నవతెలంగాణ – హైదరాబాద్: భూవివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు రూ.50 వేల జరిమానా విధిస్తూ జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ధిక్కరణ కింద ఈ చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మండలం, యూసఫ్‌గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 45లో ఉన్న రెండెకరాల భూవివాదంపై మహ్మద్ షఫాహతుల్లా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయస్థానం యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ ఆదేశాలను ఉల్లంఘించి అధికారులు ప్రహరీ గోడ కూల్చివేసి, కంచె ఏర్పాటు చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్‌పై తాజాగా జరిగిన విచారణలో.. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇచ్చినా ‘హైడ్రా’ స్పందించకపోవడంపై జస్టిస్ శ్రవణ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేటస్ కోను ఉల్లంఘించడాన్ని తప్పుబడుతూ కమిషనర్‌కు జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్‌కు చెల్లించాలని, ఆ తర్వాతే కేసులో కౌంటర్ అఫిడవిట్‌ను స్వీకరించాలని రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.



