పెర్కిట్ సొసైటీ కార్యాలయానికి తాళం వేసిన రైతులు
నవతెలంగాణ-ఆర్మూర్
యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజామా బాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయానికి రైతులు శనివారం తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ (యూరియా యాప్) ద్వారా ఎరువులు పొందే విధానంలో సర్వర్ డౌన్ సమస్యలు, సాంకేతిక లోపాలు, ఓటీపీ రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. యాప్ ఓపెన్ చేయగానే చాలా సందర్భాల్లో ‘నో స్టాక్’ (స్టాక్ లేదు) అని చూపించడం లేదా సర్వర్ లోపాల వల్ల ఓటీపీలు సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది రైతులకు స్మార్ట్‌ఫోన్ల వాడకం, ఆన్‌లైన్ బుకింగ్ విధానాలపై అవగాహన లేకపోవడంతో వ్యవసాయ అధికారులపైనా, ఇతరుల పైనా ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. యూరియా కోసం గంటల తరబడి ఫోన్ల ముందు, సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ యూరియా యాప్ విధానాన్ని వెంటనే పూర్తిగా రద్దు చేయాలని కోరారు. గతంలో మాదిరిగానే విలేజ్ సొసైటీల ద్వారా నేరుగా రైతులకు ఎలాంటి నిబంధనలూ లేకుండా యూరియా బస్తాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సాగు సీజన్‌కు సొసైటీల్లో తగినంత యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలన్నారు. స్థానిక ఎస్‌ఐ ఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడి.. శాంతింపజేశారు.
యూరియా యాప్‌ను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



