Sunday, May 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం25 నుంచి మహిళా వారోత్సవాలు

25 నుంచి మహిళా వారోత్సవాలు

- Advertisement -

​నవతెలంగాణ-హైదరాబాద్‌
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క అధికారులను ఆదేశించారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత, విద్యా పురోగతి, మహిళల జీవనోపాధి బలోపేతం వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ​మహిళా వారోత్సవాల నిర్వహణ, కార్యక్రమాల షెడ్యూల్, ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, శాఖ డైరెక్టర్ శృతి ఓజా తదితర అధికారులు పాల్గొన్నారు.​ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, సామాజికంగా మరింత శక్తివంతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంటును ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మహిళా సంఘాల ఆర్థిక శక్తికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు అధికారులు వివరించారు. ఈ నెల 25న, నిర్మాణం పూర్తి చేసుకున్న 100 గ్రామ మహిళా సంఘ భవనాలను ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రంలోని 8 వేల గ్రామాల్లో మహిళా సంఘ భవనాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 82 అంగన్‌వాడీ కేంద్ర భవనాలను ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. జిల్లా స్థాయిలో లోన్ మేళాలు నిర్వ‌హించ‌నున్నారు. 26వ తేదీన మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న 553 ఆర్టీసీ బస్సులను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ను ప్రారంభించ‌నున్నారు. ‘‘బాల్య వివాహం బతుకు ఆగం” పేరుతో బాల్య వివాహాల నిరోధానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. సామాజిక చైతన్య కార్యక్రమాలు, సోషల్ మొబిలైజేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -