టీజీ20 లీగ్ ప్రాంఛైజీలకు హోరాహోరీ పోటీ
జూన్ 20 నుంచి టీ20 లీగ్ ఆరంభం
నవతెలంగాణ-హైదరాబాద్
టీజీ20 లీగ్ ప్రాంఛైజీల కోసం రియల్ ఎస్టేజ్, ఫార్మా కంపెనీ, మీడియా కంపెనీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. అరంగ్రేట లీగ్‌లో ఎనిమిది ప్రాంఛైజీలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) శనివారం వేలం నిర్వహించింది. వేలంలో పోటీపడేందుకు 42 కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ లభించినా.. కనీస బిడ్ ధర రూ.3 కోట్లు చెల్లించిన సంస్థలకు మాత్రమే వేలంలో పోటీపడే అవకాశం దక్కింది. దీంతో 13 కంపెనీలు ప్రాంఛైజీల కోసం కాసుల వర్షం కురిపించేందుకు సిద్దమయ్యాయి. ఎనిమిది ప్రాంఛైజీల వేలంతో హెచ్‌సీఏ రూ.46.15 కోట్లు ఖజానాలో వేసుకుంది. రూ.7.5 కోట్ల రికార్డు ధరకు ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ (ఈనాడు) హైదరాబాద్ ప్రాంఛైజీని దక్కించుకోగా.. ప్రణవ/బూరుగు ఇన్‌ఫ్రా సంస్థ రూ.7.2 కోట్లకు రంగారెడ్డి ప్రాంఛైజీని సొంతం చేసుకుంది. వరంగల్ ప్రాంఛైజీని బైన్ గ్లోబల్ రీసోర్సెస్ రూ. 6.55 కోట్లకు, మెదక్‌ను బృంద ఇన్‌ఫ్రా రూ. 6.33 కోట్లకు కొనుగోలు చేశాయి. నల్లగొండ ఫ్రాంచైజీని కిషోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ రూ. 5.06 కోట్లకు, కరీంనగర్ ప్రాంఛైజీని ఈఐపీఎల్ గ్రూప్-తిబరుమాల్ రూ. 4.57 కోట్లకు దక్కించుకోగా.. మహబూబ్‌నగర్ ప్రాంఛైజీని వీరభద్ర స్టీల్స్ రూ. 4.50 కోట్లకు, ఖమ్మం ఫ్రాంచైజీని అన్విత గ్రూప్ రూ. 4.44 కోట్లకు దక్కించుకున్నాయి. వేలం అనంతరం ప్రాంఛైజీలు జెర్సీలను సైతం ఎంచుకున్నాయి. హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి, టీజీ20 జీసీ చైర్మెన్ ఆగం రావు ప్రాంఛైజీల యజమానులను ప్రకటించారు.
జూన్ 20 నుంచి షురూ :
టీజీ20 ప్రాంఛైజీల వేలం ముగియగా.. జూన్ 7న ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. టీజీ20లో పోటీపడేందుకు ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. జూన్ 20న ఆరంభ మ్యాచ్‌తో టీజీ20 షురూ కానుండగా, జులై 11న ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. 21 రోజుల పాటు 32 మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్, జియోస్టార్‌లో ప్రసారం చేసేందుకు ఆ ప్రసారదారుతో హెచ్‌సీఏ ఒప్పందం కుదుర్చుకుంది. టీజీ20 లీగ్‌లో అన్ని మ్యాచ్‌లను ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తామని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి తెలిపారు.


