నవతెలంగాణ – హైదరాబాద్: ఆధునీకరణ, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో భవిష్యత్‌లో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం.. రాష్ట్రంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా రోడ్లు, రవాణా వ్యవస్థ, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరుగుతోందని.. దీనికి దీర్ఘకాలిక పరిష్కారాలు అమలు చేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు. ఇప్పటికే సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే శాశ్వత పరిష్కారం కాదని.. నగర రవాణా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ ట్రాన్స్‌పోర్ట్ మోడల్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ విధానం ద్వారా భూమి అడుగుభాగంలో అండర్‌పాస్‌లు, నేలపై సర్ఫేస్ రోడ్లు, పైభాగంలో ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఒత్తిడిని విభజించేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. దీని ద్వారా నగరంలో వాహనాల రాకపోకలు మరింత వేగవంతమవడంతో పాటు ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.



