Sunday, September 6, 2026
E-PAPER
Homeసోపతితమిళ టాకీ యుగం... దేవదాసీలు

తమిళ టాకీ యుగం… దేవదాసీలు

- Advertisement -


టాకీ చిత్రాల కాలం ప్రారంభానికి మద్రాసులో సౌండ్ రికార్డింగ్ సౌకర్యం లేనందున చిత్రనిర్మాతలు కంపెనీ నాటకాల వైపు మొగ్గారు. ఆ సమయంలో సౌండ్ స్టూడియోలున్న కలకత్తా, పూణే, బొంబాయిలకు వారు కళాకారులను తరలించారు. ఈ కాలంలో నాటక బృందాలు సినీ నిర్మాతలకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఒక టాకీ చిత్రానికి అవసరమైన ప్రతి అంశం కంపెనీ నాటకంలో సిద్ధంగా ఉండేది. ఒకవేళ ఒక కళాకారుడు జబ్బు పడితే వారి స్థానంలో మరొకరు నటిస్తారు. ఎందుకంటే కంపెనీ నాటకాల్లో ఎలాంటి ఆకస్మిక పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రతి కళాకారుడు విభిన్న పాత్రలతో పరిచయం కలిగి ఉంటాడు. నాటక సాహిత్య పుస్తకాలు ఈ ప్రక్రియను సులభతరం చేశాయి.


తొలి నాళ్ళలో నిర్మించిన టాకీలన్నీ పాటలతో నిండిన నాటకాలకు చలనచిత్ర రూపాలే. మూకీ యుగంలో సినిమాలలో స్టంట్ మెన్, జిమ్నాస్ట్‌లకు మాత్రమే స్థానం ఉండేది. గాయకుల అవసరం ఉండేది కాదు. కానీ టాకీలు వచ్చాక పాడే నటులకు గిరాకీ పెరిగింది. ఎందుకంటే పాటను విడిగా ఒక ట్రాక్‌పై రికార్డ్ చేసే సౌకర్యం అప్పటికింకా లేదు. కెమెరా రోల్ అవుతున్నప్పుడే కళాకారులు పాడవలసి వచ్చేది. అందువల్ల శాస్త్రీయ సంగీతంతో పరిచయం ఉన్న రంగస్థల నటులకు సినీ రంగం తలుపులు తెరిచింది. శబ్దాన్ని విడిగా రికార్డ్ చేసే విధానం ఒక దశాబ్దం తర్వాత రావడంతో నేపథ్య గాయకులు అనే కొత్త తరం పుట్టుకొచ్చింది. అంతకుముందు గాయకులైన నటుల కొరత కారణంగా చిత్రనిర్మాతలు పురుష పాత్రల కోసం స్త్రీలను తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ‘సావిత్రి’ (1941)లో నారదుని పాత్రను పోషించింది. చాలామందికి తెలియదు ఈమె కూడా దేవదాసి కుటుంబం నుండే వచ్చింది.
చిత్ర నిర్మాత ఒక నాటకాన్ని ఎంచుకుని ఆ నాటకాన్ని ప్రదర్శించే బృందాన్ని నియమించుకుంటాడు. ఈ బృందాన్ని సౌండ్ స్టూడియోల్లోకి తీసుకెళ్లి సినిమా చిత్రీకరిస్తారు. రంగులు వేసిన తెరలు, ఫ్లాట్‌లతో ఒక ప్రోసీనియం వేదికను ఏర్పాటు చేసి కెమెరాను దాని ముందు ఉంచి నాటకాన్ని ప్రదర్శించి సుదీర్ఘమైన ఫ్రంటల్ షాట్‌లలో నేరుగా సినిమాను చిత్రీకరిస్తారు. ఈ చిత్రాలలోని కంటెంట్ దేవదాసి సంప్రదాయంలోని పాటలు, నృత్యాల నుండి తీసుకున్నారు. అయితే ఇసై వెలలార్ వర్గానికి చెందిన నృత్య దర్శకులకు తొలి టాకీలలో గుర్తింపు రాలేదు. అయినా వారు 1970వ దశకం వరకు తమిళ సినిమాపై తమ ప్రభావాన్ని కొనసాగించారు. తమిళంలో టాకీలు వచ్చిన మొదటి ఐదేళ్లలో నిర్మించిన మొత్తం 60 సినిమాలు నాటక కంపెనీల ప్రదర్శనలకు ప్రతిరూపాలుగా ఉండేవి. ఈ సినిమాల్లోని చాలామంది కథానాయికలు ‘ఇసై వెలాలర్’ సంప్రదాయానికి చెందినవారు. వారి కుమార్తెలు, మనుమరాళ్లు కూడా తమిళ చలనచిత్ర రంగంలో రాణించారు.1960 – 90ల వలకు తెరపై ప్రత్యేక నృత్యాలు చేసిన జ్యోతిలక్ష్మి, జయమాలినిలు ‘పార్వతి కళ్యాణం’ (1936), ‘కాలమేఘం’ (1941) చిత్రాల తార ఎస్.పి.ఎల్. ధనలక్ష్మి కుమార్తెలే.

తొలిదశలో రంగస్థలం నుండి సినిమాకు మారిన వారిలో కె.ఆర్. శారదాంబాల్ (కొండితోప్పు శారదాంబాల్ ) ఒకరు. ఆమె ‘ద్రౌపది వస్త్రాపహరణం’ (1934) లో నటించింది. కుంభకోణానికి చెందిన ఎం.ఆర్. సంతానలక్ష్మి కూడా రంగస్థలం నుండి సినిమాల్లోకి వచ్చి ‘రాధా కళ్యాణం’తో సినీ ప్రవేశం చేసింది. ఆమె 1950ల చివరి వరకు నటిగా కొనసాగింది. ఇలా ‘ఇసై వెలాలర్’ సంప్రదాయానికి చెందిన అనేకమంది కళాకారులు సినిమాల్లోకి వచ్చినప్పటికీ వీరిలో అత్యంత ప్రసిద్ధురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. ఆమె నాలుగు చిత్రాలలో నటించింది, వాటిలో ఎల్లిస్ ఆర్. డుంగన్ దర్శకత్వం చేసిన ‘మీరా’ ఆమెకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. అంతకుముందు సేవాసదన్ (1938), శకుంతల (1940), సావిత్రి (1941) చిత్రాల్లో ప్రధానమైన భూమికలను పోషించింది. ఐతే ఆమె బ్రాహ్మణుడైన సదాశివాన్ని పెళ్లి చేసుకోవడంతో ఆమె తనపై ఉన్న దేవదాసి ముద్రను చెరిపేసుకున్నది.
దేవదాసి వర్గానికి చెంది సినిమాల్లోకి ప్రవేశించి రాణించిన మరో నటి ఆర్.రాజకుమారి (1922-99). అసలు పేరు తంజావూరు రంగనాయకి రాజయి. ఈమె కర్ణాటక సంగీత విద్వాంసురాలు తంజావూరు కుచలాంబాల్‌ మనుమరాలు. యుక్త వయసులో రాజయిని చెన్నైలోని తన అత్తగారైన ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి వద్దకు పంపారు. ధనలక్ష్మి అప్పటికే సినిమాల్లో పేరున్న నాయిక. కె.ఎల్. సైగల్‌ ‘దేవదాస్’ (1936)లో చంద్రముఖి పాత్రను పోషించి సినీ రంగంలో ప్రవేశించింది. కె.సుబ్రహ్మణ్యం రాజకుమారితో ‘కచదేవయాని’ (1941) తీశాక ఆమెకు అవకాశాలు వరుస కట్టినవి.
దేవదాసి వ్యవస్థనుండి సినిమాల్లోకి ప్రవేశించిన నేపథ్య గాయకుల్లో ఎం.ఎల్.వసంతకుమారి కర్ణాటక గాయనీల్లో ప్రసిద్ధురాలు. ఎం కె త్యాగరాజ భాగవతార్ రాజముక్తిలో ఈమె మొదట పాడింది. తర్వాత ఉదయణన్, కృష్ణభక్తి, లైలా మజ్ను రత్నకుమార్ (1949), మణమగళ్, పెళ్లికూతురు (1951), దేవదాసు చిత్రాలలో 1965 వరకు అజరామరమైన పాటలు పాడింది. ప్రతిష్టాత్మక ‘సంగీత కళానిధి’, పద్మభూషణ్ పురస్కారం, మైసూర్ వర్సిటీ గౌరవ డాక్టరేటును అందుకుంది. ఈమె కుమార్తె శ్రీవిద్య కూడా మాస్టర్ పీస్ అనదగిన సినిమాల్లో నటించి జాతీయ పురస్కారం అందుకున్నది.
దేవదాసి వ్యవస్థ రద్దయిన తర్వాత ఆలయ నృత్యం ఆదరణకు దూరమైన సందర్భంలో నృత్య కళాకారిణిలే కాదు, నృత్య గురువులకు, పాటలు రాసిన రచయితలకు కూడా సినిమా రంగమే ఏకైక ఉపాధి కేంద్రమైంది. అలాంటి వారిలో ఒకరైన ముత్తుస్వామి దర్శకత్వంలో మాలైకళ్ళన్ (1954)లో ‘ఇసై వెలాలర్’ వర్గానికి చెందిన సాయి, సుబ్బులక్ష్మి ప్రదర్శించిన నృత్యం ఆయన ప్రతిభకు ఉదాహరణ. ‘రత్తక్కన్నీర్’ (1954)లోని నృత్యాలను ఆయనే కూర్చాడు. ఇందులో దేవదాసీలు తమ పోషకులను ఉద్దేశించి పాడే పాట నేపథ్యంలో ఇద్దరు కళాకారిణులు నృత్యం చేశారు. ‘మర్మవీరన్’ (1956) చిత్రంలో వైజయంతిమాల చేసిన సాంప్రదాయ దేవదాసీ శైలి ‘సాదిర్’ నృత్యం కూడా ఆయనదే. ఇంకా కే.ఎన్. దండాయుధపాణి పిళ్ళై, వళువూర్ రామయ్య పిళ్ళై వంటి ప్రఖ్యాత నట్టువనార్లు కూడా ఉన్నారు.

ప్రారంభ దశలో చలనచిత్ర నిర్మాతలు నాటక బృందాలపై ఆధారపడటం దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపింది. ఆనాటి నిర్మాతలు కెమెరాను ఒక సృజనాత్మక మాధ్యమంగా కాకుండా కేవలం రికార్డింగ్ సాధనంగానే వాడారు. ఇది ఒక రకమైన కళా రూపాన్ని యాంత్రికంగా చిత్రించడం మాత్రమే చేసేది. సమకాలీన ఇతివృత్తాలతో తీసిన ‘సోషల్స్’ తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ అవి కూడా ప్రసిద్ధ రంగస్థల నాటకాల ఆధారంగానే తయారైనవి. వీరు నాటక రంగానికి చెందిన నాటకీయత, సంగీతం, నటన శైలిని సినిమాలోకి తీసుకువచ్చారు. తద్వారా తమిళ సినిమా తన ప్రారంభ దశలో కంపెనీ డ్రామాల ప్రభావానికి లోనైంది. ఈ నాటక బృందాలు ప్రధానంగా పౌరాణిక ఇతివృత్తాలతో కూడిన నాటకాలను సినిమాకు అందించాయి. 1931 నుండి తొమ్మిదేళ్ల కాలంలో నిర్మించిన 210 చిత్రాలలో, ఏకంగా 177 చిత్రాలు పౌరాణిక ఘట్టాల ఆధారంగానే రూపొందాయి. ఈ చిత్రాల నటులంతా రంగస్థల నేపథ్యం ఉన్నవారే. ఆ తర్వాత 1935 నుండి సాంఘిక చిత్రాల రాకతో చిత్రనిర్మాతలు కథను దృశ్యరూపంలో చెప్పడానికి తగినంత పరిజ్ఞానం లేక మాటల ద్వారా కథ చెప్పడానికి అలవాటు పడ్డారు. సినిమాలో పాత్ర స్వభావాన్ని దృశ్యరూపంలో చూపించడం కంటే మాటల ద్వారానే వివరించేది. ఇది తమిళ చిత్రాలలో మౌఖికత ప్రాబల్యానికి దారితీసింది. ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. మరోవైపు పాటలు, నృత్యాల వల్ల పరధ్యానంలో పడి ప్రేక్షకులు అసలు విషయాన్ని గ్రహించలేకపోయారు. సంభాషణల ప్రాధాన్యత పెరిగి దృశ్యాల ప్రాధాన్యతను గుర్తించలేదు.
తమిళ సినిమా తొలిదశలో చురుకుగా ఉన్న ఇసై వేలలార్ కళాకారుల జాబితా చాలా పెద్దది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పూర్తిగా కొత్త కళారూపమైన తమిళ సినిమా ప్రారంభానికి, భవిష్యత్తుకు ఈ ఇసై వెలాలర్ కళాకారులే తొలి ఆధారమయ్యారు. వారు దేవదాసి వర్గానికి చెందినవారుగా సమాజం నుండి అవమానాలు ఎదుర్కొన్నారు. సినిమాకు ఇంత బలమైన ఆలంబనగా నిలిచిన దేవదాసి వ్యవస్థ గురించి సినీ చరిత్రలో ఎక్కడా సమగ్రంగా నమోదు కాలేదు. ఐతే మారిన సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వారంతా సినిమా రంగంలోకి ప్రవేశించారు. కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు అందుకునే స్థాయికి వెళ్లారు. అటువంటి వారిలో ఎస్.పి.ఎల్‌.ధనలక్ష్మి, టి.ఆర్. రాజకుమారిలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. వీరి గురించి సమగ్రంగా పై వారం.

స్వాతంత్ర్య పోరాటంలో కళావంతులు
19వ శతాబ్దం వరకు వారిని దేవదాసీలు, బాయిజీలు, నాట్య కత్తెలు వంటి పేర్లతో పిలిచేవారు. వారు కళలకు, సంస్కృతికి కేంద్రాలుగా ఉండి సంపదను, అధికారాన్ని, ప్రతిష్టను, రాజకీయ ప్రాబల్యాన్ని అనుభవించారు. ధనిక కుటుంబాలు తమ కుమారులకు సంభాషణా విద్యను నేర్పించడానికి వారి వద్దకు పంపేవారని అంటారు. కానీ బ్రిటిష్ వారు ఈ వ్యవస్థను వ్యతిరేకించేవారు. వలస పాలన భూభాగం పెరిగేకొద్దీ ఈ కళావంతుల హోదా క్రమంగా క్షీణించింది. వారిని వేశ్యలుగా ఎగతాళి చేసి వారి స్థావరాలను వ్యభిచార గృహాలుగా ముద్ర వేశారు. దాంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడ్డారు. వీరి కోఠేలు తిరుగుబాటుదారులకు రహస్య స్థావరాలుగా మారాయి. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. వారణాసిలోని వేశ్యల బృందం ఒకటి స్వాతంత్ర్య పోరాటానికి మద్దతుగా తవాయిఫ్ సభను ఏర్పాటు చేసింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తమ ప్రదర్శనలలో ఆభరణాలకు బదులుగా తలపాగాలు ధరించేవారు. 1882లో మద్రాసులో దేవదాసి వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. ఇది వారి జీవనోపాధిని నాశనం చేసింది. చాలామంది కళావంతులు బతుకుతెరువు కోసం వేశ్యా వృత్తిలోకి దిగారు. 1930లో ఆల్ ఇండియా రేడియో ప్రారంభమైంది. రేడియోతో కొందరు గాయనులుగా మారాలనుకున్నారు. ఐతే వారిని రేడియో స్టేషన్‌లోకి రానివ్వలేదు. వెయిటింగ్ రూమ్‌లు ఇతర సామాజిక వర్గాల కళాకారులతో నిండిపోయేవి. పౌర సమాజం నుండి బహిరంగ అపవాదును ఎదుర్కోలేక ఆల్ ఇండియా రేడియో కూడా తన తలుపులు మూసివేసింది. ఫలితంగా సౌందర్యానికి, కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ కళావంతులు చరిత్ర పుటల్లో కనుమరుగయ్యారు.

హెచ్‌.రమేష్‌‌బాబు,
93916 34727

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -