Saturday, May 9, 2026
E-PAPER
Homeసోపతినేనసలే మంచోన్ని కాను

నేనసలే మంచోన్ని కాను

- Advertisement -

జుట్టుపోలుగాడు : తుర్‌.. తుర్‌.. తుర్‌… తుపాకి రాముడ్నొచ్చిన. అరె పిట్టలదొర్ని అచ్చిన. లత్కోర్‌ సాబ్‌ను అచ్చిన. ఎవడు ఏ పేరుతోనైనా పిల్చుకోండ్రి. ఫికర్‌ లేదు. కళ్లకు నల్లకళ్లద్దాలు, చేతిలో మిషన్‌ గన్‌, సూటూ బూటు, బ్యాక్‌ గ్రౌండ్ల ఢాం.. ఢాం.. బాంబుల మోత, సమజవుతులా బే ఇంకా నేనెవర్నో..? ఎవడేమనుకుంటే నాకేంటి? ‘నేనసలే మంచోడ్ని కాను’ గిప్పుడిది నా టైటిల్‌.

కేతిగాడు : గెటప్‌ ఓకే. ఇక ఇరగదీసి పారేరు.
జుట్టు పోలుగాడు : నా అసుమంటోడు గీ భూమ్మీద గింతకుముందు పుట్టలేదు. గిక పుట్టబోడు. నాకు నేనే నెంబర్‌ వన్‌.
కేతిగాడు : ట్రైల్‌పార్ట్‌ చాలు. సినిమా చూపించెహె.
జుట్టుపోలుగాడు : నేను తుపాకి రాముడ్నని గెన్ని సార్లు చెప్పిన గీ పెపంచకానికి సమజవుతలా. ఆర్నీ.. నా మీదే కాల్పులారా..? పిస్తోలు పెట్టి కాలిస్తే నేను భయపడే రకమేనా? అసలు ఏమనుకుంటున్రా భారు. దునియామే సవాల్‌. జర వినుకోండి. నేనేమనుకుంటే గదే జరగాలా. గీ పెపంచకం నా చుట్టూతానే బొంగరంలా గిర్గిరా తిరగాలా.

ఆడెవడో లొట్టపీసుగాడు, నా మీదకె తెగబడ్తాడ్రా. రుబాబు చేశాడు. ఓకే. ఫాయిదా ఏంది? అందర్కీ ఎరుకేగా. గిప్పుడు… నా కెతిరేకంగా మస్తు జనం లచ్చల్లో, కోట్లల్లో రోడ్లెక్కుతున్నారు. నా అమెరికాలో కూడా. గయితే ఏమైంది? నాకేమన్నా ఫికరా, భయమా… సిగ్గా, లజ్జా… సిగ్గూ లజ్జున్నోడు ఎవడైనా గీ బాడకోవ్‌ రాజకీయం చేస్తాడ్రా? చెప్పుండ్రీ… అరె చెప్పానుగా భారు. నేనసలే మంచోన్ని కానని. మీడియాలో ఏం చెప్పాన్రా. గప్పుడే బూల్‌ గయా. నా మీద ఎటాక్‌. అంటే అది అమెరికా దేశంపైనే ఎటాక్‌ కాదు కాదు, అందేంది… ఆ.. అమెరికా రాజ్యాంగంపైనే ఎటాక్‌ అని పబ్లిక్‌గానే చెప్పాను. ఇంకేంట్రా బరాబర్‌ సరి. గా ముచ్చట గంతటితో ఒడిసింది.

