దక్షిణ భారతదేశంలో టాకి చిత్రాలు వచ్చినంక చాలామంది స్త్రీలు తెరపై కనిపించడానికి సినీ రంగంలోకి వచ్చారు. కానీ తెర వెనుక సాంకేతిక విభాగంలో పనిచేయడానికి వచ్చేవారు చాలా తక్కువ మంది కనిపిస్తారు. అందులో ఇండిస్టీలో ఉన్న ప్రముఖ దర్శకనిర్మాతల కుటుంబం నుండి వచ్చిన వారే కనిపిస్తారు. అట్లాంటి వారిలో మూకీల తరంలో మద్రాసులో రఘుపతి వెంకయ్య, సూర్య ప్రకాష్ లతో సైలెంట్ సినిమాలు తీసిన ఎ. నారాయణన్ భార్య మీనాంబాళ్ సౌండ్ ఇంజనీర్‌గా పని చేస్తే, ఆ తర్వాత ప్రసిద్ధ తమిళ దర్శకుడు కె. సుబ్రహ్మణ్యం భార్య మీనాక్షి సుబ్రహ్మణ్యం దక్షిణ భారత దేశంలో తొలి సినీ సంగీత దర్శకురాలిగా చరిత్రకెక్కింది.
మీనాక్షి సుబ్రహ్మణ్యం 1911 సెప్టెంబర్ 11న జన్మించింది. ఆమెకు మూడు రోజుల వయసున్నప్పుడు తల్లిని కోల్పోయింది. ఆమె తల్లి తరఫు తాతయ్య, అమ్మమ్మలైన విశాలాక్షి, రావు బహదూర్ కె.ఎస్. వెంకటరామ అయ్యర్, ఆమెను తమ కూతురిగా భావించి, తాము కోల్పోయిన ఆమె తల్లి పేరైన మీనాక్షి అని నామకరణం చేశారు. వారు ఆమెను ఎంత గారాబంగా పెంచాలంటే ఆమెను తరచుగా బంగారు నాణేల కుప్పపై కూర్చోబెడితే ఆమె వాటితో ఆడుకునేది.
మీనాక్షికి ఏడేళ్ళ వయసు కూడా నిండకముందే, ఒక గురువు ఆమెకు శ్రీవిద్యా మంత్రోపదేశం ఉపదేశించారు. ఆమె భక్తిశ్రద్ధలతో ప్రతిరోజూ గంటల తరబడి పూజలో గడిపేవాది. అమ్మమ్మ తాతల శిక్షణలో ఆమె నిష్ణాతురాలైన గాయనిగా తయారు కావడమే గాక వీణ, వయోలిన్, హార్మోనియం వాయించడంలో ప్రావీణ్యం సంపాదించింది. ఐతే సంగీతకారిణిగా వీణ ఆమెకు ప్రధాన బలం అయ్యింది.
మీనాక్షి రాసిన సంస్కత, తమిళ గీతాలను కంచి పరమాచార్యులు, రమణ మహర్షి, స్వామి చిన్మయానందలు విని ఆశీర్వదించారు. ఆమె రాసిన పాటల్లో చాలా వరకు ఆమె భక్తిభావ వ్యక్తీకరణే అయినప్పటికీ, ఆమె ప్రకతిని కీర్తిస్తూ, సమకాలీన సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ కూడా ఉన్నవి.
మీనాక్షికి తొమ్మిదేళ్లు సమీపిస్తుండగా వారి ఆచారం ప్రకారం ఆమె వివాహం నిశ్చయమైంది. వరుడు అప్పడికింకా విద్యార్థిగానే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన తన న్యాయవాద వత్తిని వదిలిపెట్టి సినీ దర్శకుడుగా మారాడు. అతనే దక్షిణ భారత సినీ పితామహుల్లో ఒకరైన ‘కె. సుబ్రహ్మణ్యం.’
మీనాక్షి చదువుతోపాటు దైవభక్తిని కూడా పెంచుకొని సంస్కత తమిళ భాషలు నేర్చుకున్నది. ఈ భాషా జ్ఞానంతో సొంతంగా భక్తి గీతాలు రాసింది. ఆమెకు సంగీత జ్ఞానం కూడా ఉన్నది గనుక తను రాసిన పాటలకు తానే స్వరాలు కూర్చి పాడటం మొదలుపెట్టింది. ఆమె తన 76 సంవత్సరాల జీవితంలో సుమారు 1000 పాటలు రాసింది. వాటిలో కొన్ని సాంఘిక సమస్యల మీద పర్యావరణం మీద సమాజం తీరుతెన్నుల మీద రాసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సమాజంలో స్త్రీ పురుష భేదాలు ఉండటం పట్ల ఆమె ఆందోళన చెందింది.
సుబ్రహ్మణ్యం 1940ల చివరలో గేయ రచయిత్రిగా, సంగీత స్వరకర్తగా మీనాక్షి ప్రతిభను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. బహుశా ఆమె దక్షిణ భారతదేశపు మొట్టమొదటి మహిళా సంగీత దర్శకురాలు. మహాత్మా గాంధీపై ఆమె రాసిన పద్యాలు విశేషమైనవి. కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశంలోని అసమానతల పట్ల ఆమెకున్న ఆందోళన, సుబ్రహ్మణ్యం తమిళ చిత్రం ‘గీతా గాంధీ’ (1948) కోసం ఆమె రాసిన పాటలలో వ్యక్తమైంది. ఈ చిత్రంలో నాటి ప్రసిద్ధ బి.ఎ. పెరియనాయకి, బి.ఎస్. సరోజ, బేబీ పద్మ, డి.ఆర్. రామచంద్రన్, లలిత-పద్మిని తదితరులు నటించారు. ఆ తర్వాత ఆమె ‘కచ దేవయాని,’ (1956) వంటి చలనచిత్రాలకు సంగీత దర్శకత్వం వహించింది.
మీనాక్షి భర్త కె.సుబ్రహ్మణ్యం సినిమా నిర్మాణ విషయాలలో తొలి దశలో ఏమి ఆసక్తి చూపలేదు. జోక్యం కూడా చేసుకోలేదు. గహిణిగా తన బాధ్యతలు చూసుకోవడంలోనే ఉండిపోయింది. సుబ్రహ్మణ్యం కల్కి రాసిన కథ ఆధారంగా తమిళంలో తీసిన దేశభక్తి చిత్రం త్యాగ భూమి. దేశ స్వాతంత్య్రాన్ని ఆకాంక్షిస్తూ బ్రిటిష్ వారిని ధిక్కరిస్తూ తీసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఫలితంగా వారి కుటుంబం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అప్పుడు మీనాక్షి ”మాకు ఈ సినిమాకు ఖర్చుపెట్టిన ధనం పోయినందుకు బాధ లేదు అది దేశభక్తికి పట్టం కట్టిన సినిమా. ఎందరో మహనీయులు తమ జీవితాలను, ఆస్తులను దేశ స్వాతంత్రానికి అర్పించారు. మేము కూడా అలాగే చేసాం అని సంతప్తి పడ్డాం.” అని ఒక సందర్భంలో ఆమె పేర్కొంది. ఆమె కె. సుబ్రహ్మణ్యానికి సాధారణ గహిణిగా ఆయన కష్టనష్టాలలో వెన్నుదన్నుగా నిలిచి తన స్త్రీ ధర్మాన్ని నిష్కల్మషంగా నిర్వర్తించింది. సినీ నిర్మాతగా తన భర్త కెరీర్‌లోని ఒడిదుడుకులకు ఆమె ఎప్పుడూ కలత చెందలేదు.
మీనాక్షి సుబ్రహ్మణ్యాన్ని ఆమె సంతానం అంతా కూడా ”పట్టా” అని, అప్పుడప్పుడు ”పట్టమ్మ” అని పిలిచేవాళ్ళు, కానీ ”అమ్మ” అని మాత్రం ఎప్పుడూ పిలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆమె నిజానికి అమ్మే. ఆమె తల్లి మాత్రమే కాదు తన సంతానానికి ఒక మంచి స్నేహితురాలిగా ఆమె మెలిగేది. ఆమె తన పిల్లలకు సంగీతం నేర్పించింది. వారందరిపై ఆమె ఒక అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. అది క్రమశిక్షణా పద్ధతిలో కాకుండా, కేవలం తన అపారమైన ప్రేమతో. ఆమె తన కుమార్తె నీలకు సంగీతం, సంగీత శాస్త్రాల ప్రాథమిక అంశాలలో శిక్షణ ఒక కచేరీ కళాకారిణిలుగా తీర్చిదిద్దింది. మధురైలోని ఒక సంగీత కళాశాలకు అధిపతి కావడానికి దోహదపడ్డారు. మరో కుమార్తె పద్మ సుబ్రహ్మణ్యం ఒక నర్తకిగా విజయం సాధించడంలో ఆమె అపారమైన కృషి చేశారు. పద్మా సుబ్రహ్మణ్యం శాస్త్రీయ నత్యకారిణిగా భారతదేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆమె భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారం అందుకుంది. తన కుమారుడు ఎస్.వి. రామనన్‌ను రంగస్థల ప్రదర్శనలకు, తన లఘు చిత్రాలకు సంగీతం సమకూర్చడానికి ఆమె ప్రేరేపించారు.
ఆమె తనకు పరిచయమైన ప్రతిఒక్కరికీ.. కళాకారులు, రాజకీయ ప్రముఖులు, తన భర్త స్నేహితులైన వామపక్ష నాయకులు, అలాగే మైలాపూర్ ఉన్నత వర్గాల వారికి ఎంతో ప్రియమైన వ్యక్తిగా మారింది.
తన భర్త సుబ్రహ్మణ్యం సినీ దర్శకుడుగా దక్షిణ భారతదేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ మరో స్త్రీ, తాను సినిమా రంగానికి పరిచయం చేసిన ఎస్.డి. సుబ్బలక్ష్మిని తన రెండవ పెళ్లి చేసుకోవడం మీనాక్షి సుబ్రహ్మణ్యాన్ని తీవ్రంగా కలచివేసింది. ఒక స్త్రీగా తన భర్తను మరో స్త్రీతో పంచుకోవడాన్ని ఆమె ఎట్టి పరిస్థితులలో అంగీకరించలేదు. ఆమె ఈ సందర్భంలో తన భర్తతో కొంత ఘర్షణ పడింది. తాను కూడా అంతఃసంఘర్షణకు గురై ఎంతో వేదనను అనుభవించింది. కానీ కొంత కాలానికి నాటి కాలమాన పరిస్థితుల అనుగుణంగా ఆమె స్థితప్రజ్ఞతతో ఆ విషయాన్ని సునాయాసంగా స్వీకరించింది.
ఐతే తమిళంలో దేశభక్తి, విప్లవాత్మక చిత్రాలు తీసి దక్షిణ భారతదేశంలో టాకీల శకంలో గొప్ప దర్శకనిర్మాతగా స్టూడియో అధినేతగా పేరుపొందిన కె.సుబ్రహ్మణ్యం కూడా సాధారణమైన పురుషుడిలాగే ప్రవర్తించడం మనం గమనించవచ్చు. కానీ స్త్రీగా మీనాక్షి సుబ్రహ్మణ్యం తన కర్తవ్యాన్ని ఏనాడు విస్మరించకపోవడం ఒక కొసమెరుపు.
కె.సుబ్రహ్మణ్యం తమిళంలో పావలక్కోడి (1934), నవీన సతారాం (1935), నవీన సారంగధర, ఉషా కళ్యాణం , భక్త కుచేల (1936), బాలయోగిని, మిస్టర్ అమ్మంజీ (1937), సేవా సదనం (1938). త్యాగ భూమి (1939). భక్త చేత , ప్రేమ సాగర్ (1940 హిందీ), కచ దేవయాని, ప్రహ్లాద (1941), అనంతశయనం (1942), కష్ణ సుధామ (1943), రాజా భర్తహరి (1944), మాన సంరక్షణ (1945), వికట యోగ్, (1946), విచిత్ర వనిత (1947), గోకుల దాసి (1948), కాపాతిక రక్షయక (1948 సింహళీ), గీతా గాంధీ (1948), అండమాన్ ఖైదీ (1951), స్త్రీ రత్న (1953 కన్నడ), కచ దేవయాని (1956 కన్నడ), పాండి తేవన్ (1959) వంటి సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించాడు.
బహుశా ఒక స్త్రీకి అసలైన పరీక్ష ఆమె తన కోడళ్లతో ఎలా కలిసిమెలిసి ఉండాలనే అంశంలో ఉంటుంది. తన కోడలు మోహన ఆ సమయంలో ఆమె ఒక ప్రభుత్వ పరిశోధనా సంస్థలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేసేది. తన కొడుకు కష్ణస్వామి మరో మహిళతో స్నేహంగా ఉంటున్నాడని అనుమానించినప్పుడు, ఆమె ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు గానీ, స్నేహితులకు గానీ చెప్పకుండా, నేరుగా తన అత్తగారితో చెప్పుకుంది. అత్త కోడల మధ్య అంత సన్నిహిత చనువు ఉండేది. అప్పుడు మీనాక్షి సుబ్రహ్మణ్యం తన కోడలును ముద్దుపెట్టుకుని ఇలా సలహా ఇచ్చింది: ”బాబు (ఇంట్లో కృష్ణస్వామిని పిలిచే పేరు) నిన్ను కేవలం ప్రేమించడమే కాదు. ప్రతి భర్త తన భార్యను గౌరవించినట్లే నిన్ను గౌరవిస్తాడు. నా మాటపై నమ్మకంతో నువ్వు అశాంతికి గురి కాకుండా నీ దాంపత్య జీవితాన్ని సంక్షోభంలోకి వేసుకోవద్దని ” ధైర్యం చెప్పి ఆమె కొన్ని వారాల పాటు కొడుకు ఇంట్లోనే ఉండి కోడలు, కొడుకు మధ్య మధ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసుకుంది. అప్పటి కాలమాన పరిస్థితులలో బహుభార్యత్వం తప్పు కాకపోవడం వల్ల పురుషుడు ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేవాడు.
సరిగ్గా మీనాక్షి సుబ్రహ్మణ్యం జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురై ఉన్నాయి కనుక, ఆమె ఈ సమస్యను సునాయాసంగా పరిష్కరించగలిగిందని అనుకోవచ్చు.
అందుకే ఆమె కొడుకు కృష్ణస్వామి ”మా తల్లి మీనాక్షి సుబ్రహ్మణ్యం బయోడేటాలోని వివరాలన్నింటికంటే ఆమె వ్యక్తిత్వం వెయ్యి రెట్లు విలువైనవి” అన్నమాటలు ఆమెకు సరిగ్గా సరిపోతాయి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా దక్షిణ భారత సినీ రంగంలో పేరుపొందిన మీనాక్షి సుబ్రహ్మణ్యం 1987లో కన్ను మూసి తన స్వరయాత్రను ముగించింది.
(మీనాక్షి సుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్. కృష్ణస్వామి రాసిన ఒక ఆంగ్ల వ్యాసం ఈ వ్యాసానికి కొంత ఆధారం.)
హెచ్ రమేష్ బాబు,
7780736386



