నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ ఓటు గల్లంతయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా మైదాన్ మైవా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో నుంచి ఆమె ఓటును తొలగించడం కలకలం రేపింది. ఈ ఘటన సంచలనంగా మారడంతో అధికారులు స్పందించి, విచారణకు ఆదేశించారు. అయితే అదే ప్రాంతానికి సంబంధించిన లోక్‌సభ, అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లో మాత్రం ఆమె పేరు ఉన్నట్లుగా తెలిపారు.
కాగా, జూన్ 10వ తేదీన విడుదలైన పంచాయతీ ఓటర్ల జాబితాలో మాత్రం స్మృతి ఇరానీ పేరు లేదు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చి సంచనలంగా మారడంతో జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ చౌహాన్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. విచారణకు సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాతే ఓటు తొలగింపుపై స్పష్టత వస్తుందని తెలిపారు.



