Friday, August 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏఎన్ఎంలపై పనిభారం తగ్గించాలి

ఏఎన్ఎంలపై పనిభారం తగ్గించాలి

- Advertisement -

రెగ్యులర్ నియామకాలు వెంటనే పూర్తి చేయాలి : తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్
కోఠి కమిషనరేట్ ఎదుట ధర్నా

​నవతెలంగాణ -సుల్తాన్ బజార్

వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్), ఏఎన్ఎంలపై పనిభారాన్ని తగ్గించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. యాదనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రెగ్యులర్ నియామకాలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కోఠిలోని కమిషనర్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా భూపాల్‌ మాట్లాడుతూ.. మాతా, శిశు సంరక్షణ సేవల నమోదు కోసం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌‌(ఆభా)ను తప్పనిసరి చేయడంతో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. చాలామంది గర్భిణులు పుట్టింట్లో లేదా అత్తవారింట్లో నమోదు చేసుకోవాలని కోరుతుండగా, ఏఎన్ఎంలపై నమోదు లక్ష్యాల ఒత్తిడితో ఎక్కడ కనిపించినా వెంటనే నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఆభా సృష్టికి అవసరమైన ఓటీపీ ఇవ్వడానికి సైబర్ నేరాల భయంతో ప్రజలు నిరాకరిస్తున్నారని, ఆధార్ వివరాలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వడానికీ వెనుకాడుతున్నారని తెలిపారు. ఎంసీహెచ్ సేవలతోపాటు ఎన్‌సీడీ, ఇమ్యునైజేషన్ తదితర అన్ని సేవలకూ ఆభా లింకింగ్ తప్పనిసరి చేయడం వల్ల ఏఎన్ఎంలపై అదనపు భారం పడుతోందన్నారు.

ముఖ్యంగా చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే తల్లిదండ్రులను ఓటీపీ అడగడం ఆచరణలో సాధ్యం కావడం లేదని చెప్పారు. యాదనాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 1,931 ఏఎన్ఎం పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి మూడేండ్లు గడిచినా నియామక ప్రక్రియ పూర్తి చేయకపోవడం అన్యాయమన్నారు. వెంటనే నియామకాలను పూర్తి చేయాలని, కాంట్రాక్టు ఏఎన్ఎంలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. రెగ్యులర్ ఏఎన్ఎంలకు పెండింగ్‌లో ఉన్న 12, 18 సంవత్సరాల ప్రత్యేక ప్రమోషనల్ పోస్ట్ ఇంక్రిమెంట్లు విడుదల చేయడంతోపాటు అర్హులైన వారందరికీ ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసి సమస్య లపై చర్చించారు. తమ పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని, మిగిలిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్టు యూనియన్ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియుద్దీన్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఏ. కవిత, డి.కిరణ్మయి, నాయకులు పద్మ, పుష్పలత, సంపూర్ణ, సరోజ, కవిత, స్రవంతి, జ్యోతి, సులోచన, లక్ష్మి, మహేశ్వరి, ఐలా జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -