జుట్టుపోలుగాడు : ఒరే కేతిగా బతకడం ముఖ్యమా? ఓటుండటం ముఖ్యమా?
కేతిగాడు : ముందు బతుకు. తర్వాతే ఓటు.
జుట్టుపోలుగాడు : అది పాతకాలం పద్ధతి. మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ఓటే ముఖ్యం. పద్దెనిమిదేళ్లు వయసు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటెయ్యాల. మెజార్టీ వచ్చిన వాళ్లతో ప్రభుత్వం ఏర్పడుతుంది. మైనార్టీ వచ్చినోళ్లు చచ్చినట్టు పడుండాల. మెజార్టీ ప్రభుత్వం మన బాగోగులు చూసుద్ది. అందువల్లే
ఓటేయడం ముఖ్యం.
కేతిగాడు : ఓటున్నోళ్లు ఓటేస్తారు. మరి లేనోళ్లు.
జుట్టుపోలుగాడు : అంటే పరాయిగాళ్లు, ఈ దేశానికి వలసొచ్చినోళ్లు. దొంగ ఓట్లు ఏస్తామంటే ఎట్టా కుదురుద్ది?
కేతిగాడు : అది కాదురా.. ఈ దేశం వాళ్లే పొట్ట చేతపట్టుకుని బతుకు తెరువుకోసం వేరే రాష్ట్రాలకు, పట్నాలకు పోతే మరి వాళ్లకెలా..?
జుట్టుపోలుగాడు : వారు కావాలనుకుంటే వారికి ఓటు వుంటుంది. లేకపోతే పోతుంది.
కేతిగాడు : ఎలా?
జుట్టుపోలుగాడు : ఎలా ఏంటి? ఓటర్ల జాబితాలో వాళ్లు తమ పేరు చూసుకోవాలి. అది వారి బాధ్యత.
కేతిగాడు : వారికంత జ్ఞానం, తీరుబడి లేకపోతే.
జుట్టుపోలుగాడు : అఘోరిస్తారు. అది వారి ఖర్మ. నోర్మూసుకుని పడి వుండాలి.
కేతిగాడు : మరి ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎలా అమలవుతుంది?
జుట్టుపోలుగాడు : ఈ పితలాటకం పోవాలనే.. ఎన్నికల కమిషన్ ‘సర్’ ప్రక్రియ చేపట్టింది తెలుసా.. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. భారీ స్థాయిలో ఓటర్ల జాబితా దిద్దుబాటు. తప్పులను సరిదిద్దడం, నకిలీ ఓటర్లను తీసేయడం, వలస పోయిన వారి వివరాలు తాజా పర్చడం ఈ ‘సర్’ ప్రత్యేకత.
కేతిగాడు : అవునవును. ప్రతిపక్షాలు అధికారంలో వున్నచోట, వారిని ఓడించేందుకు కేంద్రంలోని బిజెపి సర్కార్ ఈ ‘సర్’ను ఉపయోగించుకుందన్నదని, అసలు పారదర్శకత, జవాబుదారీ అంటే ఏమిటో ఈ ‘సర్’కు… అదే ఎన్నికల కమిషన్‌కు అసలే లేదని విమర్శకులు ఘోష పెడుతున్నారు. అయినా దున్నపోతు మీద వాన కురిసినట్టు నడిచిపోతున్నది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 90 లక్షల ఓట్లను తీసేసింది. చెప్పగా.. చెప్పగా.. నీ భాషలో అంటే కష్టపడి సర్టిఫికెట్లతో దృవీకరించుకోగా 30 లక్షల ఓట్లు జాబితాకు ఎక్కాయి. మిగిలిన 60 లక్షల మంది మాటేంటి? గల్లంతయ్యాయి.
జుట్టుపోలుగాడు : వారంతా అక్రమ ఓటుదార్లు. పరాయిగాళ్లు. వలస వచ్చిన ఇతర దేశస్థులు. మీలాంటివాళ్లు ఎప్పుడూ ఇలా లొల్లి చేస్తున్నారనే సుప్రీం కోర్టు ధర్మాసనం దీనికి భరతవాక్యం చెప్పింది.
కేతిగాడు : ఏమని?
జుట్టుపోలుగాడు : ‘సర్ ప్రక్రియ పరమ పవిత్రమైనది. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్వవస్థకు సర్ అవశ్యం. రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని తేల్చేసింది’. అసలు ఈ ‘సర్’ ప్రక్రియలో ఎలాంటి చట్ట ఉల్లంఘన కూడా జరగలేదని తేల్చిపారేసింది.
కేతిగాడు : నిజమేమరి. వడ్డించేవాడు మనవాడైతే కడ బంతిలో కూర్చొన్నా మన తిండి మనకు దక్కుద్ది.
జుట్టుపోలుగాడు : అంటే ఏంటి నీ ఉద్దేశ్యం? అందరూ తప్పులు చేస్తున్నారు అనా..?
కేతిగాడు : నా ఉద్దేశ్యం ఏమిటి అంటే.. 1. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఇప్పుడు ఓటు లేకపోవడం ఏమిటి? 2. ఓటర్ల జాబితాలో ఓటు లేకపోతే ఇక పరాయి దేశస్థులమైపోతామా..? ఈ రెంటికి సమాధానం కావాలి?
బంగారక్క : అవును. సమాధానం కావాలి. మావ అడిగిందాంట్లో న్యాయం వుంది. అలాంటి భయం వున్నవాళ్లు, ఓటు హక్కు కోల్పోయినవాళ్లు లక్షల సంఖ్యల్లో వున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పారదర్శకత, జవాబుదారీనే కీలకం. మసిపూసి మారేడుకాయ చేయడం కుదరదు. ‘అశ్వద్ధామ హత:కుంజర:’ అన్నట్టు ఒక వ్యక్తి పౌరసత్వాన్ని అంతిమంగా నిర్దేశించేది ఓటర్ల జాబితా కాదని, ఆ అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని సుప్రీం కోర్టు తెలపడం కొంత ఊరట. అయితే అధికారంలో వున్నవారు ‘జాతీయ వాదం’ పేరిట విద్వేషాలు రెచ్చగొడ్తున్నారు. బతుకు తెరువుకై వలస వచ్చిన పేదల్ని పరాయివారిగా చూపుతూ ముద్దాయిలను చేస్తున్నారు. మెజార్టీబలంతో అందలాలెక్కేందుకు అర్రులు చాస్తూ నానా కుట్రలు పన్నుతున్నారు.
మైనార్టీలను, కష్టజీవులను శత్రువులుగా పరిగణిస్తూ హింసను ప్రేరేపిస్తున్నారు. జాలి, దయ, మానవత్వం వారి నిఘంటువుల నుండి కనుమరుగైపోయాయి. మనుషుల్ని పట్టుకుని చెదపురుగులు, బొద్దింకలు అంటూ ప్రేలాపనలు పేలుతున్నారు. వలస కార్మికుల్ని ఒక మతానికి ముడిపెట్టి వారి వల్ల మిగిలినవారికి ప్రమాదం ఏర్పడిందని అభద్రతాభావం సృష్టిస్తున్నారు. వలస కార్మికుల్ని ఓటర్ల జాబితా నుండి తొలగించడం, పరాయివారిగా ముద్రవేయడం, తద్వారా మెజార్టీని పొంది అధికారాన్ని కైవసం చేసుకోవడం ఒక పద్ధతిగా చెలామణి చేస్తున్నారు. అందుకు రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపర్చడం, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడం మనం గమనిస్తూనే వున్నాం. అయితే మన భారతీయులు కూడా విదేశాల్లో ఇలాగే పరాయిగా బతుకుతున్నారనే సోయి పాలకులకు వుండాలి. అందుకే ఎవరికైనా ముందు బతుకుపోరే ముఖ్యం.
– కె.శాంతారావు, 9959745723



