లేకుంటే పోరాటాలు తప్పవు.. కర్నాటకను ఒప్పించాలి
చేతికొచ్చే పంటలెండితే రైతులకు తీవ్ర నష్టం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
అన్నదాతలను కలిసేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) నేతలు
డ్యాం ముట్టడికి ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు
జాన్‌వెస్లీ సహా పలువురి అరెస్టు.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్
ప్రాంతీయ ప్రతినిధి/ఆత్మకూరు
జూరాల రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోతే ప్రతిఘటన పోరాటాలు తప్పవని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. మంగళవారం జూరాల ఆయకట్టు రైతులను కలిసేందుకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్రాములుతో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ నుంచి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలైన అనంతరం జాన్‌వెస్లీ మీడియాతో మాట్లాడారు. జూరాల పరిధిలో అనేక మంది రైతులు వరి పంటను సాగు చేశారని, లక్షల్లో పెట్టుబడులు పెట్టారని గుర్తు చేశారు. విత్తనాలు, సాగుకు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల్ని సరఫరా చేసి సాగుకు సహకరించిన ప్రభుత్వం.. ఇప్పుడు సాగునీటిని ఇవ్వకపోతే పంటలు ఎలా పండుతాయని ప్రశ్నించారు. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు ఎలా తీరుతాయో పాలకులే చెప్పాలన్నారు. ఎల్ నినో ప్రభావం ఉందని తెలిసినా ప్రభుత్వం గ్రామ సభలను ఏర్పాటు చేసి వరి పంటలను వేయరాదని ఎందుకు అవగాహన కల్పించలేదన్నారు.
పొట్టచేతికొచ్చిన దశలో సాగునీటిని నిలిపేస్తే ఎలా అని ప్రశ్నించారు. జూరాల రిజర్వాయర్ లో ఇప్పటికీ 8.05 టీఎంసీల నీటి నిల్వ ఉందని, రిజర్వాయర్ నుంచి రెండు టీఎంసీల నీటిని విడుదల చేస్తే సాగు చేసిన పంటలు చేతికి వస్తాయన్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల వరదలు వస్తున్నాయని, ఒక వైపు అధికారులు చెబుతూ మరోవైపు నీటిని నిలిపేయ డం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువన ఉన్న కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉన్నదని, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఇరు రాష్ట్రాల ముఖ్యమం త్రులు చర్చించి జూరాలకు సాగునీటిని విడుదల చేసేలా కృషి చేయాలని సూచించారు. పంటలను పరిరక్షించడం కోసం ఎటువంటి ప్రయత్నం చేయకుండా ప్రశ్నించిన నాయకుల గొంతు నొక్కి అరెస్టుల పర్వంతో భయాందోళనలు సృష్టించడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుగజేసుకొని నీటి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
జూరాల డ్యాం వద్ద ఉద్రిక్తత…
సీపీఐ(ఎం) కార్యకర్తల అరెస్టు
ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జూరాల డ్యాం ముట్టడికి ప్రయత్నించారు. సీపీఐ(ఎం) శ్రేణులు, రైతులు తరలిరావడం, పోలీసులు భారీగా మోహరించడంతో ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జలాశయంలో నీటి నిల్వలను పరిశీలించి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసేందుకు రైతులతో కలిసి సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు డ్యాం వద్దకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పైనుంచి వరద వస్తున్నా నీటిని ఎందుకు వదలడం లేదని అమరచింత మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ గోపి ప్రశ్నించారు.
రిజర్వాయర్లో ఇప్పటికీ ఎనిమిదిన్నర టీఎంసీల నీళ్లు ఉన్నాయని, సాగునీటికి మూడు టీఎంసీలు వదిలేసిన మరో ఐదున్నర టీఎంసీల నీరు నిల్వ ఉంటదని, ఆ నీటిని ఎందుకు వదలడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఏమాత్రం కనికరం లేకుండా వారిని ఈడ్చుకుంటూ డీసీఎంలో ఎక్కించారు. అరెస్టైన వారిలో సీపీఐ(ఎం) నాయకులు జీఎస్ వెంకటేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ రెడ్డి, నాయకులు ఆర్ ఎన్ రమేష్, మంద రాజు, అజయ్, కురుమూర్తి తదితరులు ఉన్నారు.