కేతిగాడు : ఓరోరి… పెట్రోల్‌ డీజిల్‌ గురించి మాట్లాడవారా..
జుట్టుపోలుగాడు
: వస్తున్నా… వస్తున్నా… గీ పంపంచానికి చమురు సంక్షోభం ఎవనివల్ల అచ్చింది. నా వల్లే. గీ ఒక్కడే. నెంబర్‌ 1. పందులు మందలుగా వస్తాయి. సింహం సింగిల్‌ గా వస్తుంది. దానికి జూలు, కోరలు, తోక వుంటాయి. తక్కినదంతా సేమ్‌ టు సేమ్‌.
కేతిగాడు : అది బట్టలేసుకోదు, పనైపోయాక కడుక్కోదు.
జుట్టుపోలుగాడు : రేరు, రెచ్చగొట్టమాకు. గిప్పుడీ తుపాకి రామునిపై తుపాకి దాడి ముచ్చటగా మూడోసారి. విలేకర్ల దావత్‌ మీటింగ్‌లోనే ఆడు చేశాడ్రా. మనలో మన మాట గాడెవడోగాని గొప్పోడ్రా. నాతో పాటు నా వైస్‌ ప్రెసిడెంట్‌ మీద కూడా జమాయించి కాల్చాడు. మన అమెరికా వాళ్లకు 100కు నూటపాతిక తుపాకులుంటాయని రుజువు చేశాడ్రా. మా సెక్యూరిటీగాళ్లొచ్చి మమ్మల్ని లాక్కెళ్లి దాపెట్టారనుకో.. గిప్పుడు అసలు ముచ్చట. అద్దంలో చూస్కుంటూ మాట్లాడాలి (స్వగతం).

అసలు గాదాడేంది? ఎందుకు జరిగిందీ? నాకు తెల్వాల. నా తుపాకీ దిమాఖ్‌ను జనం తట్టుకోలేకపోతున్రా? లేక అమెరికా ఖజానా ఖాళీ అవుతుందా? లేక ఇజ్రాయిల్‌ దోస్త్‌ మాటలిని బేవకూఫ్‌గా యుద్ధంలో దిగానా..? అయిందేదో అయింది. ముందుకీ పోలేం. ఎనక్కీ రాలేం. గదేంది నా మీద సింపతీ చూపడం లేదెవడూ. గదిప్పుడు కావాలె నాకు. నీయవ్వ ఇండియన్‌ పి.ఎం. కూడా నంగినంగి ఆ నస్కుడేంది? పిస్కుడేంది? ఇజ్రాయిల్‌ పి.ఎం.ను వాటేస్కుని మీది ఫాదర్‌లాండ్‌, మాది మదర్‌లాండ్‌ అన్నాడే. ఆర్ని, ఆ పాటి చెయ్యనారా నేను. గదీ చూస్తా. నన్నెవ్వడూ లవ్‌ చేయనంత మెంటల్‌గాడ్నై పోయానా. ఏంది? ఛ.. ఛ.. నా మీద నాకే పరేషాన్‌. వార్ని! ఇగో ను సాటిస్‌ఫై చేసుకోవాలంటే దిల్‌ ఎంత లొల్లి చేస్తుంది? నా దోస్తులు మద్దతివ్వడాన్కి జంకుతున్నారేంటి? గీ సెంట్‌పర్సంట్‌ తుపాకి రాముడంటే జనానికి భయమన్నా వుండాలి. భక్తైనా వుండాలి. అసలే నేను మంచోన్ని కాదు.

నా చేతిలో గీ తుపాకీనే కాదు, గంతకు మించి పవర్‌ఫుల్‌ గన్స్‌ వున్నాయి. డాలర్‌ గన్‌, డ్రగ్స్‌ గన్‌, మాఫియా గన్‌, మీడియాగన్‌, కల్చర్‌ గన్‌, కార్పొరేట్‌ గన్‌ ఇలా… మస్తు మస్తుగా ఎన్నో ఎన్నెన్నో… చైనా, ఇండియాలు నరక కూపాలు. ఎన్నికలవగానే ఇండియాలో గాస్‌ ధరలు పెరిగినాయా లేదా? గా చైనా, ఇండియా సాఫ్ట్‌వేర్‌ గాళ్లని ‘ల్యాప్‌టాప్‌లు సంకలో పెట్టుకొచ్చిన గ్యాంగ్‌స్టర్స్‌’ అని బనాయించినా.. కడుపుతో వచ్చి పిల్లల్ని కని సెటిలైపోవాలని చూస్తుండ్రు…
బంగారక్క : ఇప్పటికిది చాలు. రోతపుడుతుంది. కనీసం మాటల్లో మర్యాద తెలియని వాళ్లు నేతలైతే స్వాభిమానం, మనసున్న వాళ్లు ఎలా గాయపడ్తారో తెలుస్తుంది.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -