక పోరాటగాథను ముక్తకంఠంతో నినదిస్తుంది. 12వ శతాబ్దంలో శిస్తుల పేరుతో కాకతీయుల పీడనకు, పెత్తనాలకు వ్యతిరేకంగా సమ్మక్క, సారక్క, జంపన్న పోరాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ఆదివాసీల సంస్కృతి, ప్రాకృతిక సంస్కృతి. చనిపోయిన తాత ముత్తాతలను పూజించడం వారి సంప్రదాయం. అలాంటి సంప్రదాయంలో తమ జాతికోసం యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారిని ఆదివాసులందరూ వీరులుగా కొలిచారు. నిత్యం వారి త్యాగాలను, తెగువను, చరిత్రను స్మరించుకున్నారు. తమ ముందు తరాలకు కథలుగా చెప్పడం ప్రారంభించారు. తమ భావితరాలు వారిలా తలవంచకుండా బతకాలని భావించి, వారి త్యాగాన్ని మించిన వేడుక లేదని ఒక మహా జాతర ప్రారంభించారు.
ఆదివాసుల సాంప్రదాయం ప్రకారం వారి వంశస్తులే పూజారులుగా వ్యవహరిస్తారు. సమ్మక్క సిద్దబోయిన ఆడబిడ్డ కనుక ఆ సిద్ధబోయిన కుటుంబమే సమ్మక్క గద్దెల వద్ద ఇప్పటివరకు పూజారులుగా ఉన్నారు. సారక్క కాక ఇంటి వంశస్తురాలు, అందుకే కాక ఇంటి పేరు ఉన్నవారే సారక్క గద్దె వద్ద పూజారులుగా ఉన్నారు. ఈ సమ్మక్క సారక్కలకు పూజ ప్రాకృతికమైనది. విగ్రహారాధనకు పూర్తిగా సంబంధం లేనిది. కేవలం గద్దెలకు మొక్కడమే వీరి పద్ధతి. అందుకే చేను చెలక, చెట్టు చేమా, గొడ్డు గోదా వీరి దేవుళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతే ఆదివాసుల దైవం. రెండేండ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి ముందు బుధ, గురు, శుక్రవారాలు పండుగ చేస్తారు. వారం రోజులపాటు అట్టహాసంగా కుల, మతాలకు వ్యతిరేకంగా ఈ జాతర జరుగుతుంది. సర్వమత సమ్మేళనంగా ఈ జాతర ఉంటుంది. బుధవారం రోజు కన్నెపల్లి గ్రామం నుంచి కుంకుమ భరణి, కంక బంగు(వెదురు)ను సారక్కగా కాక వంశస్తులు తీసుకొని సాయంత్రం నాలుగు గంటల వరకు మేడారంలోని ఆమె గద్దెకు చేరుస్తారు. అదేరోజు కొత్తగూడ మండలం పోనుగండ్ల కామారం నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుండి ఆదివారం ప్రారంభమై బుధవారం సాయంత్రం వరకు పగిడిద్దరాజుని మేడరానికి తీసుకొని వస్తారు. గురు వారం రోజున చల్లపేయను (పిల్లలు కనని ఆవు) బలి ఇచ్చి, ఇప్పపువ్వు సార తాగి చిలకల గట్టు నుండి సమ్మక్కను గురువారం రోజు గద్దెకు చేరుస్తారు. శుక్రవారం రోజున మొక్కులు అప్పజెప్పితే శనివారం ఆ తల్లులు గద్దెకు చేరుతారని ఆదివాసుల నమ్మకం. నిజానికీ 1950వరకు ఆ ప్రాంతానికే పరిమితమై ఈ జాతర ఉండేది. ఆ తర్వాత చుట్టూ పక్క గ్రామాలకు పాకింది. 1980 తరువాత ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ నుండి ఎక్కువగా వచ్చే వారు. కాలక్రమేణా నాలుగు రాష్ట్రాల నుండి జనం తండోపతండాలుగా వస్తున్నారు. 2000 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి ఇతర రాష్ట్రాల నుండి కోటి మందికి పైగా ఈ జాతరకు వస్తున్నారు. రెండేండ్లకు ఓసారి జరిగే ఈ సమ్మక్క సారక్క జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు తెచ్చుకుంది.ఈ జాతరలో బ్రాహ్మణ సమాజంలో ఉన్న ఉపవాసాలు, వెజిటేరియన్‌ భోజనాలు, ఆంక్షలు, వివక్షా పద్ధతులూ, ఆడవాళ్లు రావద్దు అనే పద్ధతులు ఏవీ ఉండవు. అంతేకాక ఫుడ్‌ డెమోక్రసీ ఉంటుంది. ‘ఏదైనా తిను, ఏమైనా తాగు, అవి అయ్యాకే నన్ను దర్శనం చేసుకో’ అనేది ఈ జాతర ప్రత్యేకత. కానీ క్రమేణా బ్రాహ్మణవాదులు ఈ జాతరను ఆవహిస్తున్నారు. రాజకీయాలకోసం, మతాధిపత్యం కోసం హిందుత్వ సంప్రదాయాలను చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ, ముస్లిములు కూడా ఈ జాతరకు వస్తారు. వారు ఎలా తింటారు, ఎలా ఉంటారనేది వాళ్ల ఇష్టం. కానీ కొత్తగా జాతరలో హలాల్‌ చేయొద్దని ఒక చర్చను కొత్తగా ఆర్‌ఎస్‌ఎస్‌ తీసుకొస్తున్నది. అందరూ కలిసి చేసుకునే జాతరలో కులాల, మతాల పేరుతో చిచ్చులు పెట్టే పని చేస్తున్నది. దాంట్లోకి ఆదివాసులను లాగే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటివరకు ఏ కులం, ఏ మతానికి సంబంధం లేకుండా నడిచే ఈ జాతరను భ్రష్టు పట్టించే పని కి పూనుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం ఈ దేశంలో ఒకే దేవుడు ఉండాలి. కానీ ఈరోజు ఈ జాతరకు ఇంత మంది వస్తున్నారు కనుక దాన్ని కబ్జా చేసి హిందుత్వాన్ని చొప్పించాలనేది వారి ప్రయత్నం. అసలు ఆదివాసులు ఏ రకంగా హిందువులు అవుతారు. ఆదివాసులు ఒక తెగ. ఏ మతంతోనూ వారికి సంబంధం లేదు. కానీ ఈ ఆదివాసీ జాతరను హిందూ పండగగా మార్చాలని, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నం చేస్తున్నది. మరి సమ్మక్కని తీసుకొచ్చేటప్పుడు చల్ల పేయను బలిచ్చి తింటారు కదా! మరి వారు దాన్ని వీరు అంగీకరిస్తారా? విగ్రహారాధన ఉండదు. బ్రాహ్మణ మంత్రాలు ఉండవు…వీటిని ఆమోదిస్తారా? చిన జీయర్‌ స్వామి సమ్మక్క సారక్కలను విమర్శించిన ప్పుడు వీరు నోరు మెదుపలేదు. ”సమ్మక్క సారక్క లేమన్నా బ్రహ్మలోకం నుండి దిగొచ్చారా… జాతర ఒక వ్యాపారం” అని ఆయన అన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమీ మాట్లాడకుండా ఎందుకు నోరు మూసుకుంది? పైగా పరోక్షంగా మద్దతు ఇచ్చింది. గిరిజనుల, దళితుల, ప్రజల మధ్య చిచ్చుపెట్టే పని ఈరోజు ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నది. ఇప్పటివరకు కలిసున్న, కలిసి తిన్న, మన మధ్య చిచ్చుపెట్టే పని చేస్తున్నది. సర్వమత సమ్మేళనంగా జరిగే ఈ మహా జాతరను కులం పేరుతో, మతం పేరుతో విచ్ఛిన్నం చేయజూస్తున్నది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆదివాసులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు తాము సహజ సిద్ధంగా జరుపుకొనే మహా వీరవనితల జాతరలో వీరి బ్రాహ్మణ జోక్యాన్ని నివారించాలి.
బీరెడ్డి సాంబశివ 9490300329

Spread the love