జూరాల నుంచి సాగునీరందించాలి :సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూరాల ప్రాజెక్టు కింద పంటల్ని సాగుచేస్తున్న రైతుల సమస్యలను పరిశీలించేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్రాములు, తదితరులతో కూడిన బృందానికి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం తీవ్రంగా ఖండించింది. వారిని అక్రమంగా అరెస్టు చేసి మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పీఎస్కు తరలించడాన్నీ, వనపర్తి జిల్లాకు చెందిన సీపీఐ(ఎం) నాయకులను గృహనిర్బంధం చేయడాన్నీ తప్పుబట్టింది. జూరాల ప్రాజెక్ట్ కింద సాగునీరు అందక పంటలు ఎండిపోయి అల్లాడుతున్న రైతులకు తక్షణమే నీటిని విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేసింది. మంగళవారం ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శివర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించింది. జూరాల ప్రాజెక్ట్ కింద ఉన్న రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు నీటిని విడుదల చేసుకుంటే, పోలీసులు వాటిని మళ్లీ నిలుపుదల చేయించారని తెలిపింది. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడతాయని తెలిసికూడా గ్రామసభలు పెట్టి జూరాల కింద పంటలేయొద్దని అధికారులు చెప్పలేదని పేర్కొంది. ఎకరానికి రూ.30 వేల చొప్పున పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు విడుదల చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని వాపోయింది. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం ఎనిమిది టీఎంసీల నీళ్లున్నాయనీ, అందులో నుంచి కనీసం కొంత నీటినైనా వదిలితే పంటలను కాపాడుకునే అవకాశముందని సూచించింది. కర్నాటక ప్రభుత్వంతో సంప్రదించి నీటిని సాధించాలని కోరింది.
జాన్వెస్లీ బృందం అరెస్టును ఖండిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



